కారణజన్ములు

ABN , First Publish Date - 2020-05-17T10:42:43+05:30 IST

ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్న సమయంలో ఒక్కొకసారి అనూహ్యంగా కొన్ని దుష్ట సమూహాలు సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి.

కారణజన్ములు

‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మ సంస్థాపణార్థాయ సంభవామి యుగే యుగే’’


ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్న సమయంలో ఒక్కొకసారి అనూహ్యంగా కొన్ని దుష్ట సమూహాలు సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ప్రజలు భరించలేని స్థితికి వస్తారు. అటువంటి సమయంలో ఎక్కడో ఒక చోట మహా పురుషులు జన్మిస్తారు. వారే కారణజన్ములు. వారి జీవిత పరమావధి ప్రజా సంక్షేమం. శాంతి స్థాపన. దుష్టశిక్షణ. శిష్టరక్షణ! 


ద్వాపరయుగంలో ఒకానొక దశలో ధర్మగ్లాని ఏర్పడింది. తన చెల్లెలు దేవకి కొడుకు చేతిలో తనకు చావు ఉందని చెప్పిన జోస్యం నమ్మి దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని జైలులో నిర్బంధించాడు కంసుడు. వారికి జన్మించిన ఏడుగురు శిశువుల్ని పురిటిలోనే చంపి పాపం మూటగట్టుకున్నాడు. ఎనిమిదవ వానిగా పుట్టినశిశువును వసుదేవుడు యుక్తిగా నందగోకులంలో నందుని భార్య యశోద ఒడిలో చేర్చాడు. కృష్ణుడు అనే పేరుతో ఆ శిశువు యశోదానందుల ఇంట పెరిగాడు. అంతకు ముందే దేవకీ దేవి అక్క రోహిణికి జన్మించిన బలరాముడు కృష్ణునితో కలిసి పెరిగాడు. ఆ అన్నదమ్ములిద్దరిదీ చిరస్మరణీయమైన ఐక్యత! ఆ కృష్ణ బలరాములిద్దరూ తన కన్నుగప్పి పెరిగిన మేనళ్లుల్లేనని కంసుడికి ఆలస్యంగా తెలిసింది. వారిని చంపడానికి కంసుడు కుట్రలెన్ని పన్నినా, అన్నీ విఫలమయ్యాయి. తుదకు జనాదరణ కోల్పోయిన కంసుడిని కృష్ణుడు అవలీలగా సంహరించాడు. అతని అనుచరయోధులను బలరాముడు హతమార్చాడు. దుష్ట సంహారం జరిగింది.  మధురానగరం శాంతినిలయమైంది. 


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం


‘‘లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మహాని జరుగుతుందో, ఎప్పుడు అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నన్ను నేను సృజించుకొని అవతరిస్తాను’’ అని కృష్ణుడు చెప్పాడు. అటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది యథేచ్ఛగా ధర్మహాని జరుగుతున్నది. హత్యలు, అత్యాచారాలు, అసత్య ప్రచారాలు, అధర్మాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సమాజంలో అశాంతి నెలకొన్నది. హే భగవాన్‌! యే అవతారంలో వస్తావో, ఎదురు చూస్తున్నాం! తక్షణం వచ్చి ధర్మాన్ని రక్షించు! సంభవామి యుగేయుగే అన్నావు అందుకు సమయం ఇదే! ఇదే!

                       - పారుపల్లి వెంకటేశ్వరరావు, సెల్‌: 98481 61208

Updated Date - 2020-05-17T10:42:43+05:30 IST