అలనాటి మహనీయుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకులు ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. అదే సమయంలో పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు మీడియా ద్వారా తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ సినీ రచయిత, నటుడు, పరుచూరి సోదరులలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna).. ఎన్టీఆర్ (NTR)తో తనకున్న బంధం గురించి, ప్రజల కోసం ఆయన చేసిన సేవ గురించి తెలిపారు. పరుచూరి మాట్లాడుతూ.. 'రాజకీయంగా వినూత్న పథకాలు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. పేదల కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తెచ్చారు. ఎన్టీఆర్ మనతోనే ఉన్నారు. ఎన్టీఆర్ మీద రాసిన పుస్తకమే నా ఆఖరు పుస్తకం'..అన్నారు.
అలాగే, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy).. మాట్లాడుతూ.. 'ఆంధ్రుల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్. ఫిల్మ్ నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి'..అని కోరారు. కాగా, ఈ ప్రత్యేకమైన రోజును నందమూరి కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఎన్టీఆర్ ఘాట్ వద్దకి చేరుకొని నివాళులు అర్పించారు. అంతేకాదు, తాతతో తనకున్న అనుబంధం గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.