బీజేపీ కొత్త చీఫ్‌తో కలిసి పనిచేస్తాం: తివారీ

ABN , First Publish Date - 2020-06-03T21:29:43+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా పగ్గాలు చేపట్టిన అదేశ్ కుమార్ గుప్తా నాయకత్వంలో పార్టీ అంతా కలిసికట్టుగా పని చేస్తుంద..

బీజేపీ కొత్త చీఫ్‌తో కలిసి పనిచేస్తాం: తివారీ

న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా పగ్గాలు చేపట్టిన ఆదేశ్ కుమార్ గుప్తా నాయకత్వంలో పార్టీ అంతా కలిసికట్టుగా పని చేస్తుందని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ అన్నారు. గుప్తా నాయకత్వంలో రాష్ట్రాన్ని కచ్చితంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని చెప్పారు.


'ఆదేశ్ గుప్తా నా ప్రియ సోదరుడు. ఢిల్లీ అభివృద్ధి కోసం మేమంతా కలిసి పని చేస్తాం. నేను మొత్తం నాలుగు ఎన్నికలను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో చాలా నేర్చుకున్నాను. గత ఎన్నికల్లో నాకు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను' అని మనోజ్ తివారీ అన్నారు. బీజేపీ డిల్లీ విభాగం అధ్యక్షుడుగా మనోజ్ తివారీ స్థానంలో గుప్తాను పార్టీ అధిష్ఠానం మంగళవారంనాడు నియమించింది.


కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తప్పే...

కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులను మూసివేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తివారీ తప్పుపట్టారు. ఇది సరైన నిర్ణయం కాదని, సొంత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 'ఎయిమ్స్, ఆర్ఎంఎల్, సఫ్దర్ జంగ్ ఆసుపత్రులు ఢిల్లీలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడకు వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. రాష్ట్రానికి ఆవల ఉన్న వారికి చికిత్సను అనుమతించమని ఢిల్లీ ప్రభుత్వం చెప్పరాదు' అని ఆయన అన్నారు. తక్షణం సరిహద్దులను తెరిచి అందరికీ వైద్యం అందేలా చూడాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-06-03T21:29:43+05:30 IST