పార్టీనా, అనుచరులా.. ఎవరు ముఖ్యం?

ABN , First Publish Date - 2022-08-10T04:35:26+05:30 IST

మాజీ మంత్రి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసులురెడ్డి ఎదుట కూడా గిద్దలూరు వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. ఒకవైపు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆయన మద్దతుదారులు మరోవైపు అసమ్మతి నేతలు వాగ్వాదానికి దిగటంతో హైదరాబాద్‌లోని బాలినేని గృహం దద్దరిల్లింది.

పార్టీనా, అనుచరులా.. ఎవరు ముఖ్యం?
అసమ్మతి నేతలతో సమావేశమైన బాలినేని, అన్నారాంబాబు

గిద్దలూరు వైసీపీ పంచాయితీలో హెచ్చరించిన బాలినేని

ఎమ్మెల్యే, అసమ్మతి నేతల మధ్య వాగ్వాదం

గత ఎన్నికల్లో సహకరించిన వారందరూ సమానమేనంటూ ఎమ్మెల్యే ఎదురుదాడి

గడప గడపకు తిరగాల్సిందే.. స్పష్టం చేసిన బాలినేని

చివరకు ఎమ్మెల్యేతో మండలాల వారీ చర్చలు


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మాజీ మంత్రి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసులురెడ్డి ఎదుట కూడా గిద్దలూరు వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. ఒకవైపు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆయన మద్దతుదారులు మరోవైపు అసమ్మతి నేతలు వాగ్వాదానికి దిగటంతో హైదరాబాద్‌లోని బాలినేని గృహం దద్దరిల్లింది. దీంతో బాలినేని సంయుక్త సమావేశం రద్దుచేసి గదిలో మండలాల వారీ సమీక్షకు శ్రీకారం పలికారు. రాత్రి పొద్దుపోయేవరకు సమీక్ష జరుగుతూనే ఉండగా సీఎం మాటగా చెబుతున్నా విభేదాలు పక్కన పెట్టి గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందేనని బాలినేని స్పష్టం చేసినట్లు తెలిసింది.


రెడ్డి సామాజికవర్గాన్ని పక్కనపెట్టారు

జగన్‌తో నేరుగా మాట్లాడిన తర్వాతే గడపగడపకు ప్రారంభించాలనే ఎమ్మెల్యే రాంబాబు భీష్మించడం, కార్యక్రమం నిర్వహించకుండా తన వద్దకు వచ్చేందుకు అవకాశమే లేదని సీఎం తేల్చిచెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే, అటు నియోజకవర్గంలోని అసమ్మతి నాయకుల మధ్య సమన్వయం ఉద్దేశంతో బాలినేని మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్య సమావేశం ఏర్పాటుచేశారు. నియోజకవర్గం నుంచి 60మందికి పైగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్‌ వెళ్లి బాలినేనిని కలిశారు. తొలుత వారితో బాలినేని మాట్లాడారు. అత్యధికులు ఎమ్మెల్యే తమను గౌరవించటం లేదని మరీ ముఖ్యంగా తొలి నుంచి వైసీపీలో ఉన్న వారిని కాకుండా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి రెడ్డి సామాజికవర్గం వారిని పక్కన పెడుతున్నారని, తాము దిష్టిబొమ్మలా మిగిలామని వివరించారు.


ప్రతిపక్షంలో ఉన్నట్లుంది

గిద్దలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తన మాటకు కనీసం విలువ కూడా ఇవ్వటం లేదని ఆయనకు తెలియకుండా నేను ఆఫీసుకు రావటం కూడా నేరంగా మారిందని వాపోయినట్లు తెలిసింది. ఒక మండలస్థాయి నాయకుడు అయితే మేము అధికారంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావటం లేదంటూ తనకు ఎదురైన అనుభవాలు వివరించినట్లు తెలిసింది. మరో నాయకుడు 2009 నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నా తూనాబొడ్డు అన్న చందంగా తమను పక్కకు తోసేశాడని వాపోయినట్లు తెలిసింది. నిన్న మొన్నటి దాకా టీడీపీలో ఉండి వైసీపీకీ ద్రోహం చేసి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని మరికొందరు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు, బేస్తవారిపేటలో కీలకమైన పదవుల్లో ఉన్న నాయకుల పేర్లు ఉదహరించినట్లు కూడా తెలిసింది. అదే సమావేశంలో ఉన్న ఆ నాయకులతో పాటు మరికొందరు అసమ్మతి నేతల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దీంతో బాలినేని ఇలా కాదు సాయంత్రం ఎమ్మెల్యే రాంబాబు కూడా వస్తారు. అప్పుడు పేస్‌టుపేస్‌ మాట్లాడదామంటూ వాయిదా వేశారు.


పరస్పరం ఫిర్యాదులు

తిరిగి రాత్రి 8గంటల తర్వాత సమావేశం ప్రారంభం కాగా నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులు, అటు ఎమ్మెల్యే రాంబాబు ఆవేశంగా ఫిర్యాదుల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. తనను కించపర్చాలనే ఉద్దేశంతో ప్రత్యర్థులు అసత్య ప్రచారాలు చేస్తున్నా సాగర్‌లో ఏమేమో కలిపామంటూ కార్యక్రమాలు చేపట్టినా ఎక్కువమంది తనకు మద్దతుగా నిలవలేదని రాంబాబు ఆరోపించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఇటు ఎమ్మెల్యే అతని మద్దతుదారులు అటు అసమ్మతి నేతల మధ్య వాగ్వాదం పెరిగినట్లు సమాచారం. దీంతో బాలినేని జోక్యం చేసుకుని మందలించటంతో అందరూ సైలెంట్‌ అయ్యారు. సమస్యకు పరిష్కారం చూస్తా.. గడపగడపకు అందరూ పాల్గొనకుంటే ఉపేక్షించేది లేదంటూ బాలినేని హెచ్చరించి మండలాల సమీక్ష చేపట్టారు. ముఖ్యనాయకులను తన గదిలోకి పిలుచుకొని ఎమ్మెల్యే సమక్షంలో చర్చించారు. సమీక్ష అనంతరం నియోజకవర్గంలో గడపగడపకు ప్రారంభించే తేదీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2022-08-10T04:35:26+05:30 IST