ఓలీ.. తప్పుకో..!

ABN , First Publish Date - 2020-07-01T08:32:18+05:30 IST

భారత్‌పై వ్యతిరేకతతో పాటు.. సరి‘హద్దు’ మీరుతున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ (68)కి సొంత పార్టీలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ ప్రోద్బలంతో తనను పదవి నుంచి దించేందుకు ‘రాయబార కార్యాలయాలు’, హోటళ్లలో కుట్రలు జరుగుతున్నాయని...

ఓలీ.. తప్పుకో..!

  • నేపాల్‌ ప్రధానిపై సొంత పార్టీలోనే ఆగ్రహం
  • రాజీనామా చేయాలని సీనియర్ల డిమాండ్‌
  • తనపై భారత్‌, పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారన్న ఓలీ
  • ఈ తీరు సరికాదంటూ సీనియర్ల మండిపాటు

కఠ్మాండూ, జూన్‌ 30: భారత్‌పై వ్యతిరేకతతో పాటు.. సరి‘హద్దు’ మీరుతున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ (68)కి సొంత పార్టీలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ ప్రోద్బలంతో తనను పదవి నుంచి దించేందుకు ‘రాయబార కార్యాలయాలు’, హోటళ్లలో కుట్రలు జరుగుతున్నాయని, సొంత పార్టీ నేతలు ఇందులో పాల్గొంటున్నారంటూ ఆదివారం ఓలీ చేసిన వ్యాఖ్యలు ఆయనకే ఎదురుకొట్టాయి. చివరకు ప్రధాని పీఠానికే ఎసరు పెట్టేలా ఉన్నాయి. ఓలీ వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌పీసీ) స్టాండింగ్‌ కమిటీ సమావేశమమైంది. ప్రధాని అధికారిక నివాసమైన బలువతార్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న అగ్ర నేతలు.. ఓలీ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. మాజీ ప్రధాని పుష్ప కమాల్‌ దహల్‌ (ప్రచండ) నేరుగా ఓలీపై మండిపడ్డారు. ‘భారత్‌ కుట్ర చేస్తోందంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సరైనవేనేమో కానీ, దౌత్యపరంగా కాదు. ఇలాంటి ప్రకటనలు పొరుగు దేశంతో సంబంధాలను దెబ్బతీస్తాయి.


సొంత పార్టీ నేతలపైనా ఆయన వ్యాఖ్యలు సరికాదు’ అని ప్రచండ వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్‌ కాకుంటే మరే దేశం కుట్ర చేస్తోందో చెప్పాలని కూడా ప్రచండ ఓలీని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ నేతలు మాధవ్‌ కుమార్‌ నేపాల్‌, ఝాలానాథ్‌ ఖనాల్‌, బమ్‌దేవ్‌ గౌతమ్‌ తదితరులు.. ఓలీని తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, పదవి నుంచి తప్పుకోవాలని కోరారు. ప్రధాని వ్యాఖ్యలు అభ్యంతరకరమని వ్యాఖ్యానించిన వారు.. కుట్రదారుల పేర్లు బయటపెట్టాలని పట్టుబట్టారు. సమావేశంలో పాల్గొన్న ఓలీ.. ముప్పేట దాడి జరుగుతున్నా.. సమాధానం మాత్రం  ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తే 48 మంది సభ్యుల స్టాండింగ్‌  కమిటీ, 9 మంది సభ్యుల సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో ఓలీకి మద్దతిచ్చేవారు తక్కువేనని స్పష్టమైందని ఓ నాయకుడు చెప్పారు. 


Updated Date - 2020-07-01T08:32:18+05:30 IST