పార్టీ చాలా బలహీనంగా ఉంది: బెంగాల్ బీజేపీ నేత

ABN , First Publish Date - 2022-04-28T23:11:12+05:30 IST

టికెట్లు పొందిన అభ్యర్థులు రాజకీయంగా బలంగా లేరు. బెంగాల్‌లోని ఓటర్లు రాజకీయంగా చాలా చైతన్యంతో ఉంటారు. ప్రతి పార్టీపై ప్రతి నేతపై వాళ్లకు అవగాహన ఉంటుంది. కానీ బీజేపీ అభ్యర్థులు అంత సమర్ధవంతంగా లేకపోవడం వల్ల మేం నష్టపోవాల్సి వచ్చింది. నాపై 165 కేసులు ఉన్నాయి..

పార్టీ చాలా బలహీనంగా ఉంది: బెంగాల్ బీజేపీ నేత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ చాలా బలహీన పడిందని, ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన అల్లర్లపై తగినంతగా పోరాడలేకపోయిందని ఆ పార్టీకి చెందిన నేత, ఎంపీ అర్జున్ సింగ్ అన్నారు. గురువారం ఆయన ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగాల్‌లో పార్టీ పరిస్థితిపై వివరించారు. గతేడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అంత బలంగా లేరని, అందుకే పార్టీ గెలవలేకపోయిందని అన్నారు. అప్పటి నుంచి పార్టీ రోజు రోజుకు మరింత బలహీనపడుతూ వస్తోందని, పార్టీ తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.


అర్జున్ సింగ్ లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో బీజేపీ ఆరు స్థానాలు ఓడిపోయింది. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘టికెట్లు పొందిన అభ్యర్థులు రాజకీయంగా బలంగా లేరు. బెంగాల్‌లోని ఓటర్లు రాజకీయంగా చాలా చైతన్యంతో ఉంటారు. ప్రతి పార్టీపై ప్రతి నేతపై వాళ్లకు అవగాహన ఉంటుంది. కానీ బీజేపీ అభ్యర్థులు అంత సమర్ధవంతంగా లేకపోవడం వల్ల మేం నష్టపోవాల్సి వచ్చింది. నాపై 165 కేసులు ఉన్నాయి. నా కుటుంబ సభ్యులు రాష్ట్రం వదిలి వెళ్లారు. నాపైనేమీ ఒత్తిడి లేదు. కానీ, కార్యకర్తలకు పార్టీ నుంచి మద్దతు కావాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన అల్లర్లపై ప్రతిపక్ష పార్టీగా కావాల్సినంత పోరాడలేకపోయాం’’ అని అన్నారు.

Updated Date - 2022-04-28T23:11:12+05:30 IST