గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్.. ఊడిపడిన భాగాలు..

ABN , First Publish Date - 2021-02-21T15:30:47+05:30 IST

ఇంజిన్ పేలిపోవడంతో గాల్లో ఉండగానే విమానం భాగాలు ఊడిపడిన ఘటన కొలరాడోలోని డెన్వర్‌ పరిధిలోని బ్రూమ్‌ఫీల్డ్‌లో శనివారం చోటుచేసుకుంది.

గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్.. ఊడిపడిన భాగాలు..

డెన్వర్, కొలరాడో: ఇంజిన్ పేలిపోవడంతో గాల్లో ఉండగానే విమానం భాగాలు ఊడిపడిన ఘటన కొలరాడోలోని డెన్వర్‌ పరిధిలోని బ్రూమ్‌ఫీల్డ్‌లో శనివారం చోటుచేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 328 బోయింగ్777 డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఫెయిల్ అయ్యి పేలిపోయింది. దాంతో విమానం భాగాలు ఊడిపోయి ఆకాశం నుంచి కింద పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి డెన్వర్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. హోనోలులు నుంచి హవాయి వెళ్తున్న ఈ విమానంలో 231 ప్రయాణికులు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.


ఇంజిన్ పేలిపోయిన తర్వాత కూడా పైలట్ చాకచక్యంగా విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. టేకాఫ్ తీసుకున్న కాసేపటికి విమానంలో పేలుడు శబ్దం వినిపించిందని ప్రయాణికులు చెప్పారు. విమానం భయంకరంగా ఊగిందని, పైకి వెళ్లకుండా కిందకు పడిపోవడంతో అందరం కంగారుపడ్డామని డేవిడ్ డెలూసియా అనే ప్రయాణికుడు చెప్పారు. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లో ఇంజిన్ నుంచి పొగ రావడం కనిపించింది. విమానం లోపలి నుంచి తీసినట్లుగా భావిస్తున్న ఒక వీడియోలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడం కూడా కనిపించింది.



Updated Date - 2021-02-21T15:30:47+05:30 IST