నాడు 5-1, నేడు?

ABN , First Publish Date - 2021-01-27T06:10:10+05:30 IST

చోడవరం నియోజకవర్గంలో గల ఆరు మేజర్‌ పంచాయతీల్లో విజయం సాధించడంపై ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి.

నాడు 5-1, నేడు?

చోడవరం నియోజకవర్గంలో ఆరు మేజర్‌ పంచాయతీలపై ప్రధాన పార్టీల ప్రత్యేక దృష్టి

గడచిన ఎన్నికల్లో ఐదు పంచాయతీల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థులు, ఒకచోట వైసీపీ మద్దతుపలికిన అభ్యర్థి గెలుపు


చోడవరం, జనవరి 26: చోడవరం నియోజకవర్గంలో గల ఆరు మేజర్‌ పంచాయతీల్లో విజయం సాధించడంపై ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థులు ఐదుచోట్ల, వైసీపీ బలపరచిన అభ్యర్థి ఒకచోట గెలుపొందారు. ఈ దఫా ఎన్నికల్లో ఫలితాలు ఎలా వుంటాయనేది ఆసక్తికరంగా మారింది. చోడవరం నియోజకవర్గంలో తమ ఆధిక్యాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తుండగా, తొలిసారి అధికారంలోనికి వచ్చిన వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి తన పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలోని ఆరు మేజర్‌ పంచాయతీలు (చోడవరం మండలం...గోవాడ, చోడవరం, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, రావికమతం మండలంలో కొత్తకోట, మేడివాడ, రోలుగుంట మండలంలో రోలుగుంట) ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క రోలుగుంట మినహా మిగిలిన పంచాయతీల్లో టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. రోలుగుంటలో వైసీపీ బలపరచిన అభ్యర్థి గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో చోడవరంలో టీడీపీ బలపరచిన అభ్యర్థి దొమ్మేసి అప్పలనర్స...వైసీపీ బలపరచిన అభ్యర్థిపై 4,676 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 


మండలంలోని గోవాడ మేజర్‌ పంచాయతీలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి ఏడువాక మాధవీలత...కాంగ్రెస్‌ అభ్యర్థి ఏడువాక అమ్మన్నమ్మపై 93 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో తెలుగుదేశం బలపరచిన అభ్యర్థి బత్తుల అరుణ, వైసీపీ అభ్యర్థి వరలక్ష్మిపై 2,013 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో బత్తుల అరుణకు 3,599 ఓట్లు రాగా, వరలక్ష్మికి 1,586 ఓట్లు వచ్చాయి. ఇక రావికమతం మండలం కొత్తకోట మేజర్‌ పంచాయతీలో టీడీపీ బలపరచిన అభ్యర్థిని కోట నీలవేణి...కాంగ్రెస్‌ అభ్యర్థి కృపారాణిపై 1,147 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి పందల శశికళ మూడో స్థానంలో నిలిచారు. మేడివాడ మేజర్‌ పంచాయతీలో టీడీపీ బలపరచిన అభ్యర్థి అరిశంకల రామారావు...అదే పార్టీకి చెందిన రెబల్‌ అభ్యర్థి విజయకుమార్‌పై 1,094 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. రోలుగుంట మేజర్‌ పంచాయతీలో వైసీపీ బలపరచిన అభ్యర్థి పోతల లక్ష్మీ రమణమ్మ...టీడీపీ బలపరచిన అభ్యరి సుర్ల కన్నతల్లిపై 200 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 

Updated Date - 2021-01-27T06:10:10+05:30 IST