Oct 28 2021 @ 20:39PM

నా నటనకు అవార్డు రానందుకు నిరాశకు లోనయ్యాను: పార్తీబన్

ఇటీవల ఢిల్లీలో జరిగిన 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఒత్త చెరుప్పు’ చిత్రానికి రెండు అవార్డులు అందుకున్న సీనియర్‌ నటుడు పార్తీబన్‌.. త్వరలోనే మరో విభిన్నమైన చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ‘ఇరవిన్‌ నిళల్‌’ అనే పేరుతో తెరకెక్కించే చిత్రాన్ని సింగిల్‌ షాట్‌ మూవీగా రూపొందించనున్నారు. ఈ విషయాన్ని పార్తీబన్‌ స్వయంగా వెల్లడించారు. 

‘‘కొత్త కోణంలో ఆలోచిస్తూ, విభిన్న చిత్రాలను చేసుకుంటూ పోతే ఏదో ఒక చోట లాక్‌ అయ్యేందుకు అవకాశాలుండవు. అందుకే ‘ఒత్త చెరుప్పు’ తర్వాత ‘ఇరవిన్‌ నిళల్‌’ అనే పేరుతో చిత్రాన్ని నిర్మించనున్నాను. అలాగే, ఒక కమర్షియల్‌ కామెడీ చిత్రాన్ని కూడా ప్లాన్‌ చేస్తున్నాను. నిజానికి ‘ఒత్త చెరుప్పు’ చిత్రానికి ఇంకా మరిన్ని వార్డులు వచ్చి ఉండాల్సింది. ఆస్కార్‌ అవార్డులు ఒక చిత్రానికి 11 వరకు ఇస్తారు. అలాగే, ఈ చిత్రానికి కూడా మరికొన్ని విభాగాల్లో అవార్డులు రావాల్సి ఉంది. నా నటనకు అవార్డు రాకపోవడం ఒకింత నిరాశకు లోనుచేసింది. ఈ లోటును మున్ముందు భర్తీ చేసుకుంటాను’’ అని పార్తీబన్‌ అన్నారు. కాగా, ఈ 67వ జాతీయ అవార్డుల్లో ‘ఒత్త చెరుప్పు’ చిత్రానికి స్పెషల్‌ జ్యూరీ అవార్డుతో పాటు బెస్ట్‌ సౌండ్‌ డిజైనర్‌ అవార్డులు వచ్చిన విషయం తెల్సిందే.