పార్థసారథి నరహంతకుడు’

ABN , First Publish Date - 2022-05-24T09:52:01+05:30 IST

కరోనా సమయంలో హెటిరో పార్థసారథి నరహంతకుడి పాత్ర పోషించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

పార్థసారథి నరహంతకుడు’

  • రెమ్‌డెసివిర్‌ స్కాం నుంచి తప్పించుకునేందుకే రాజ్యసభకు
  • ఫార్మా కుంభకోణం డబ్బులు వాడుకునేందుకే కేసీఆర్‌ ప్రణాళిక
  • హెటిరోపై ఐటీ దాడుల్లో 10వేల కోట్లు బయటపడుంటాయి!
  • మేం అధికారంలోకి వచ్చాక పార్థసారధి వెంట పడతాం
  • ఆయనకు రాజ్యసభ సీటుపై ఈసీకి ఫిర్యాదు చేస్తా
  • సీబీఐ విచారణనూ కోరతా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో హెటిరో పార్థసారథి నరహంతకుడి పాత్ర పోషించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ అమ్మకమనేది ఒక పెద్ద స్కాం అని, దీనినుంచి తప్పించుకునేందుకే పార్థసారధి రాజ్యసభకు వెళుతున్నారని ఆరోపించారు. ఈ ఫార్మా స్కాం డబ్బులు వాడుకునేందుకే సీఎం కేసీఆర్‌ ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.కరోనా సమయంలో కాంగ్రెస్‌  అధికారంలో ఉన్నట్లయితే ఇలాంటి స్కాంలు జరిగుండేవి కావని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావద్దన్న ప్రణాళికలో హెటిరో పార్థసారధి భాగస్వామి అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. పార్థసారథి వెంట పడి సంగతి తేలుస్తామన్నారు. కరోనా సమయంలో రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ చుట్టే దేశం మొత్తం తిరిగిందని, ఈ ఇంజక్షన్‌కు చాలా ప్రచారమూ వచ్చిందని, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. 


అప్పట్లో ఈ ఇంజక్షన్‌ అమ్మకాల్లో బ్లాక్‌ దందా జరిగిందని, ఒక్కో ఇంజక్షన్‌ రూ. లక్ష వరకు అమ్మారని ఆరోపించారు. ఈ ఇంజక్షన్‌ను వాస్తవ ధరకు ప్రభుత్వాలు ఎందుకు కొనివ్వలేదని ప్రశ్నించారు. హెటిరోపైన ఐటీ దాడులు జరిగినప్పుడు ఏం జరిగిందన్నది ఇప్పటికీ బయటికి రాలేదన్నారు. అసలు ఆ దాడుల్లో రూ. 500 కోట్లు కాదని, రూ.10 వేల కోట్ల వరకు బయటపడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలకు పార్థసారథి నామినేషన్‌ వేసే సమయానికల్లా ఈ స్కాం తేలాలన్నారు. అసలు రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ అమ్మకాలకు అనుమతిని ఇచ్చిందెవరు? మళ్లీ మూడు నెలల తర్వాత అనుమతిని రద్దు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. దీని వెనుక ఫార్మా మాఫియా ఉందని ఆరోపించారు. మనుషుల ప్రాణాలతో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. పార్థసారథిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, సీబీఐకీ లేఖ రాసి విచారణ చేపట్టాలని కోరతానని చెప్పారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదా అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లను ప్రశ్నించారు. ఇటు బీజేపీ, అటు టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ పార్థసారఽథిని సమర్థించిన పార్టీలేనని ఆయన అన్నారు. 

Updated Date - 2022-05-24T09:52:01+05:30 IST