Partha Chatterjee: బెంగాల్ కేబినెట్ నుంచి ఉద్వాసన?

ABN , First Publish Date - 2022-07-28T21:29:40+05:30 IST

టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ

Partha Chatterjee: బెంగాల్ కేబినెట్ నుంచి ఉద్వాసన?

కోల్‌కతా: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee)ని కేబినెట్ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేటి (గురువారం) సాయంత్రం ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్టు సమాచారం. పార్టీ పదవుల నుంచి మంత్రి పదవి నుంచి పార్థను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. 


పార్థ ఛటర్జీ సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee)కి చెందిన రెండో ఫ్లాట్‌లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారాన్ని, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తన ఫ్లాట్‌లో లభించిన సొమ్ము తనది కాదని, పార్థ ఛటర్జీదని ఈడీ అధికారులకు ఆమె స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో పార్థ విషయంలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీఎంసీ అధినాయకత్వం తమ నేతలను ఆదేశించింది. 


పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తప్పించాలన్న నిర్ణయాన్ని మమత తీసుకోనుండగా, పార్టీ సెక్రటరీ జనరల్ పోస్టు నుంచి తొలగించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ (Kunal Ghosh) మాట్లాడుతూ.. పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాను తప్పుగా మాట్లాడితే కనుక అన్ని పదవుల నుంచి తనను తొలగించే అధికారం పార్టీకి ఉందని అన్నారు. పార్టీలో తాను ఓ సైనికుడిలానే ఉంటానని చెప్పుకొచ్చారు.  


కాగా, బుధవారం అర్పిత ముఖర్జీ రెండో ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 28.90 కోట్ల నగదు, 5 కేజీలకు పైగా బంగారం, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఆమె నివాసం నుంచి రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విలువైన విదేశీ  కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-28T21:29:40+05:30 IST