పార్ట్‌-బీ పంచాయితీ

ABN , First Publish Date - 2022-05-04T05:53:20+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన అనంతరం సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి.

పార్ట్‌-బీ పంచాయితీ

ఏళ్లు గడుస్తున్నా తేలని వివాదం

సాగుకు దూరమైన రైతాంగం 

అందని ప్రభుత్వ పథకాలు 

చోద్యం చూస్తున్న అధికారులు 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే3: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన అనంతరం సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. భూ వివాదాలను పరిష్కరించాల్సిన అధికారులు సమస్యలకు ఆజ్యం పోశారు. భూప్రక్షాళన చేపట్టిన సమయంలో రెవెన్యూ, అటవీశాఖల మధ్య నలుగుతున్న వివాదాస్పద భూములను పార్ట్‌ (బీ)లో చేర్చారు. ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేయలేదు. ఇలా మెదక్‌ జిల్లాలో 10 వేల ఎకరాల భూమిని పార్ట్‌ (బీ)లో నమోదు చేయడంతో రైతులు కొత్త పాస్‌బుక్‌లను పొందలేకపోతున్నారు. దాదాపు ఐదేళ్లు కావస్తున్నా సమస్య పరిష్కారానికి మార్గం చూడడంలేదు. 


ఒక్క మండలంలోనే 3,200 ఎకరాలు

శివ్వంపేట మండలంలో 3,200 ఎకరాల భూమిపై వివాదం నెలకొన్నది. తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, రెవెన్యూ అధికారులు తమకు పట్టాలు కూడా ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం అవి రిజర్వ్‌ఫారెస్ట్‌ భూములని అంటున్నారు. రైతులు పంటలు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. సాగు కోసం పొలాల్లోకి వెళ్తున్న రైతులపై అక్రమంగా రిజర్వ్‌ఫారె్‌స్టలోకి చొరబడుతున్నారని కేసులు పెడుతున్నారు. ఉమ్మడి సర్వే నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని రెండు శాఖల అధికారులు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది.


పరిష్కారం చూపని భూ ప్రక్షాళన

భూ ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారులు ఆయా మండలాల పరిధిలోని వందలాది ఎకరాల భూములను పార్ట్‌ (బీ)లో చేర్చారు. ఈ కారణంగా వందలాది మంది రైతులకు కొత్త పాస్‌బుక్‌లు అందలేదు. రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అందడం లేదు. శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండా, బిక్యనాయక్‌ తండా గ్రామ పంచాయితీ పరిధిలోని సర్వే నంబర్‌ 315, 316లో ఉన్న 1,200 ఎకరాలపై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం నెలకొన్నది. దీంతో సదరు భూములను పార్ట్‌ (బీ)లో చేర్చారు. ఇదే మండలం నవాబ్‌పేట గ్రామ పరిధిలోని 216, 236, 309, 417, 267 సర్వే నంబర్లలో రెండువేల ఎకరాలకు సంబంధించి కూడా అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నలుగుతుండటంతో పార్ట్‌ (బీ)లో చేర్చారు. బోజ్య గ్రామ పంచాయితీ పరిధిలోని హరిదాస్‌ తండాలో సర్వే నంబర్‌ 70లో ఉన్న 14 ఎకరాల భూమిని గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. అటవీ అధికారులు మాత్రం ఆ భూమి రిజర్వుఫారె్‌స్టలో ఉందని స్వాఽధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటవీశాఖ అధికారులు జేసీబీలతో వచ్చి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు. 


ప్రధాని పంచిన భూములు కూడా పార్ట్‌ (బీ)లోనే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం లో భూ పంపిణీ జరిగింది. 2005 ఆగస్టు 21న మెదక్‌ పట్ణణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రామాయంపేట మండలం రాయిలాపూర్‌, సుతారిపల్లి, వెంకటాపూర్‌, కాట్రియాల, పర్వతాపూర్‌, దంతపల్లి, ఝాన్సిలింగాపూర్‌, రామాయంపేట గ్రామాలకు చెందిన 300 మంది రైతులకు భూమి పట్టాలను ఇచ్చారు.   ఈ భూముల్లో రామాయంపేట మండలంలో ఉన్న 1,137 ఎకరాలకు సబంధించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉన్నది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌, రుక్మాపూర్‌, చెట్ల తిమ్మాయిపల్లి గ్రామాల పరిధిలో వెయ్యి ఎకరాల భూమిపై వివాదం నెలకొన్నది. మెదక్‌, హవేళిఘనపూర్‌, కొల్చారం, వెల్దుర్తి, చిన్నశంకరంపేట మండలాల్లో కూడా వేల ఎకరాల భూములు రెవెన్యూ-అటవీ శాఖల మధ్య వివాదంలో మగ్గుతున్నాయి. ఆయా గ్రామాల్లో వందలాది మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు రిజర్వ్‌ఫారె్‌స్టగా పేర్కొంటున్నారు.  


వ్యవసాయమే జీవనాధారం

-సుధాకర్‌, తాళ్లపల్లి తండా, శివ్వంపేట మండలం 

భూమిపై ఆధారపడి బతుకుతున్నాం. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు అధికారుల తప్పిదం వల్ల కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పంటలు వేసుకుందామంటే అధికారులు అడ్డుపడుతున్నారు. మా బతుకులు ఆగమయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం వర్తించడం లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. 


పంటలు వేయనివ్వడం లేదు

-ఆగమయ్య, కాట్రియాల,  రామాయంపేట మండలం

2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా భూపట్టాలు ఇచ్చారు. కానీ రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం కారణంగా ఆ భూములను పార్ట్‌ (బీ)లో చేర్చారు. దీంతో పట్టాలు ఇచ్చినా పాసు పుస్తకాలు జారీ చేయడం లేదు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. అధికారులు సకాలంలో స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి. 



Read more