24 వరకే పార్లమెంట్‌

ABN , First Publish Date - 2020-09-20T07:36:42+05:30 IST

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదించే అవకాశాలున్నాయి. ఈనెల 14న మొదలైన సమావేశాలు, అక్టోబరు ఒకటో తేదీ దాకా జరగాల్సి ఉంది. సమావేశాలు మొదలయ్యాక, ఎంపీల్లో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఇతర సభ్యులకూ కరోనా సోకే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి...

24 వరకే పార్లమెంట్‌

  • కరోనా ముప్పుతోనే సమావేశాల కుదింపు
  • అన్ని పార్టీలూ దీనికి సానుకూలం
  • ఇద్దరు మంత్రులు, 30మంది ఎంపీలకు కొవిడ్‌
  • 1దాకా నిర్వహిస్తే ఆరోగ్యానికి ఇబ్బందని బెంగ
  • భౌతిక దూరం పాటించండి: వెంకయ్య
  • శ్రామిక్‌ రైళ్లలో 97 మంది మృతి
  • 2వేల నోటు ముద్రణ నిలిపివేయలేదు: కేంద్రం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదించే అవకాశాలున్నాయి. ఈనెల 14న మొదలైన సమావేశాలు, అక్టోబరు ఒకటో తేదీ దాకా జరగాల్సి ఉంది. సమావేశాలు మొదలయ్యాక,  ఎంపీల్లో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఇతర సభ్యులకూ కరోనా సోకే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో సమావేశాలను కుదించాలనే ఆలోచనకే ఎక్కువ పార్టీలు మొగ్గుచూపాయి. మంత్రులు గడ్కరీ, ప్రహ్లాద్‌ పటేల్‌తో పాటు 30 మంది దాకా ఎంపీలకు, 50 మంది సిబ్బందికి కరోనా సోకింది.


అక్టోబరు ఒకటి దాకా సమావేశాలను నిర్వహిస్తే అది సభ్యుల ఆరోగ్య పరంగా రిస్క్‌ తీసుకున్నట్లు అవుతుందని బీఏసీ సమావేశంలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో సెప్టెంబరు 24న పార్లమెంట్‌ వాయిదా పడే అవకాశాలున్నాయి. కాగా 2వేల నోట్ల ముద్రణను నిలిపివేయాలనే విషయంలో  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమిచ్చారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 4,49లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 71 శాతం, అంటే 3.19 లక్షల ప్రమాదాలు అతివేగం వల్లే సంభవించాయని రాజ్యసభలో మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. కాలాతీత వాహనాలకు సంబంధించిన పాలసీపై కేబినెట్‌ నోట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నామని మంత్రి సంతోష్‌ గంగ్వార్‌చెప్పారు. వివిధ యాజమాన్యాల నుంచి 2లక్షల మంది కార్మికులకు రావాల్సి ఉన్న రూ.295 కోట్ల వేతన బకాయిలను ఇప్పించామని తెలిపారు. శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణం చేస్తున్న సమయంలో  97మంది కార్మికులు చనిపోయారని రాజ్యసభలో మంత్రి పీయుష్‌ గోయల్‌ వెల్లడించారు. గుండెపోటు, గుండె ఆగిపోవడం, మెదడులో రక్తస్రావం, ఊపిరితిత్తులు, కాలేయ సమస్యలతో ఎక్కువ మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. కాగా వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సభ్యులకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సూచించారు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.  సభ్యుల కోసం రోజూ పార్లమెంట్‌ హౌస్‌లో ఆర్టీ-పీసీఆర్‌, యాంటిజెన్‌ టెస్టులు అందుబాటులో ఉంటాయని, సభ్యులంతా ఈ సౌకర్యాన్ని వినియో గించుకొని పరీక్షలు చేసుకోవాలని సూచించారు. 


Updated Date - 2020-09-20T07:36:42+05:30 IST