సముద్ర యానం బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ABN , First Publish Date - 2021-07-27T21:53:02+05:30 IST

సముద్ర యానం రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక అభివృద్ధి జరిగిందని

సముద్ర యానం బిల్లుకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ : సముద్ర యానం రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక అభివృద్ధి జరిగిందని, ఈ రంగాన్ని క్రమబద్ధీకరించవలసి ఉందని చెప్తూ పార్లమెంటు సముద్రయానానికి సహాయకారుల బిల్లు, 2021ని ఆమోదించింది. ఈ బిల్లు యావత్తు భారత దేశానికి వర్తిస్తుంది. వివిధ మారిటైమ్ జోన్లు, ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలకు వర్తిస్తుంది.  దీంతో దీపస్తంభాలకు వర్తించే లైట్‌హౌస్ యాక్ట్, 1927 రద్దవుతుంది. 


సముద్ర ప్రయాణాలకు సహాయకారుల బిల్లు (మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు) సముద్ర యానానికి సహాయకారిని నిర్వచించింది. నౌకలకు వెలుపల ఉంటూ, నౌకల ట్రాఫిక్, నిర్దిష్ట నౌకల సముద్రయానం భద్రత, సమర్థత పెంచడానికి రూపొందించి, నిర్వహించే పరికరం, వ్యవస్థ లేదా సేవను సముద్రయానానికి సహాయకారి (మెరైన్ ఎయిడ్)గా నిర్వచించింది. నౌక అర్థ పరిధిలోకి ఓడ, పడవ, సెయిలింగ్ వెజల్, చేపల పడవ, సబ్‌మెర్సిబుల్, సెమీ సబ్‌మెర్సిబుల్ హైడ్రోఫోయిల్స్ వంటివి వస్తాయని తెలిపింది. సముద్రయాన సహాయకారులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు డైరెక్టర్ జనరల్‌ను నియమించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పించింది. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, జిల్లాలకు డైరెక్టర్లను నియమించేందుకు కూడా అవకాశం ఇచ్చింది. 


బిల్లు వల్ల ప్రభావితులయ్యేవారితో లేదా ఈ విషయంలో స్పెషల్ నాలెడ్జ్ ఉన్నవారితో కేంద్ర సలహా సంఘం (సీఏసీ)ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది. సముద్రయానానికి సహాయకారుల ఏర్పాటు, ఇటువంటి సహాయకారులను అదనంగా ఏర్పాటు చేయడం, మార్చడం లేదా తొలగించడం వంటి అంశాలపై ఈ సంఘాన్ని ప్రభుత్వం సంప్రదించవచ్చునని తెలిపింది. 


సముద్రయాన సహాయకారులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేవారికి రూ.1 లక్ష వరకు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా ఈ రెండు శిక్షలు విధించవచ్చునని పేర్కొంది. 


Updated Date - 2021-07-27T21:53:02+05:30 IST