ఉభయ సభల్లో ఉమ్మడి దాడి

ABN , First Publish Date - 2020-09-07T14:16:44+05:30 IST

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడిగా ప్ర భుత్వంపై దాడి చెయ్యాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి సంయుక్త

ఉభయ సభల్లో ఉమ్మడి దాడి

  • చైనా, ఆర్థికం, కొవిడ్‌, ఫేస్‌బుక్‌.... 
  • అన్నింటిపైనా ముప్పేట దాడి
  • వ్యూహరచనకై వారాంతంలో నేతల భేటీ

న్యూఢిల్లీ: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడిగా ప్ర భుత్వంపై దాడి చెయ్యాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి సంయుక్త వ్యూహరచన నిమిత్తం ఈ వారాంతంలో విపక్ష నేతలు సమావేశం కానున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆదివారం నాడు చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత, చైనా దూకుడు, కొవిడ్‌పై సర్కార్‌ వైఫల్యం, వలస కూలీల దుస్థితి, ఆర్థిక పరిస్థితి పతనం, ఫేస్‌బుక్‌ వివాదం, జీఎస్టీ పరిహారం విషయంలో రాష్ట్రాలకు మొండిచెయ్యి... మొదలైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. పార్లమెంట్లో సభా సమన్వయం చేసుకుని ప్రభుత్వంపై సంయుక్తంగా విరుచుకుపడాలని... నీట్‌పై ఈమధ్య సోనియాగాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (టీఎంసీ), ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన),  హేమంత్‌ సొరెన్‌ (జేఎంఎం) అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీయే చొరవ తీసుకుని భావసారూప్య పార్టీల నాయకులతో ఈ వారాంతంలో ఓ సమావేశం ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. ఈలోగా పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలకు సంబంధించి సోనియా మంగళవారం నాడు కాంగ్రెస్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వం తెచ్చిన 11 ఆర్డినెన్సుల విషయమై ఈ గ్రూప్‌ ఇప్పటికే పరిశీలన జరుపుతోంది. వాటిపై చర్చకు పట్టుబట్టి, అవసరమైతే ఆ బిల్లులను అడ్డుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. వీటిపై వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ విపక్ష నేతలకు వివరించనుంది. ఉమ్మడిగానే వ్యవహరించాలని భావిస్తున్నామని టీఎంసీ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌, లెఫ్ట్‌ నేతలు ఏచూరి, డీ రాజా చెప్పారు. జేఈఈ, నీట్‌ పరీక్షల విషయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని కూడా కాంగ్రెస్‌ దాడి చేయనుంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసి, జీరో అవర్‌ను కుదించడంపైనా అసంతృప్తిని సభల్లో విపక్షాలు వ్యక్తం చే యనున్నాయి. ఈ రెండూ లేక పోవడం వల్ల కీలకాంశాలపై స్పల్ప కాలిక చర్చ లేదా సావధాన తీర్మానాలకు పట్టుబట్టాల ని కాంగ్రెస్‌ భావిస్తోంది. సమావేశాల తొలిరోజైన 14న కార్యకలాపాలూ జరగకపోవచ్చని, ఈ మధ్య మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి, ఎంపీలు అమర్‌సింగ్‌, హెచ్‌ వసంతకుమార్‌, వీరేంద్ర కుమార్‌లకు సభలు సంతాపం ప్రకటించి వాయిదాపడతాయని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-09-07T14:16:44+05:30 IST