పార్కింగ్‌ బాదుడు

ABN , First Publish Date - 2020-05-28T11:23:21+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు

పార్కింగ్‌ బాదుడు

  • సీజ్‌ చేసిన వాహనాలపై వసూళ్లు
  • రోజుకు రూ.30 చెల్లించాల్సిందే..
  • ఆర్టీసీ తీరుపై బాధితుల ఆగ్రహం
  • డిపోలో పార్క్‌ చేసిన పోలీసులు

కర్నూలు, మే 27(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. వీటిని నగరంలోని మున్సిపల్‌ మైదానం, బస్‌డిపోలో ఉంచారు. ప్రభుత్వ ఆదేశాలతో శనివారం నుంచి వాహనదారులకు తిరిగి ఇస్తున్నారు. మున్సిపల్‌ మైదానంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదు. కానీ ఆర్టీసీ డిపో అధికారులు మాత్రం పార్కింగ్‌ ఫీజు పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. సీజ్‌ చేసిన వాహనాలకు ఇప్పటికే చలానాలు రాశారని, అదే భారమనుకుంటే ఇప్పుడు పార్కింగ్‌ రుసుము పేరిట డబ్బులు గుంజడం దారుణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రోజుకు రూ.30

లాక్‌డౌన్‌ మొదలైన తరువాత నాలుగో పట్టణ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు దాదాపు 740 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలను సీజ్‌ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. వీటికి రోజుకు రూ.30 ప్రకారం పార్కింగ్‌ ఫీజును ఆర్టీసీ అధికారులు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రెండు నెలల క్రితం సీజ్‌ చేసిన వాహనానికి రూ.1800 చెల్లించాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల పనులు కోల్పోయామని, ఎలాంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే ఎడా పెడా వసూళ్లు చేయడం ఏమిటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా రుసుము చెల్లించినట్లు తెల్ల కాగితం మీద రాసి పంపుతున్నారని అంటున్నారు. సీజ్‌ చేసిన వాహనాలన్నీ మధ్య తరగతి, పేద ప్రజలవే. ఒక్కో వాహనంపై సగటున రూ.1000 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆర్టీసీ అధికారులు వాహనదారులపై రూ.6 లక్షల వరకూ భారం మోపుతున్నారు. 


కట్టాల్సిందే..

సాధారణ రోజుల్లో సీజ్‌ చేసిన వాహనాలను ఆర్టీవో అధికారులు ఆర్టీసీ డిపోల్లో పెడుతుంటారు. ఇలాంటి వాటికి వాహనం రకాన్ని బట్టి పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తారు. కానీ లాక్‌డౌన్‌లో వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఆర్టీవో అధికారులకు సంబంధం లేదు. ఈ వ్యవహారంపై పోలీసు శాక ఉన్నతాధికారులను వివరణ కోరగా, పార్కింగ్‌ ఫీజు విషయమై తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు. కానీ డిపోలో వాహనాలను ఉంచినందున ఖచ్చితంగా పార్కింగ్‌ రుసుం చెల్లించాల్సిందేనని కర్నూలు ఆర్టీసీ డిపో రీజినల్‌ మేనేజర్‌ అన్నారు. వాహనదారుల వద్ద ఎక్కువగా ఏమీ వసూలు చేయడం లేదని, రెండు నెలలకు పైగా ఉన్న వాహనాలకు కేవలం రూ.1500 వసూలు చేస్తున్నామని సమర్థించుకున్నారు. 


మందుల కోసం వస్తే సీజ్‌ చేశారు

ఇంట్లో వాళ్ళకు మందులు అవసరమై రాత్రి 7 గంటల సమయంలో బయటకు వచ్చాను. విషయం చెప్పినా పోలీసులు వినకుండా బైక్‌ను సీజ్‌ చేశారు. అప్పటి నుంచి కూరగాయలు, మందులు, సరుకుల కోసం కాలి నడకన వెళుతున్నా. బైక్‌లు ఇస్తున్నారని వస్తే పార్కింగ్‌ రుసుం పేరిట రూ.1100 వసూలు చేశారు. రెండు నెలల నుంచి పైసా ఆదాయం లేదు. ముందుగా సమాచారం ఇవ్వకుండా డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలి..? బైక్‌ అవసరం కాబట్టి అప్పు చేసి మరీ కడుతున్నాను. నగరంలో చాలా కాలేజీల మైదనాలు ఖాళీగా ఉన్నాయి. పోలీసులు అక్కడ పెట్టవచ్చు కదా..? ఆర్టీసీ డిపోలో ఉంచి ప్రజలపై భారం వేయడం సరికాదు. 

- భాస్కర్‌, మెకానిక్‌, కర్నూలు

Updated Date - 2020-05-28T11:23:21+05:30 IST