బండి నిలిపితే బాదుడే

ABN , First Publish Date - 2021-08-06T05:09:40+05:30 IST

‘ఇక్కడ మేం ఎంత వసూలు చేస్తున్నామో ఆర్టీసీ అధికారులకు తెలుసు. వారి అనుమతితోనే పార్కింగ్‌ ఫీజు పెంచాం. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. చేతనైతే అధికారులకు ఫిర్యాదు చేసుకోండి. వారికి అన్నీ తెలుసు. ఆ రశీదు మీద మేం రాసినంత ఇవ్వాల్సిందే. లేదంటే వాహనాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లనివ్వం’... ఇదీ శ్రీకాకుళం ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలోని సైకిల్‌ స్టాండ్‌ నిర్వాహకుల అడ్డగోలు సమాధానం. ‘ఎవరి అనుమతితో వాహనాల పార్కింగ్‌ ఫీజు పెంచారు? రశీదులో దిద్దుబాట్లు ఎందుకు?’ అని ప్రయాణికులు అడిగినందుకు వారి నుంచి ఎదురైన సమాధానమిది. ఇంతలో కొంతమంది ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు పార్కింగ్‌ నిర్వాహకుల సమక్షంలోనే సమాచారం ఇవ్వడం.. ఫీజులు పెంచేందుకు తాము అనుమతి ఇవ్వలేద’ని ఉన్నతాధికారి స్పష్టం చేయడంతో నిర్వాహకులు నీళ్లు నమిలారు.

బండి నిలిపితే బాదుడే
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ పార్కింగ్‌ స్టాండ్‌లో వాహనాలు

 నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు 

 శ్రీకాకుళం ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో దుస్థితి

 కమిటీ నిర్ణయించిన దాని కంటే అధికంగా వసూలు

 గడువు తీరకముందే దోపిడీ

 నెలనెలా రూ.లక్షల్లో అక్రమార్జన

 రశీదుల్లో తమ ఇష్టం వచ్చినట్టుగా మార్పులు

 చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు

 ఆర్‌ఎంకు ప్రయాణికుల ఫిర్యాదు 

(గుజరాతీపేట)

‘ఇక్కడ మేం ఎంత వసూలు చేస్తున్నామో ఆర్టీసీ అధికారులకు తెలుసు. వారి అనుమతితోనే పార్కింగ్‌ ఫీజు పెంచాం. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. చేతనైతే అధికారులకు ఫిర్యాదు చేసుకోండి. వారికి అన్నీ తెలుసు. ఆ రశీదు మీద మేం రాసినంత ఇవ్వాల్సిందే. లేదంటే వాహనాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లనివ్వం’... ఇదీ శ్రీకాకుళం ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలోని సైకిల్‌ స్టాండ్‌ నిర్వాహకుల అడ్డగోలు సమాధానం. ‘ఎవరి అనుమతితో వాహనాల పార్కింగ్‌ ఫీజు పెంచారు? రశీదులో దిద్దుబాట్లు ఎందుకు?’ అని ప్రయాణికులు అడిగినందుకు వారి నుంచి ఎదురైన సమాధానమిది. ఇంతలో కొంతమంది ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు పార్కింగ్‌ నిర్వాహకుల సమక్షంలోనే సమాచారం ఇవ్వడం.. ఫీజులు పెంచేందుకు తాము అనుమతి ఇవ్వలేద’ని ఉన్నతాధికారి స్పష్టం చేయడంతో నిర్వాహకులు నీళ్లు నమిలారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్‌ ఫీజుల రూపంలో నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. అక్కడ మూడు సైకిల్‌ స్టాండ్లు (పార్కింగ్‌ కేంద్రాలు) కొనసాగుతున్నాయి. ఆ స్లాండ్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు బాధ్యతను వేలం పాట ద్వారా కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులకు ఆర్టీసీ అధికారులు అప్పగించారు. సంబంధిత కమిటీ నిర్ణయించిన పార్కింగ్‌ ఫీజులను మాత్రమే అక్కడ వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక మొత్తంలో పార్కింగ్‌ ఫీజును వసూలు చేయాలంటే ఆర్టీసీ అధికారులతో కూడిన కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రవేశ ద్వారం వద్దనున్న సైకిల్‌ స్టాండ్‌లో కమిటీ అనుమతి లేకుండానే అడ్డగోలుగా పార్కింగ్‌ ఫీజులను వసూలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఎక్కడా ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు లేకపోవడం గమనార్హం. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నా.. పార్కింగ్‌ చేసే వాహనాలకు కనీసం రక్షణ కల్పించడం లేదు. షెడ్లు సక్రమంగా లేకపోవడంతో వాహనాలు ఆరు బయటే ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయి. 

 

ఏం చేస్తున్నారంటే...

వాస్తవానికి ద్విచక్ర వాహన చోదకుల (మోటారు సైకిళ్లు) నుంచి పార్కింగ్‌ ఫీజుగా 12 గంటలకు రూ.15 వంతున వసూలు చేయాల్సి ఉంది. అంటే 24 గంటలకు రూ.30 వంతున వసూలు చేయాలి(రశీదులో ఉన్న వివరాల మేరకు). సైకిళ్లకు 12 గంటలకు రూ.8 వంతున వసూలు చేయాలి. అంటే రోజుకు రూ.16 అన్నమాట. ఈ మొత్తమే ఎక్కువైందని..పార్కింగ్‌ ఫీజును తగ్గించాలని ఎన్నాళ్ల నుంచో వినియోగదారులు కోరుతున్నారు. కానీ ఇక్కడి ప్రవేశ ద్వారం వద్దనున్న సైకిల్‌ స్టాండ్‌ నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి మోటార్‌ సైకిళ్లకు 12 గంటలకు రూ.20 వంతున వసూలు చేస్తున్నారు. అంటే 24 గంటలకు రూ.40 అన్నమాట. సైకిళ్లకు 12 గంటలకు రూ.10 వంతున వసూలు చేస్తున్నారు. ఇది కూడా అనుమతి లేకుండా. దీనిపై కొద్ది రోజులుగా వినియోగదారులకు, వాహన స్టాండ్‌ నిర్వాహకులకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారుల అనుమతి ఉందని నిర్వాహకులు చెప్పడంతో కొంతమంది మౌనం వహిస్తున్నారు. మరికొంతమంది ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా సాగుతోంది. 


అన్నీ అక్రమంగానే...

వాహనం పార్క్‌ చేసినందుకు ఇచ్చే రశీదుపై రూ.15గా ముద్రించి ఉంది. కానీ నిర్వాహకులు పెన్నుతో రూ.20గా మార్పు చేశారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు గురువారం ఉదయం స్టాండ్‌ నిర్వాహకులను ప్రశ్నించారు. దీంతో అక్కడి సిబ్బంది కటువుగా సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని అప్పటికప్పుడే ఫోన్‌ ద్వారా విజయనగరం ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ దృష్టికి కొందరు తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆ వాహన స్టాండ్‌ నిర్వాహకులకు పార్కింగ్‌ ఫీజు పెంచేందుకు ఎటువంటి అనుమతి ఇవ్వలేద’ని చెప్పడంతో... నిర్వాహకులు కంగుతిన్నారు. అయినా ఫీజు తగ్గించకపోవడంతో చేసేదిలేక ప్రయాణికులు నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా నెలవారీ సీజన్‌ కార్డుకు రూ.250 వంతున వసూలు చేయాల్సి ఉండగా... రూ.400 వంతున వసూలు చేస్తున్నారు. పొరపాటున నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు అధికంగా స్టాండ్‌లో వాహనం ఉన్నా ఏకంగా 12 గంటలకు సంబంధించిన మొత్తాన్నే చెల్లించాల్సి వస్తోంది. దీనిపై నిత్యం ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదు.


గడువుకన్నా ముందే...

వాస్తవానికి ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రవేశద్వారం వద్దనున్న సైకిల్‌ స్టాండ్‌ నిర్వాహకులు ఈ ఏడాది డిసెంబరు వరకూ పాత ఫీజులనే వసూలు చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడి నిర్వాహకులు ఈ ఏడాది జులై 5వతేదీ నుంచే కొత్తగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆరు నెలల ముందు నుంచే అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ స్టాండ్‌కు సగటున రోజుకు రూ.15వేల వరకూ ఆదాయం వస్తోంది. అంటే నెలకు దాదాపు రూ.4.50 లక్షల వరకూ వినియోగదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. స్టాండ్‌ పరిసరాల్లో ఎక్కడా ఫీజుల పట్టిక లేకపోవడం...ఆ విషయం అక్కడి ఆర్టీసీ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. 


బయట నిలిపినా వసూళ్లే..  

కొంతమంది వాహనదారులు తమ బంధువులను బస్సు ఎక్కించడానికో... దూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లేందుకో ద్విచక్ర వాహనాలను కాంప్లెక్స్‌ పరిసరాల్లో కాసేపు నిలుపుతుంటారు. ఆ కాస్త సమయానికి..అది కూడా స్టాండ్‌లో కాకుండా బయట నిలిపినా పార్కింగ్‌ నిర్వాహకులు బలవంతంగా 12 గంటల కాలానికి ఫీజు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. ఇలాంటివి ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళుతున్నా స్పందించడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట రోడ్డుపై నిలపడానికి అవకాశం ఉండదని, కాంప్లెక్స్‌ పరిసరాల్లో వాహనాలు పార్క్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. 


డిసెంబరు వరకూ పెంచకూడదు

ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సైకిల్‌ స్టాండ్‌ నిర్వాహకులు పార్కింగ్‌ ఫీజు పెంచడానికి అధికారికంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అక్రమంగా వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబరు వరకూ వారు పాత ఫీజులనే వసూలు చేయాలి. అక్రమంగా వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకుంటాం. దీనిపై విచారణ చేయాలని శ్రీకాకుళం డిపో మేనేజర్‌ను ఆదేశించాం.

- అప్పలరాజు, ఆర్టీసీ ఆర్‌.ఎం, విజయనగరం

-------------------

పార్కింగ్‌ ఫీజు పెంచేందుకు వీలులేదు

సైకిల్‌ స్టాండ్‌లలో వేలం పాట సమయంలో నిర్ణయించిన పార్కింగ్‌ ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. ఆర్టీసీ అధికారుల కమిటీ అనుమతి లేనిదే పార్కింగ్‌ ఫీజులను పెంచడానికి వీల్లేదు. అధిక మొత్తంలో పార్కింగ్‌ ఫీజులను వసూలు చేస్తున్న సైకిల్‌ స్టాండ్‌ యజమానులపై చర్యలు తీసుకుంటాం.

-ప్రవీణ, మేనేజరు, ఆర్టీసీ 1వ డిపో, శ్రీకాకుళం

Updated Date - 2021-08-06T05:09:40+05:30 IST