‘నైట్‌ సఫారీ’ వద్దు

ABN , First Publish Date - 2021-06-15T09:01:18+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులో ప్రతిపాదించిన నైట్‌ సఫారీ పార్కు ఏర్పాటు సాధ్యమవదని స్పష్టమైంది.

‘నైట్‌ సఫారీ’ వద్దు

  • పార్కు నిర్వహణ భారమవుతుంది.. వెనక్కి తగ్గిన హెచ్‌ఎండీఏ
  • కొత్వాల్‌గూడలో ఎకో పార్కుకే మొగ్గు
  • కసరత్తు చేస్తున్న అధికారులు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులో ప్రతిపాదించిన నైట్‌ సఫారీ పార్కు ఏర్పాటు సాధ్యమవదని స్పష్టమైంది. దట్టమైన అడవి, అందులో అనేక రకాల జంతువులు, కేవలం రాత్రి వేళలోనే సందర్శకులను అనుమతించే జూ పార్కు ఏర్పాటుకు ఇతర కారణాలతో పాటు నిర్వహణ కూడా భారమవుతుందని అధికారులు నిర్ణయానికొచ్చారు. విదేశాల నుంచి వన్యప్రాణులను తీసుకొచ్చి పెంచి పోషించడం ఓ సవాల్‌. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే అప్రదిష్టపాలు కావాల్సి వస్తుందని నైట్‌ సఫారీ పార్కు ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ విరమించుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినట్లుగానే ఎకో పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.         

              

నిర్వహణ భారమని విరమణ..

నైట్‌ సఫారీ ప్రాజెక్టు గురించి రెండేళ్ల క్రితం హడావుడి చేసిన అధికారులు, తర్వాత ప్రాజెక్టును విరమించుకున్నారు. దేశంలోనే ప్రథమ నైట్‌ సఫారీ పార్కును ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసేందుకు నోయిడా డెవల్‌పమెంట్‌ అథారిటీ ఆరేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే నిధుల లేమితో ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. హైదరాబాద్‌ను టూరిస్ట్‌ హబ్‌గా మారేందుకు నైట్‌ సఫారీ పార్కు ఉపయోగపడుతుందని భావించగా, అనూహ్యంగా ప్రాజెక్టు నుంచి హెచ్‌ఎండీఏ తప్పుకుంది. నైట్‌ సఫారీ పార్కులో ఏర్పాటు చేసే వన్యప్రాణులను విదేశాల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అవి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయా..? వాటి నిర్వహణ భరించడం సాధ్యమవుతుందా..? ఇలా అనేక సందేహాలతో ప్రాజెక్టు నుంచి విరమించుకున్నట్లు తెలిసింది. 111 జీఓ పరిధిలో ఉన్న కొత్వాల్‌గూడలో కేవలం పార్కు ఏర్పాటుకు అనుమతులున్నా, ఫుడ్‌ కోర్టులు, ఇతర భారీ నిర్మాణాలు చేపట్టడం కూడా విరుద్ధం. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసే నైట్‌ సఫారీ పార్కు నిర్వహణ కూడా భారమవనుందని అధికారులు భావించారు.


కొత్వాల్‌గూడలో ఎకో పార్కు..

కొత్వాల్‌గూడలో ఎకో పార్కును ఏర్పాటు చేయడానికే హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 111జీఓ పరిధిలో ఉన్న 50ఎకరాల్లో పార్కు మినహా ఇతర అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదు. గండిపేట చెరువుకు సమీపంలో ఉండే ఎకో పార్కును నగరవాసులకు సెలవుల విడిది కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఎకో టూరిజం పార్కు ఏర్పాటుపై ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు చేసింది. పార్కు ఏర్పాటుకు డిజైన్లు కూడా చేశారు. కానీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక ఎకో పార్కుకు బదులు నైట్‌ సఫారీ పార్కును ప్రతిపాదించారు. చివరకు మళ్లీ ఎకో పార్కునే ఏర్పాటు చేయాలనిత భావిస్తున్నారు.

Updated Date - 2021-06-15T09:01:18+05:30 IST