పరిషత్‌ తుస్‌!

ABN , First Publish Date - 2021-04-09T06:01:37+05:30 IST

జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు స్పందన కరువైంది. ఎన్నడూలేని విధంగా 51.68శాతం ఓటింగ్‌ నమోదైంది. 41 జడ్పీటీసీ, 367 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 17,41,396 మంది ఓటర్లు ఉండగా వారికోసం 2,194 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగింది. కొద్దిచోట్ల మినహా 90శాతానికిపైగా ప్రాంతాల్లో నిర్ణీత సమయానికే పోలింగ్‌ ముగిసింది.

పరిషత్‌ తుస్‌!
బిపేటలో వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రం


ఎక్కువశాతం ఆసక్తిచూపని ఓటర్లు

నామమాత్రంగా పోలింగ్‌

ఉదయం నుంచి మందకొడిగానే సాగిన ఓటింగ్‌

అనేక చోట్ల మూడవ వంతు మించని వైనం

మొత్తంగా 51.68 శాతం పోలింగ్‌

పలుచోట్ల ఘర్షణలు, వివాదాలు, ఉద్రిక్తతలు


జిల్లాలో పరిషత్‌ ఎన్నికలపై ఓటర్లు పెద్దగా ఆసక్తిచూపలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న గ్రామీణ ప్రాంత ఓటర్లు గురువారం జరిగిన పరిషత్‌ పోరుపై మాత్రం అంతగా స్పందించలేదు. జిల్లాలో గురువారం జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కేవలం 51.68శాతం మాత్రమే  పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా సింగరాయకొండ మండలంలో 86.67శాతం, చీమకుర్తిలో 77.40శాతం, అద్దంకిలో 72.03 శాతం నమోదు  కాగా అత్యల్పంగా వైపాలెం మండలంలో 31.27శాతం, వేటపాలెంలో 32.48 శాతం నమోదైంది. అత్యధిక ప్రాంతాల్లో  40 నుంచి 50శాతంలోపుగానే ఓటర్లు త మ ఓటుహక్కు వినియోగించుకోగా, కేవలం పది, పన్నెండు మండలాల్లో మాత్రమే జిల్లా సగటు కన్నా మించి పోలింగ్‌ జరిగింది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన దగ్గర నుంచి సాయంత్రం వరకు అత్యధిక ప్రాంతాల్లో కేంద్రాలలో పోలింగ్‌ మందకొడిగానే సాగింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలను బహిష్కరించడమే కారణమన్న ప్రచారం ఉంది. అదేసమయంలో కొన్నిచోట్ల ఘర్షణలు, వాదోపవాదాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు.  

ఒంగోలు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు  స్పందన కరువైంది. ఎన్నడూలేని విధంగా 51.68శాతం ఓటింగ్‌ నమోదైంది. 41 జడ్పీటీసీ, 367 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 17,41,396 మంది ఓటర్లు ఉండగా వారికోసం 2,194 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగింది. కొద్దిచోట్ల మినహా 90శాతానికిపైగా ప్రాంతాల్లో నిర్ణీత సమయానికే పోలింగ్‌ ముగిసింది. అయితే అత్యధిక ప్రాంతాల్లో ఓటర్లు ఆసక్తిచూపలేదు. వేసవికాలం కావడంతో సాధారణంగా ఉదయం నుంచే పెద్దసంఖ్యలో ఓటర్లు బారులు తీరి, ఓటుహక్కు వినియోగించుకొని మధ్యాహ్నానికి దాదాపు 60శాతం పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అలాగే జరిగింది. అయితే ప్రస్తుత పరిషత్‌ ఎన్నికలకు మాత్రం ఉదయం నుంచి ఓటర్లు పెద్దగా కనిపించలేదు. అనేకచోట్ల ఉదయం 10గంటల  వరకు ఓటర్లు రాక పోలింగ్‌కేంద్రాలు వెలవెలబోయాయి. 


ఉదయం నుంచి వెలవెల

అధికారవర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో ఉదయం 8 గంటలకు కేవలం 2.22శాతం, 9గంటలకు 6.60శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటలకు 15.05 శాతం నమోదు కాగా 1గంటకు 27.44శాతం, అలాగే మధ్యాహ్నం 3కు 34.20శాతం, సాయంత్రం 4గంటలకు 37.57శాతం నమోదైంది. గతానికి భిన్నంగా ఈసారి పరిషత్‌ పోరును తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అత్యధిక ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది చోట్ల అది కూడా ఎంపీటీసీలకు మాత్రమే వారు పోటీపడ్డారు. దీంతో అత్యధికప్రాంతాల్లో టీడీపీ మద్దతుదారులు ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపలేదు. అదేసమయంలో దీటైన పోటీ లేకపోవడంతో గెలుపు ఖాయంగా భావించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపే డబ్బు, మద్యం పంపిణీపై పెద్దగా స్పందించలేదు. దీంతో సాధారణ ఓటర్లలో అధికులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గెలుపుపై నమ్మకంతో టీడీపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చిన చోట, అలాగే రెబల్స్‌ గట్టిగా నిలిచిన ప్రాంతాల్లో మినహా ఇతరచోట్ల ఓటింగ్‌శాతం గణనీయంగా తగ్గింది. 


దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో ఘర్షణలు

పరిషత్‌ పోలింగ్‌ సందర్బంగా దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అద్దంకి మండలం ధర్మవరం, కొత్తపట్నం మండలం పల్లెపాలెం, పర్చూరు మండలం వీరన్నపాలెంలలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరగ్గా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దొనకొండ మండలం పెద్దగుడిపాడులో వైసీపీ-రెబల్‌ అభ్యర్థి మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఒకరికి  గాయాలయ్యాయి. ముండ్లమూరు మండలం ఈదరలో స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తాళ్ళూరు మండలం శివరాంపురంలో ఎమ్మెల్యే సోదరుడైన మద్దిశెట్టి రవీంద్ర పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు రాగా వైసీపీ రెబల్‌ అభ్యర్థి, అలాగే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. రవీంద్ర కారు అద్దాలు ధ్వంసమయాయ్యయి. 


గుర్తులపై వివాదం

పామూరు-2, 4 ఎంపీటీసీ స్థానాల్లో వామపక్షాల అభ్యర్థుల గుర్తులపై వివాదం రేగింది. సీపీఐ నేతలు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులతో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా జిల్లా ఉన్నతాధికారులు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఓటింగ్‌ సరళిని పరిశీలించడంతో పాటు భారీబందోబస్తు ఏర్పాటుచేశారు. వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి బూచేపల్లి వెంకాయమ్మ, అమె కుమారుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివప్రసాదరెడ్డిలు చీమకుర్తి మండలం ఊబచెత్తపాలెంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వైపాలెంలో, జేసీ వెంకటమురళీ సంతమాగులూరు, మరో జేసీ చేతన్‌ ఉలవపాడు మండలంలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.  


 వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు ఇలా..

- పామూరు-4 ఎంపీటీసీలో గుర్తు తారుమారు కావడంతో సీపీఐ పార్టీ నేతలు ఆందోళన. పామూరు2,4 రెండుచోట్ల రీపోలింగ్‌కు సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు.

- పోటీపోటీగా ఎన్నిక జరిగిన అద్దంకి మండలం ధర్మవరంలో ఇరు వర్గీయులు ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

- ముండ్లమూరు మండలం ఈదరలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్‌తో పాటు దర్శికి చెందిన కొందరు పోలింగ్‌ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకున్న టీడీపీ వర్గీయులు. రెండు వర్గాలు మొహరింపుతో ఉద్రిక్తత

- తాళ్ళూరు మండలం శివరాంపురంలో పోలింగ్‌ పరిశీలించేందుకు వచ్చిన మండల వైసీపీ ఇన్‌చార్జీ మద్దిశెట్టి రవీంద్ర కారును అడ్డగించిన వైసీపీ రెబల్‌, టీడీపీ వర్గీయులు. కారు అద్దాలు ధ్వంసం

- కురిచేడు మండలం దేకనకొండలో పోలింగ్‌ బూత్‌ను తమకు తెలియకుండా లోకేషన్‌ మార్చారని నిరసిస్తూ ఓటింగ్‌కు రాని ఎస్సీలు, అధికారుల జోక్యంతో సాయంత్రానికి హాజరు

- దొనకొండ మండలం పెద్దగుడిపాడు పోలింగ్‌ కేంద్రం వద్ద దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ రాకుండా అడ్డుకున్న వైసీపీ ఇండిపెండెంట్‌ అభ్యర్థి వర్గీయులు.. అనంతరం ఘర్షణ. మహిళలకు గాయాలు.

- తర్లుపాడు మండలం పాతలపాడులో వైసీపీ నాయకుల మధ్య విభేదాలతో ఏజెంట్ల నియామకంపై వివాదం. మూడు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ 10గంటలకు ప్రారంభం.

- పర్చూరు మండలం చెరుకూరులో ఎన్నికల సిబ్బంది మెటీరియల్‌ తీసుకురావడంలో జరిగిన లోపంతో కొంతసేపు నిలిచి తర్వాత సాగిన పోలింగ్‌

- కొత్తపట్నం మండలం కే.పల్లెపాలెంలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు.

- కొండపి మండలం పెట్లూరు, మండలకేంద్రమైన లింగసముద్రం-1వ ఎంపీటీసీ కేంద్రాల వద్ద స్వల్ప ఘర్షణలు

- పర్చూరు మండలం వీరన్నపాలెంలో బ్యాలెట్‌ పేపర్లు లేక కొంతసేపు పోలింగ్‌ ఆగిపోగా అనంతరం వాటిని తెప్పించిన పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం కొద్దిసేపటికి పోలింగ్‌కేంద్రం సమీపంలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

-





Updated Date - 2021-04-09T06:01:37+05:30 IST