పరిషత్‌ పోరు.. సాదాసీదాగా

ABN , First Publish Date - 2021-04-06T04:04:21+05:30 IST

ఎన్నికలంటేనే ఓ ప్రహసనం. ఎక్కడా చూసినా హడావుడి. గ్రామగ్రామాన పార్టీలవారీగా ముచ్చట్లు.. రాజకీయ శిబిరాలు.. నోట్ల పంపకాలు.. బంధుత్వాలు.. ఆత్మీయ పలకరింపులు... బలవంతపు ఆప్యాయతలు చోటుచేసుకుంటాయి. కానీ ఈసారి ఇటువంటి ఆర్భాటాలు లేకుండా పరిషత్‌ పోరు సాదాసీదాగా సాగుతోం

పరిషత్‌ పోరు.. సాదాసీదాగా


చివరి దశలో వేడెక్కుతున్న రాజకీయం

అధిష్ఠానం వద్దన్నా.. పోటీకీ సై అంటున్న తెలుగు తమ్ముళ్లు

‘స్థానిక’ పట్టు నిలబెడతామని ఆశాభావం

రాజీ దిశగా వైసీపీ నేతల యత్నాలు

ఓటర్లకు ప్రలోభాలు 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌/ఇచ్ఛాపురం రూరల్‌)

ఎన్నికలంటేనే ఓ ప్రహసనం. ఎక్కడా చూసినా హడావుడి. గ్రామగ్రామాన పార్టీలవారీగా ముచ్చట్లు.. రాజకీయ శిబిరాలు.. నోట్ల పంపకాలు.. బంధుత్వాలు.. ఆత్మీయ పలకరింపులు... బలవంతపు ఆప్యాయతలు చోటుచేసుకుంటాయి. కానీ ఈసారి ఇటువంటి ఆర్భాటాలు లేకుండా పరిషత్‌ పోరు సాదాసీదాగా సాగుతోంది. అధికారుల్లో మాత్రమే హడావుడి కనిపిస్తోంది. పరిషత్‌ పోరును బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధిష్ఠానం ప్రకటించడంతో.. వైసీపీ నేతల్లో గెలుపుపై మరింత ధీమా పెరిగింది. కానీ, అధిష్ఠానం వద్దన్నా, క్షేత్ర స్థాయిలో కొందరు తెలుగు తమ్ముళ్లు బరిలో కొనసాగి... ‘స్థానికంగా’ టీడీపీకి ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు ఎన్నికలకు సై అంటున్నారు. దీంతో పరిషత్‌ పోరు వేడెక్కుతోంది. టీడీపీ అభ్యర్థులను తమ దారికి తెచ్చుకునే విధంగా వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వారిని సంప్రదించి.. బరిలో నుంచి తప్పుకునేలా బేరసారాలు సాగిస్తున్నారు. మరోవైపు నగదు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. 

జిల్లాలో ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 10న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నేతల్లో మాత్రం సందడి తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 678 మండల ప్రాదేశిక స్థానాలకుగానూ 11 స్థానాలు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. దీంతో ఆ స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 667 స్థానాల్లో 66 ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది కాలంలో మరో 11 స్థానాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు మరణించారు. దీంతో ఈ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడనున్నాయి. మిగిలిన 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జడ్పీటీసీల విషయానికొస్తే.. జిల్లాలో 38 మండలాలకుగానూ హిరమండలంలో అధికార పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఇటీవల మృతిచెందాడు. దీంతో 37 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి గత ఏడాదే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు నిలిచిపోయాయి. తాజాగా యథావిధిగా ఈ ప్రక్రియ కొనసాగించాలని ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తేనే పోటీలో కొనసాగుతామని టీడీపీ ముందు నుంచీ ప్రకటించింది. కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో పరిషత్‌ పోరును బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో వైసీపీ అభ్యర్థుల ఆనందానికి అవధుల్లేవు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. పోటీ నుంచి తప్పుకోవడంతో పరిషత్‌ పోరు ఏకపక్షం అనే ధీమాలో ఉన్నారు. విజయం తమదే అని భావించి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి రంగంలోకి దిగలేదు. కొన్నిచోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు ప్రచారాన్ని సాగిస్తున్నారు. పరిషత్‌ పోరును బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధిష్ఠానం ప్రకటించినా, గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో కొందరు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో టీడీపీకి మంచి పట్టు ఉంది. దీంతో ఆ స్థానాలను వదులుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో పరిషత్‌ బరిలో సత్తా చాటేందుకు సై అంటున్నారు. మరోవైపు బీజేపీ, జనసేనలు కూడా పరిషత్‌ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు పార్టీలూ వేర్వేరుగా సుమారు 50 ఎంపీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. అభ్యర్థులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో వైసీపీ నాయకులు తమకు మెజార్టీతో పాటు స్థానాలు తగ్గే అవకాశం ఉందని మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. టీడీపీకి చెందిన అభ్యర్థులను సంప్రదించి.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇందుకోసం రూ.లక్షల్లో నగదు ఆఫర్‌ ప్రకటిస్తున్నారు. పోటీ తప్పకుండా ఉంటుందన్న స్థానాల్లో మాత్రమే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నగదు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు దిగుతున్నారు. 


 మైక్‌ ప్రచారానికి అనుమతి ఏదీ?

ఎన్నికల ప్రచారం అంటేనే మైకు తప్పనిసరి. ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే మండల స్థాయి అధికారులు కార్యాచరణలోకి దిగాలి. కానీ ఈ పరిషత్‌ పోరులో ఇది ఏమాత్రం కనిపించనే లేదు. నోటిఫికేషన్‌ జారీ చేసిన మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేశారు. ప్రచారానికి మైక్‌లకు అనుమతి ఇవ్వండి అంటూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా.. అనేక చోట్ల స్పందించడం లేదు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది.  


 11 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు వాయిదా

జిల్లాలో 11 మండలాల్లో 12 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఈ ఏడాది వ్యవధిలో మృతిచెందారు. భామిని మండలంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి మరణించగా... అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నందున ఎన్నికలు జరుగుతున్నాయి. కంచిలి మండలంలో ఇద్దరు, కొత్తూరు, మందస, రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం, పోలాకి, సీతంపేట, వీరఘటం, హిరమండలం, బూర్జ మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ అభ్యర్థి మరణించారు. దీంతో ఈ 11 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ పది మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులకు అధ్యక్ష పీఠంపై టెన్షన్‌ నెలకొంది. టీడీపీ అధిష్ఠానం ఎన్నికలు బహిష్కరించినా.. కొంతమంది స్థానిక నేతలు మాత్రం బరిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి పట్టు ఉన్న స్థానాల్లో పోటీ నెలకొంది. దీంతో మండల అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందోనన్న భయం ఎంపీపీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎంపీటీసీ స్థానాలు సమానంగా వచ్చిన చోట అధ్యక్ష పదవిని డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఒక్క ఓటు తేడా వచ్చినా.. అభ్యర్థులు మరణించిన ఆ పది మండలాల్లో చేతులారా పదవి కోల్పోతామోనని ఎంపీపీ అభ్యర్థులు మథనపడుతున్నారు. 



Updated Date - 2021-04-06T04:04:21+05:30 IST