తండ్రి శత్రుచర్ల వ్యాఖ్యలపై పరీక్షిత్ రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2020-06-06T01:00:55+05:30 IST

ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ శత్రుచర్ల చంద్రశేఖర రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే...

తండ్రి శత్రుచర్ల వ్యాఖ్యలపై పరీక్షిత్ రియాక్షన్ ఇదీ..

విజయనగరం : ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ, వైసీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇటీవల ఆయన మీడియా ముందుకొచ్చి పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గమైన కురుపాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆరోపించారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారంటూ తన కోడలు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. సొంత పార్టీ నేత అది కూడా కోడలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అటు వైసీపీలో.. ఇటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


కొడుకు రియాక్షన్ ఇదీ..

ఈ వ్యాఖ్యలపై తాజాగా  శత్రుచర్ల కుమారుడు, పుష్పా శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు రియాక్ట్ అయ్యారు. శుక్రవారం నాడు నియోజకవర్గంలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. తండ్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ప్రతిపక్షం కూడా ప్రశ్నించలేని వాతావరణంలో సొంత వాళ్లే ఇలా వేలి ఎత్తి చూపటం సమంజసం కాదు. మేం అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తాం. వైసీపీ వారికే పెన్షన్లు ఇస్తున్నామని నా తండ్రి ఆరోపించినట్టు మేం వ్యవహరించటం లేదుఅని పరీక్షిత్ రాజు స్పష్టం చేశారు.


శత్రుచర్ల అసలేమన్నారు..!?

వైసీపీకి అనుకూలంగా లేకపోతే అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వడం లేదు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. జగన్‌లాగా వైఎస్ ఎప్పుడూ చేయలేదు. ఆయన పాలన బాగుండేది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పార్టీలకు, కులాలకు అతీతంగా పేదలందరికీ ఇళ్లు ఇచ్చాం. ఇప్పుడు అర్హులైన పేదలెవరికీ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. సంక్షేమంపై వైసీపీ ప్రభుత్వానికి అవగాహన లేదుఅని అటు కోడలు పుష్ప శ్రీవాణి.. ఇటు వైసీపీ ప్రభుత్వంపై చంద్రశేఖరరాజు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-06-06T01:00:55+05:30 IST