పరికరాలు ఉన్నా.. ప్రయోజనం శూన్యం!

ABN , First Publish Date - 2021-06-24T04:13:12+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని పదే పదే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు.

పరికరాలు ఉన్నా..   ప్రయోజనం శూన్యం!
నిరుపయోగంగా వార్మర్లు

నిరుపయోగంగా యంత్రాలు

రూ.లక్షలు ప్రజాధనం వృథా

ఇదీ ఉదయగిరి సీహెచసీ దుస్థితి


ఉదయగిరి రూరల్‌, జూన 23 : ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని పదే పదే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వ వైద్యశాలలకు అందజేసిన విలువైన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. అందుబాటులో ఉన్న పరికరాలు వినియోగించేందుకు అవసరమైన వైద్యులు, టెక్నీషియన్లు లేకపోవడంతో కొన్ని పరికరాలు అట్టపెట్టెలకే పరిమితమయ్యాయి. అలా్ట్ర స్కానింగ్‌ మిషన, పల్స్‌ ఆక్సీమీటర్లు, బాయిలర్స్‌, అనస్తీషియా యంత్రం, వార్మర్లు, ఫొటోథెరపీలు తదితర యంత్రాలు ఏళ్ల తరబడి వినియోగించక మూలకు చేరుకొంటున్న పరిస్థితి ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఆయా పరీక్షల కోసం వేల రూపాయలు వెచ్చించడంతో పాటు సుదూర ప్రాంతాలకు పరుగులు తీయ్యాల్సిన పరిస్థితి. 


వైద్యులు లేకే...


వైద్యశాలలో అనస్తీషియా, స్కానింగ్‌ యంత్రాలు ఉన్నా అందుకు సంబంధించిన వైద్యులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. గర్భిణులు వైద్యశాలకు వస్తే బయటకు వెళ్లి స్కానింగ్‌ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స సమయంలో మత్తు అందించే యంత్రం ఉన్నా అందుకు సంబంధించి నిపుణుడు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా మూలకు చేరుకొంది. దీంతో వైద్యశాలలో శస్త్ర చికిత్సల శాతం కూడా పడిపోతుంది. ప్రతినెలా 9న ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష సంయోజన పథకం కింద గర్భిణులకు నిర్వహించే పరీక్షల సమయంలో వారికి తప్పనిసరిగా స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యంత్రం ఉన్నా స్కానింగ్‌ చేసే వారు వారు లేక సేవలకు దూరమవుతున్నారు. 


నిరుపయోగంగా నవజాత శిశు కేంద్రం


ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చిన్న పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో 2013లో నూతన హంగులతో రూ.5 లక్షలు వెచ్చించి నవజాత శిశు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రానికి అవసరమైన వార్మర్లు, ఫొటోథెరపీ యంత్రాలు తదితరవి సమకూర్చారు. కానీ కేంద్రం ప్రారంభంలో కొన్ని రోజులపాటు వైద్యసేవలు అందించినా అనంతరం నిపుణుల లేక ఆ కేంద్రం సైతం మూతపడింది. తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సేవలు అందడంలేదు. ఒకవేళ వైద్యశాలకు వెళ్లిన అరకొర చికిత్స అందించి ఇతర వైద్యశాలలకు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి వైద్యశాలలో వైద్యులు, సిబ్బందిని నియమించి నిరుపయోగంగా ఉన్న పరికరాలను వాడుకలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. 


వైద్యులు కొరతతోనే..


వైద్యుల కొరత కారణంగానే యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. వైద్యశాలలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించాం. వారిని నియమిస్తే పరికరాలు వినియోగంలోకి రావడంతోపాటు రోగులకు మెరుగైన సేవలు అందుతాయి.

- మాళవిక, సూపరింటెండెంట్‌, ఉదయగిరి



Updated Date - 2021-06-24T04:13:12+05:30 IST