పరిహారం పరిహాసం...

ABN , First Publish Date - 2020-12-05T03:52:43+05:30 IST

సింగరేణిలో ఓపెన్‌ కాస్టు గనుల ఏర్పాటుకు సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లించడంలో తీవ్ర తాత్సారం జరుగుతోంది.

పరిహారం పరిహాసం...
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న ఓసీపీ నిర్వాసితులు (ఫైల్‌)

సింగరేణి ఓసీపీ నిర్వాసితులకు అందని పరిహారం

సంవత్సరం గడుస్తున్నా రైతు కూలీలను గుర్తించని అధికారులు

ప్రాజెక్టు పనులను అడ్డుకొనేందుకు సిద్ధమవుతున్న బాధితులు

(మంచిర్యాల, ఆంధ్రజ్యోతి)

సింగరేణిలో ఓపెన్‌ కాస్టు గనుల ఏర్పాటుకు  సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లించడంలో తీవ్ర తాత్సారం జరుగుతోంది. జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న అండర్‌ గ్రౌండ్‌ మైన్లు ఐకే 1, ఐకే 1ఏ ఇంక్లైన్‌ గనులను ఇందారం ఓపెన్‌ కాస్టు ఫేజ్‌-1 గనిగా మారు స్తుండగా, అవసరమైన భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సంవత్సరం క్రితం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో భాగంగా మండలంలోని ఇందా రం, టేకుమట్ల, కాచన్‌పల్లి గ్రామాల్లోని 632 ఎకరాలకు సంబంధించి భూసేకరణ జరపాలని జైపూర్‌ తహసీల్దా ర్‌కు మంచిర్యాల ఆర్డీఓ 2019లో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఓపెన్‌ కాస్టు ఏర్పాటుకు అవసరమైన భూములను రెవెన్యూ అధికారులు సంవత్సరం క్రితమే సేకరించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహా రం చెల్లించలేదని రైతులు ఆవేధన చెందుతున్నారు. 


అందని పరిహారం...

ఓపెన్‌కాస్టు ఏర్పాటు కోసం సేకరించిన భూములకు  ఎకరాకు ఇందారంలో రూ.24.60 లక్షలు, టేకుమట్లలో రూ.18.60లక్షలు, కాచన్‌పల్లిలో రూ.12.60లక్షలు పరిహా రం చెల్లించేందుకు సింగరేణి అంగీకరించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 453 ఎకరాలకు అవార్డు పూర్తి కాగా మరో 179 ఎకరాలకు పెండింగులో ఉంది. ఇంకా 158 మంది నిర్వాసితులకు పరిహారం అందాల్సి ఉంది. ఇదిలా ఉండగా పరిహారం పొందిన వారికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అందలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం 2013 ప్రకారం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి మార్కెట్‌ విలువ ఆధారంగా నష్టపరిహారం చెల్లిం చడంతోపాటు ఉపాధి కోల్పోతున్నందుకుగాను ప్రతి నిర్వాసితునికి రూ.5 లక్షలు అదనంగా జీవనభృతి చెల్లిం చాల్సి ఉంది. అయితే ఇందారం ఓసీపీకి సంబంధించి సింగరేణి అఽధికారులు ఒక్కరికి కూడా ఇప్పటి వరకు జీవనభృతి చెల్లించలేదు. 


సోషల్‌ ఎకానమిక్‌ సర్వే ఎప్పుడు...?

భూ సేకరణలో భూములు కోల్పోతున్న గ్రామ ప్రజల తోపాటు ఆ గ్రామంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేతి వృత్తుల వారు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి గల వారు, వ్యవసాయ కూలీలకు సైతం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాల్సి ఉంది. కుటుం బంలో భార్యా భర్తలు ఇద్దరు ఉపాధి కోల్పోతుండగా వారికి డైలీ వేజెస్‌ కింద ఒక్కక్కరికి రూ.359 చొప్పున మొత్తం రూ.718లో నుంచి లే ఆఫ్‌ కింద 50 శాతం వేజెస్‌ చెల్లించాల్సి ఉంది. అలా ఉపాధి కోల్పోయిన వారి కి జీవితాంతం సంస్థ తరఫున వేజెస్‌ చెల్లించాలి. లేనిపక్షంలో వారికి శాశ్వత ఉపాధి కల్పిచడమో లేదా ఏక మొత్తం సెటిల్‌మెంట్‌ పద్ధతిలో జీవనభృతి అయినా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగరేణి అధికారు లతో కలిసి రెవెన్యూశాఖ సోషల్‌ ఎకానమిక్‌ సర్వే (సామాజిక ఆర్థిక గణన) నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించాలి. అయితే భూములు సేకరించి సంవత్సరం గడుస్తున్నా సంబంధిత అధికారులు సోషల్‌ ఎకానమిక్‌ సర్వే నిర్వహించక పోవడం  గమనార్హం. మండలంలోని భూములు కోల్పోతున్న పై మూడు గ్రామాల్లో దాదాపు వెయ్యి వరకు రైతు కూలీలు ఉంటారని అంచనా. వీరందరికీ లే ఆఫ్‌ కింద పరిహారం చెల్లించాల్సి ఉంది. 


పనుల అడ్డగింతకు సమాయత్తం...

భూ నిర్వాసితులు, వాటిపై ఆధారపడ్డ ఇతరులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భూ నిర్వాసిత సంఘం అధ్యక్షుడు ముకుందరెడ్డి, ఉపాధ్యక్షు డు తాటిపెల్లి శ్రీనివాస్‌, ఇతర సభ్యుల నేతృత్వంలో పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఇటీవల సింగరేణి డైరెక్టర్‌కు, కలెక్టర్‌ భారతీ హోళికేరికి వినతిపత్రాలు అందజేశారు. అయినా ఇప్పటి వరకు సోషల్‌ ఎకానమిక్‌ సర్వే నిర్వహించకపోవడంతో కూలీలు పరిహారానికి నోచుకోవడం లేదు. పెద్దపెల్లి జిల్లా గోదా వరిఖని ఓసీపీ-4కు సంబంధించి భూములపై ఆధార పడిన వారికి పరిహారం చెల్లించగా, మంచిర్యాల జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియను చేపట్టలేదు. కాగా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఓసీపీ పనులు ప్రారంభించడంతో వాటిని అడ్డుకొనేందుకు నిర్వాసితులు సమాయత్తం అవుతున్నారు. 


పనులను అడ్డుకుంటాం....

ఆంజనేయులు, రైతు టేకుమట్ల

ఓసీపీ కింద భూములు సేకరించిన గ్రామాల్లో ఇంత వరకు కూలీల సర్వే చేపట్టలేదు. సింగరేణి యాజమా న్యం మాత్రం ఓసీపీ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. సర్వే చేయకుండా పనులు చేపడితే ఊరుకొనేది లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేనిపక్షంలో ఓసీపీ పనులను అడ్డుకోవలసి వస్తుంది.


నిరుద్యోగ భృతి ఇవ్వాలి....

రాజక్క, రోజువారీ కూలి, ఇందారం

ఇందారం ఓసీపీలో సింగరేణి తీసుకున్న మూడు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించింది. మాకు భూములు లేవు. రోజువారీ కూలీ చేసి బతికేటోళ్లం. ఉన్న ఉపాధి పోయింది. పనుల కోసం ఎక్కడికి వెళ్లాలి. సింగరేణి యాజమాన్యం నిరుద్యోగ భృతి కింది నెలకు రూ. 10వేలు ఇవ్వాలి.


నష్టపరిహారం చెల్లించాం...

మంచిర్యాల ఆర్డీఓ రమేష్‌

ఇందారం ఓపెన్‌ కాస్టు గనికి సంబంధించి భూములు కోల్పోయిన జైపూర్‌ మండలంలోని టేకుమట్ల, ఇందారం, కాచన్‌పల్లి ప్రజలకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగింది. అయితే గ్రామాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి భృతి చెల్లించే విషయమై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపడతాం. 


Updated Date - 2020-12-05T03:52:43+05:30 IST