ప్రత్యక్ష బోధనకు ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-03-05T05:28:10+05:30 IST

ప్రత్యక్ష బోధనకు ఎదురుచూపు

ప్రత్యక్ష బోధనకు ఎదురుచూపు

ఏడాదిగా చదువుకు దూరమయ్యారని ‘ప్రాథమిక’ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన

బడుల్లోకి అనుమతించాలని వేడుకోలు

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఒక్కపూటైనా నిర్వహించాలని అభిప్రాయం

బోనకల్‌, మార్చి 4: ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో పిల్లలు బడిబాట పట్టారు. కానీ ప్రాథమిక పాఠశాలల స్థాయి వారికి మాత్రం ఆన్‌లైన్‌ విద్యను కొనసాగిస్తున్నారు. 3 నుంచి 5 తరగతుల పిల్లలకు వారానికి ఐదు రోజుల పాటు ఉదయం 10:30గంటల నుంచి 11:30గంటల వరకు ఆన్‌లైన్‌ బోధన ప్రసారమవుతోంది. కేవలం ఒక సబ్జెక్టుకు ఆరగంట మాత్రమే భోదనకు అవకాశం ఉండటంతో పిల్లలు అంత ఆసక్తిగా పాఠలు వినడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చి 21 నుంచి పాఠశాలలను మూసి వేయడంతో విద్యార్థులకు ఏడాది కాలం వృథా అయిందని వాపోతున్నారు. ఉన్నత పాఠశాలలకు ఇచ్చినట్లుగానే ప్రాథమిక పాఠశాలల్లోనూ పిల్లలు హాజరయ్యేందుకు అనుమతించాలని, ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. టీచర్లంతా ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ.. పిల్లలు బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెరిగిన ఉష్ణోగ్రతలతో కనీసం ఒక్కపూట తరగతులనైనా నిర్వహిస్తే రెండు నెలల పాటు ప్రత్యక్ష భోదన అమల్లోకి వస్తుందని, దీంతో విద్యార్థులు ఏడాది కాలం తర్వాత బడిబాట పట్టినట్టు అవుతుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గడం, వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కూడా ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టేలా విద్యాశాఖ పునరాలోచించాలని కోరుతున్నారు. ప్రత్యక్ష బోధనతో పిల్లల్లో కనీస పరిజ్ఞానం పెంపొంది, వచ్చే విద్యా సంవత్సరానికి సన్నద్ధం చేసినట్టవుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-03-05T05:28:10+05:30 IST