మీ పిల్లలు నిరంతరం ఫోనుకే అతుక్కుపోతున్నారా? ఈ పని చేస్తే వెంటనే ఫోను పక్కన పడేస్తారు..

ABN , First Publish Date - 2021-12-08T14:24:33+05:30 IST

కోవిడ్-19తో ప్రారంభమైన ఆన్‌లైన్ తరగతుల ట్రెండ్..

మీ పిల్లలు నిరంతరం ఫోనుకే అతుక్కుపోతున్నారా?  ఈ పని చేస్తే వెంటనే ఫోను పక్కన పడేస్తారు..

కోవిడ్-19తో ప్రారంభమైన ఆన్‌లైన్ తరగతుల ట్రెండ్ పిల్లలను మొబైల్ ఫోన్లకు బానిసలుగా చేసిందని చాలామంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు అధిక సమయం మొబైల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అలవాటు పిల్లల శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటూ ఉంటే.. పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనాన్ని వదిలించేందుకు ఈ సులభమైన చిట్కాలను పాటించండి. తద్వారా వారు మొబైల్ ఫోనును పక్కన పడేస్తారు. 


ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 

ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా మంది పిల్లలకు ఎంతో ఇష్టం. మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం పిల్లలకు కేటాయించండి. పిల్లల పక్కన కూర్చోండి. వారి చేత చిన్నచిన్న వస్తువులను తయారు చేయించండి. ఇలా చేయడం ద్వారా మీ పిల్లలు మొబైల్‌కు దూరంగా ఉంటారు. అలాగే వారు మరింత సృజనాత్మకంగా మారతారు.

ఇండోర్ గేమ్స్

ప్రస్తుత కరోనా వాతావరణంలో పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ పిల్లలతో ఇండోర్ గేమ్‌లను ప్లాన్ చేయండి. ఇలా వారి దృష్టిని మొబైల్ నుండి మళ్లించడం ద్వారా ఇండోర్ గేమ్‌లపై వారికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా పిల్లల్లో మేధో వికాసం వృద్ధి చెందుతుంది. 

అవుట్‌డోర్ గేమ్‌లు 

మొబైల్‌ గేమ్స్‌కు అతుక్కుపోయే బదులు అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా పిల్లలను ప్రేరేపించండి. వారిని తోటి స్నేహితులతో బయట ఆడుకోనివ్వండి. ఇలా చేయడం వల్ల వారిలో స్వతహాగా స్నేహపూర్వక స్వభావం ఏర్పడటమే కాకుండా చురుకుగా తయారవుతారు. 


పుస్తకాలు చదివించండి 

మీ పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయండి. ఇలా చేయడం వల్ల వారి చదువులు మెరుగుపడతాయి. చాలా మంది పిల్లలు పెద్దవారయ్యాక కూడా పుస్తకాలను సరిగ్గా చదవలేకపోతుండటం గమనిస్తుంటాం. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే పుస్తకాలను చదివే అలవాటు చేయడం ఉత్తమం.

ఇంటి పనుల్లో సహాయం 

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి పనులకు దూరంగా ఉంచుతారు. అలా చేయడం మంచిదికాదు. బట్టలు ఆరబెట్టడం, బట్టలు సర్దడం, బెడ్‌ను శుభ్రం చేయడంలాంటి చిన్న చిన్న ఇంటి పనులను పిల్లల చేత చేయించడం ద్వారా వారు పని విలువ తెలుసుకుంటారు. 

పాస్‌వర్డ్ 

తల్లిదండ్రులు లేనప్పుడు లేదా వారు బిజీగా ఉన్నప్పుడు, పిల్లలు మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోతుంటారు. పిల్లలు ఇటువంటి పని చేయకుండా ఉండాలంటే మీ ఫోన్‌కు పాస్‌వర్డ్‌ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు మీరు లేనప్పుడు మీ ఫోన్‌ని ఉపయోగించలేరు.

వారితో సమయం గడపండి 

మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మీ పిల్లలకు కథలు  చెప్పండి. ప్రతిరోజూ కాసేపయినా వారితో ఆడుకోండి. మీ పిల్లలు ఫోన్ వైపు చూడకూడదనుకుంటే ఈరోజు నుంచే ఈ సలహాలను పాటించండి.

Updated Date - 2021-12-08T14:24:33+05:30 IST