పిల్లలను తీసుకుని విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-12-23T02:06:22+05:30 IST

కరోనా వైరస్.. గత రెండేళ్లుగా ప్రపంచ జనాలను గజగజ వణికిస్తోంది.

పిల్లలను తీసుకుని విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్.. గత రెండేళ్లుగా ప్రపంచ జనాలను గజగజ వణికిస్తోంది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి.. ఇప్పటికే పలు వేరియంట్లుగా మారి మనపై దాడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్లు రావడంతో కొంత ఉపశమనం లభించింది. అయితే, పెద్దలకు వ్యాక్సిన్లు వచ్చినా.. ఇప్పటికీ కొన్ని దేశాలు మినహాయిస్తే భారత్ సహా చాలా దేశాల్లో పిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఇండియా నుంచి చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు కరోనా వ్యాక్సిన్ల కోసం లక్షలు వెచ్చించి, మైళ్ల దూరం జర్నీ చేసి మరీ విదేశాలకు వెళ్తున్నారు. ఇలాగే గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్ నుంచి కొంతమంది తల్లిదండ్రులు అమెరికా, ఇజ్రాయిల్, దుబాయ్ వెళ్లి తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించారు.  


ఇటీవల అమెరికా నుంచి రాజ్దీప్ బ్రహ్మభట్ట్, సిద్ధి దంపతులు అహ్మదాబాద్‌కు తిరిగొచ్చారు. అయితే, వీరు ఏదో సరదాగా యూఎస్ ట్రిప్‌కు వెళ్లి రాలేదు. 19 రోజుల పాటు జరిగిన ఈ ట్రిప్ కేవలం వారి పిల్లలకు కరోనా టీకా కోసం చేసిందే. అవును.. మీరు విన్నది నిజమే. బ్రహ్మభట్ట్ దంపతులు తమ ఐదేళ్ల వయసు గల కవల పిల్లలు సర్వా, సత్వా కోసం ఏకంగా అమెరికా వెళ్లారు. కాకపోతే ఈ కవలలు అక్కడే జన్మించారు. దాంతో వారికి ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం వచ్చింది. ఇక అగ్రరాజ్యంలో ఇప్పటికే 5-12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ దంపతులు తమ పిల్లలకు కరోనా టీకా కోసం ఏకంగా అమెరికా వెళ్లి వచ్చారు. త్వరలో పిల్లలకు స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయని, వారికి కరోనా నుంచి రక్షణ కల్పించాలంటే ఏకైక మార్గం టీకాయేనని, అందుకే యూఎస్ వెళ్లినట్లు ఈ సందర్భంగా బ్రహ్మభట్ట్ దంపతులు చెప్పుకొచ్చారు. 


ఇదే కోవలో సూరత్‌లో వజ్రాల వ్యాపారం చేసే అభిషేక్ కూడా తన ఆరేళ్ల కుమారుడు హరిధన్‌కు కోవిడ్ టీకా కోసం ఏకంగా ఇజ్రాయిల్ వెళ్లారు. ఈ ట్రిప్ కోసం ఆయన అక్షరాల రూ.2.28లక్షల ఖర్చు చేశారు. "భారత్‌లో ప్రస్తుతం పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కానీ త్వరలోనే పిల్లలు నేరుగా తరగతులకు హాజరు కావాల్సిన పరిస్థితి. వైద్యుల సలహా మేరకు కరోనా నుంచి రక్షణ పొందాలంటే పిల్లలకు కోవిడ్ టీకా తప్పనిసరి. అందుకే మేము ఇజ్రాయిల్ వెళ్లాం." అని అభిషేక్ సతీమణి శివానీ అన్నారు. అలాగే కొంతమంది తమ పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం దుబాయ్ వెళ్తున్నట్లు సమాచారం.


చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన దేశాలకు భారత్ నుంచి పేరెంట్స్ వెళ్లి, తమ పిల్లలకు టీకా వేయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని ఈ సందర్భంగా అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(ఏహెచ్‌ఎన్ఏ) అధ్యక్షుడు డా. భరత్ గధ్వి వెల్లడించారు. అలాగే మన దగ్గర పెద్దలకు బూస్టర్ డోస్ ఇంకా రాలేదు కనుక ఇండియాలో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు విదేశాల్లో బూస్టర్ డోసు తీసుకోవచ్చని చెప్పారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు డాక్టర్ చేతన్ త్రివేది మాట్లాడుతూ.. ఓమైక్రాన్, పాఠశాలలు ప్రారంభమైన తర్వాత పిల్లలకు టీకాల విషయమై విచారణలు పెరిగాయని పేర్కొన్నారు. అందుకే పేరెంట్స్ మన దగ్గర పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు కనుక ఇలా విదేశాల బాట పడుతున్నట్లు చెప్పారు.

 

Updated Date - 2021-12-23T02:06:22+05:30 IST