ప్రాథమిక పాఠశాల విలీనంపై తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-07T04:20:14+05:30 IST

మండలంలోని తిమ్మాయపల్లె గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు అయ్యవారిపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై బుధవారం ఆ గ్రామ సర్పంచ్‌ రహంతుల్లా, విద్యాకమిటీ చైర్మన్‌ మహబూబ్‌బీబీ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ప్రాథమిక పాఠశాల విలీనంపై తల్లిదండ్రుల ఆందోళన
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

చాపాడు, జూలై 6 : మండలంలోని తిమ్మాయపల్లె  గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు అయ్యవారిపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై బుధవారం ఆ గ్రామ సర్పంచ్‌ రహంతుల్లా, విద్యాకమిటీ  చైర్మన్‌ మహబూబ్‌బీబీ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాల మధ్య  కిలో మీటరు దూరం ఉంది. తిమ్మాయపల్లెలో ఉన్న 3, 4, 5 తరగతులను హైస్కూలులో విలీనం చేయడంతో 29 మంది విద్యార్థులు హైస్కూలుకు వెళ్లాల్సి ఉంది. తిమ్మాయపల్లెలో ప్రస్తుతం 1, 2 తరగతులకు సంబందించి ఏడుగురు విద్యార్థులు మిగిలారు. హైస్కూలులో 169 మంది ఉన్నారు. మండల విద్యాశాఖాధికారి రవిశంకర్‌, ఇన్‌చార్జి తహసీల్దారు యామిని, ఆర్‌ఐ సుబ్బారావు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిరసనను విరమింపజేశారు.  తల్లిదండ్రుల కోరిక మేరకు విలీనం ప్రక్రియను ఆపేందుకు జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని ఎంఈవో  హామీ ఇచ్చారు. 

విలీనం అన్యాయం

రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో విలీనం చేయడం అన్యాయమని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి విమర్శించారు. తిమ్మాయపల్లెలోని విద్యార్థులు దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లడం కష్టంగా ఉంటుందన్నారు. విలీనంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగాను, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నారు. దీంతో బోధనకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. 


Updated Date - 2022-07-07T04:20:14+05:30 IST