Abn logo
Sep 23 2021 @ 03:38AM

పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో రగడ

  • తూర్పులో పలు స్కూళ్లలో ఉద్రిక్తత
  • విశాఖలో వేలం.. చైర్మన్‌ పదవి 1.65 లక్షలు
  • టీడీపీ-వైసీపీ వర్గీయుల దాడులు


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం పేరెంట్స్‌ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలు కొన్నిచోట్ల సాధారణ ఎన్నికలను తలపించాయి. వివాదాలు, ఘర్షణలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలను ఝళిపించారు. దీంతో పలువురు తల్లిదండ్రులు గాయపడ్డారు. మరికొన్ని చోట్ల టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్దారు. విశాఖపట్నం జిల్లాలో వేలం పాటద్వారా చైర్మన్‌ పదవులు దక్కించుకోవడం గమనార్హం. దీంతో చైర్మన్‌ పదవి రూ.లక్ష పైచిలుకు పలకడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పరిధిలోని తిరుమాలి గ్రామంలో జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల పేరెంట్స్‌ కమిటీ ఎన్నిక కోసం ఎంఈవో అబ్బాయి, హెచ్‌ఎం లక్ష్మణరావు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీ తదితర పార్టీలకు చెందినవారు భారీగా మోహరించారు. పాఠశాలకు సంబంధం లేనివారు గుంపులుగా వచ్చేందుకు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు లేకపోవడంతో జడ్పీ హైస్కూల్‌తో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పేరెంట్స్‌కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు. మరోవైపు ఈ ఎన్నికలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓటమి భయంతో టీడీపీ నేతలపై దాడి చేశారు.


రౌతులపూడి మండలం మూలగపూడిలో పాఠశాల కమిటీ ఎన్నికలో గొడవలు సృష్టించారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాటతో పాటు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త తాళ్లపరెడ్డి మాణిక్యం తలకు గాయమైంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. హైస్కుల్‌ల్లోనూ కోరమ్‌ లేదంటూ ఎన్నిక ఆపేశారు. మల్లంపేట గ్రామంలో కూడా వైసీపీ రెండు వర్గాలు కావడంతో ఓ వర్గానికి ఉపాధ్యాయులు కొమ్ముకాస్తున్నారని, కోరం ఉన్నా కావాలనే ఎన్నిక నిర్వహించలేదని మరోవర్గం ఆరోపించింది. అక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. పిఠాపురం మండలం గోకివాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యాకమిటీ ఎన్నిక వాయిదా పడింది. గ్రామంలో ఒకరు చనిపోవడంతో తల్లిదండ్రులు తక్కువ సంఖ్యలో సమావేశానికి వచ్చారు. కోరం లేదని పేర్కొంటూ ఎన్నిక వాయిదా వేయాలని సర్పంచ్‌ కీర్తి హరనాథ్‌బాబు కోరారు. ఈ సమయంలో ఇరువర్గాల మద్య వాగ్వివాదం జరిగింది. తనను దూషించారంటూ సర్పంచ్‌ పాఠశాల ముందు బైఠాయించడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.


చైర్మన్‌ పదవి 1.65లక్షలు

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం గుడ్డిప ప్రాథమికోన్నత పాఠశాలలో చైర్మన్‌ పదవికి వేలం నిర్వహించగా వైసీపీ నేత రూ.1.65 లక్షలకు దక్కించుకున్నారు. చైర్మన్‌ పదవికి రాజాన వెంకటేశ్వరావు(వైసీపీ), ఇందలి నూకరాజు(టీడీపీ) పోటీపడ్డారు. పోటాపోటీగా జరిగిన వేలంలో చివరికి వెంకటేశ్వరావు పదవిని దక్కించుకున్నారు. వేలంపాట తన దృష్టికి రాలేదని హెచ్‌ఎం లక్ష్మణరావు తెలిపారు. కోటవురట్ల మండలం పందూరు యూపీ పాఠశాలలో కూడా చైర్మన్‌ పదవికి వేలం నిర్వహించారు. బత్తుల సురేశ్‌ అనే యువకుడు రూ.1.9లక్షలకు పదవి దక్కించుకున్నాడు.  ్జకాగా, రాష్ట్రంలోని 95ు ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలు ముగిసినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. 46,609 స్కూళ్లకుగాను 44,237 పాఠశాలల్లో(94.91ు) ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు.  స్కూళ్ల అభివృద్ధిలో కమిటీలు భాగం కావాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...