తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులే.. పరీక్షలకు ప్రిపేర్ అవమని సిటీకి పంపిస్తే ఈ యువతి చేసిన పాడు పని ఇది..!

ABN , First Publish Date - 2021-07-25T21:59:38+05:30 IST

తమ బిడ్డ కలెక్టర్ అవ్వాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి కోరిక కూడా బలంగా ఉంటుంది.

తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులే.. పరీక్షలకు ప్రిపేర్ అవమని సిటీకి పంపిస్తే ఈ యువతి చేసిన పాడు పని ఇది..!

ఇంటర్నెట్ డెస్క్: తమ బిడ్డ కలెక్టర్ అవ్వాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి కోరిక కూడా బలంగా ఉంటుంది. బిడ్డ కలెక్టర్ అవ్వడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వాళ్లు వెనుకాడరు. అలాంటి తల్లిదండ్రులను మోసం చేసిందా కూతురు. జార్ఖండ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన గురించి తెలిసిన వాళ్లందరూ నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాంచీలోని ఒక ఇంట్లో మోనికా అనే అమ్మాయి అద్దెకు దిగింది. నిరుటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె వద్ద సర్టిఫికెట్ ఉంది. అలాగే జంషెడ్‌పూర్‌లో డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ వచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్ కూడా ఉంది. కానీ రాంచీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసించడం మొదలు పెట్టింది.


కొన్నిరోజులు ఆమెను గమనించిన ఇంటి యజమాని.. ఉద్యోగానికి ఎప్పుడు వెళ్లావ్? అని అడిగాడు. అప్పుడు తాను సెలవులో ఉన్నట్లు మోనిక చెప్పింది. అయితే ఆమె ఎప్పుడూ ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాడు. పోలీసులు మోనిక గురించి తెలుసుకొని రెండ్రోజులు ఆమెపై నిఘా పెట్టారు. ఆమె చాలా మందికి తాను డిప్యూటీ కలెక్టర్ అనే విధంగా పత్రాలు చూపించినట్లు వారు గుర్తించారు. అలాగే ఢిల్లీలోని జార్ఖండ్ భవన్‌లో రూమ్ బుక్ చేసుకోడం కోసం చీఫ్ సెక్రటరీకి రాసిన లెటర్ కూడా పోలీసులకు దొరికింది. ఆమె వద్ద నకిలీ ప్రభుత్వ లోగోలు, డిప్యూటీ కలెక్టర్ నోట్‌ప్యాడ్ కూడా ఉంది. ఆమెను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు కూడా ఆమె తాను డిప్యూటీ కలెక్టర్ అని చెప్పి బెదిరించడానికి ప్రయత్నించింది. కానీ చివరకు తన మోసాన్ని అంగీకరించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనని ఆమె చెప్పింది. తండ్రి ఒక స్కూల్లో హెడ్‌మాస్టర్ అని, తల్లి కూడా ప్రభుత్వ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తోందని మోనిక వెల్లడించింది. వారిద్దరూ తనను ఐఏఎస్‌ చదవడానికి పంపారని, కానీ తాను యూపీఎస్పీ పరీక్ష ఫెయిలయన్యానని చెప్పిన ఆమె.. తల్లిదండ్రులను, బంధువులను నమ్మించడం కోసమే ఇలా నాటకం ఆడినట్లు ఒప్పుకుంది. ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T21:59:38+05:30 IST