కూతురిని బలవంతంగా పుట్టింటికి తీసుకెళ్లి అబార్షన్ చేయించిన తల్లిదండ్రులు.. ఆ యువకుడికి అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2022-04-10T08:50:57+05:30 IST

వారిద్దరూ మైనర్లుగా ఉన్నప్పుడే వివాహం జరిగింది. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భర్త ఇంటికి పంపలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ఇద్దరూ మేజర్లు అయ్యాక.. ఆ యువకుడు తన భార్యను తనతో తీసుకెళ్లేందుకు రాగా.. అమ్మాయి తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు...

కూతురిని బలవంతంగా పుట్టింటికి తీసుకెళ్లి అబార్షన్ చేయించిన తల్లిదండ్రులు.. ఆ యువకుడికి అసలు నిజం తెలిసి..

వారిద్దరూ మైనర్లుగా ఉన్నప్పుడే వివాహం జరిగింది. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భర్త ఇంటికి పంపలేదు. కొన్ని  సంవత్సరాల తరువాత ఇద్దరూ మేజర్లు అయ్యాక.. ఆ యువకుడు తన భార్యను తనతో తీసుకెళ్లేందుకు రాగా.. అమ్మాయి తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. దీంతో ఆ యువకుడు తన భార్య అంగీకారంతో ఆమెను ఇంటి నుంచి దొంగచాటుగా తీసుకుపోయాడు. ఆ తరువాత ఆమె గర్భం దాల్చింది.  ఆ తరువాత యువతి తల్లిదండ్రులు మంచిగా నటిస్తూ ఆమెను తిరిగి తీసుకెళ్లి ఆమెకు అబార్షన్ చేశారు. ఈ విషయం తెలిసిన యువకుడు ఏం చేశాడంటే..


రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోర్ నగరంలో నివసించే రామ్ నివాస్(22)  అనే యువకుడికి నాలుగేళ్ల క్రితం గుడ్డీ(21) అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగే సమయానికి ఇద్దరూ మైనర్లు కావడంతో గుడ్డీ తల్లిదండ్రులు ఆమెను అత్తారింటికి పంపించలేదు. నిజానికి వారిద్దరి పెళ్లి కుండ మార్పిడి పద్ధతిలో జరిగింది. రామ్ నివాస్ సోదరి సుశీల వివాహం గుడ్డీ సోదరుడితో(అన్న)  జరిగింది. పెళ్లి జరిగిన వెంటనే రామ్ నివాస్ సోదరి సుశీలను అత్తారింటికి పంపంచారు.


నాలుగు సంవత్సరాల తరువాత రామ్ నివాస్, గుడ్డీలు మేజర్లు అయ్యారు. దీంతో రామ్ నివాస్ తన భార్యను తనతో పంపవలసిందిగా గుడ్డీ తల్లిదండ్రులను కోరాడు. కానీ అందుకు వారు అంగీకరించలేదు. అసలు వారిద్దరికీ జరిగిన పెళ్లి చెల్లదని చెప్పారు. ఇది విని రామ్ నివాస్ తనను గుడ్డీ తల్లిదండ్రులు మోసం చేశారని గ్రహించాడు. కానీ రామ్ నివాస్‌ని గుడ్డీ తన భర్తగా భావించింది. అందుకే భర్త కోసం అతనితో ఇంటి నుంచి పారిపోయింది. 


ఆ తరువాత ఇద్దరూ కలిసి ఒక గుడిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రామ్ నివాస్, గుడ్డీ పెద్దలకు దూరంగా కాపురం పెట్టారు. కొన్ని రోజుల తరువాత గుడ్డీకి గర్భవతి అయింది. ఇది తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడడానికి వచ్చారు. కొన్ని రోజులు తమ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని ఆమెతో అన్నారు. అందుకు రామ్ నివాస్ కూడా అంగీకరించాడు. కానీ గుడ్డీని తీసుకెళ్లి ఆమె తల్లిదండ్రులు బలవంతంగా అబార్షన్ చేయించారు. ఇది తెలిసిన రామ్ నివాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన అత్త మామలపై ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల ఏమీ చేయడం లేదని భావించి.. తన భార్య లేకుండా జీవించలేనని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు.


రామ్ నివాస్ మరణానికి గుడ్డీ తల్లిదండ్రులే కారణమని అతని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రామ్ నివాస్ ఆత్మ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-10T08:50:57+05:30 IST