అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో!

ABN , First Publish Date - 2022-05-16T05:39:38+05:30 IST

మండలంలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో!
గొల్లగుంట గ్రామంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న అంగన్‌వాడీ భవనం

- టీడీపీ హయాంలో అన్ని పంచాయతీల్లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు ప్రారంభం

- దాదాపు 70 శాతం పనులు పూర్తి

- ప్రభుత్వం మారడంతో బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌

- పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు


కొత్త భవనాల సంగతి దేవుడెరుగు.. చివరి దశకు చేరిన నిర్మాణాలను కూడా పూర్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. దీనికి నిదర్శనమే పరవాడ మండలంలోని అసంపూర్తి అంగన్‌వాడీ భవనాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ భవనాల నిర్మాణాలు 70 శాతం పూర్తయినా తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం నిరుపయోగమవుతుందే అని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పరవాడ, మే 15: మండలంలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో ఒక్కో భవనానికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించారు. ఉపాధి హామీ పథకం, ఐసీడీఎస్‌, ఎస్‌డీపీ, గ్రామ పంచాయతీ మ్యాచింగ్‌ గ్రాంట్‌తో వీటి నిర్మాణ పనులకు 2018లో అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించడంతో పనులు చురుగ్గా సాగాయి. మండలంలోని నక్కవానిపాలెం, పెదముషిడివాడ, పచ్చికోరువానిపాలెం, మామిడివానిపాలెం, బాపడుపాలెం, వెంకటాపురం, గొల్లలపాలెం, గొర్లివానిపాలెం, గొల్లగుంట, రావాడ, రేఖవానిపాలెం, సోమునాయుడుపాలెం, మోటూరివానిపాలెం, పొలిరెడ్డిపాలెం, విసన్నపేట, పాతరాజానపాలెం, తిక్కవానిపాలెం, కొరంగివానిపాలెం గ్రామాల్లో భవనాలు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్కో భవనానికి ఉపాధి హామీ పథకం కింద 4.5 లక్షల బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడం జరిగిపోయాయి. అంతే ఆ తరువాత నుంచి బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. బిల్లులు చెల్లించాకే పనులు చేపడతామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. కాగా రావాడ పంచాయతీ పరిధి రేఖవానిపాలెం, గొల్లగుంటలో అంగన్‌వాడీ భవనాలకు ఒక్క పైసా కూడా బిల్లు చెల్లింపులు జరగలేదు. సాంకేతిక సమస్య కారణంగానే బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. గొర్లివానిపాలెం అంగన్‌వాడీ భవనానికి రూ.2 లక్షలు, సోమునాయుడు అంగన్‌వాడీ భవనానికి రూ.5 లక్షల చొప్పున ఇటీవల జడ్పీటీసీ నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే వీటి పనులు ప్రారంభిస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. అయితే చాలా చోట్ల అసంపూర్తి భవనాల చుట్టూ ముళ్ల పొదలు పెరిగి భయంకరంగా తయారయ్యాయి. ఈ భవనాలు అసంపూర్తిగా ఉండడంతో ప్రైవేటు భవనాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నారు. దీని వల్ల  చిన్నారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


త్వరలోనే నిర్మాణాలను పూర్తి చేస్తాం

అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు ఉపాధి నిధుల నుంచి మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. సామగ్రి ధరలు పెరిగిపోవడంతో అంచనా విలువ ఎక్కువైంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్‌ పీడీకి తెలియజేశాం. మరో రూ.7.5 లక్షలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాం. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(ఎస్‌డీపీ) నిధుల నుంచి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఐసీడీఎస్‌ నుంచి నిధులు మంజూరైతే భవన నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తాం.

- గండి రామారావు, మండల ఇంజనీర్‌




Updated Date - 2022-05-16T05:39:38+05:30 IST