Abn logo
Sep 5 2021 @ 02:54AM

మెడల్స్‌ మేళా

షట్లర్‌ ప్రమోద్‌, షూటర్‌ మనీశ్‌కు స్వర్ణాలు

సింగ్‌రాజ్‌కు రజతం, మనోజ్‌కు కాంస్యం

బ్యాడ్మింటన్‌లో మరో రెండు ఖాయం

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల సూపర్‌ షో


పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల సూపర్‌ షో కొనసాగింది.. షట్లర్లు, షూటర్లు దుమ్మురేపారు.. మనీశ్‌ నర్వాల్‌ పిస్టల్‌ నుంచి వెలువడిన బుల్లెట్‌ ఏకంగా విశ్వక్రీడల రికార్డుతో పసిడి పతకానికి తగిలింది.. నర్వాల్‌తో నువ్వా, నేనా అనేలా తలపడిన మరో భారత షూటర్‌ సింగ్‌రాజ్‌ అదానా రజతంతో మెరిశాడు.. ఇక మన ఆటగాళ్ల రాకెట్‌ నుంచి దూసుకొస్తున్న షటిల్‌ పతకాలను కొల్లగొడుతోంది..‘ఎ్‌సఎల్‌-3’ టాప్‌సీడ్‌ ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించాడు.. ఇదే విభాగంలో మనోజ్‌ సర్కార్‌ కాంస్యంతో మురిపించాడు.. బ్యాడ్మింటన్‌లో మరో రెండు రజతాలు ఖరారవగా, పోటీలకు చివరి రోజైన నేడు ఇంకో రెండు కాంస్య పతకాలు లభించే అవకాశాలున్నాయి.


టోక్యో: మరోరోజులో పారాలింపిక్స్‌ ముగుస్తుండగా భారత అథ్లెట్లు మరింత జోరు ప్రదర్శిస్తున్నారు. 12వ రోజు రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్యాలతో పతక మేళాను తలపించారు. షట్లర్లు, షూటర్ల హవాతో మొత్తం నాలుగు పతకాలు శనివారం భారత్‌ ఖాతాలో చేరాయి. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ పురుషుల సింగిల్స్‌లో చారిత్రక పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఎస్‌ఎల్‌-3 విభాగం ఫైనల్లో వరల్డ్‌ నెం.1 భగత్‌ 21-14, 21-17తో రెండోసీడ్‌ డానిల్‌ బెతెల్‌ (బ్రిటన్‌)పై విజయంతో చాంపియన్‌గా నిలిచాడు. దీంతో పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా భువనేశ్వర్‌కు చెందిన 33 ఏళ్ల ప్రమోద్‌ భగత్‌ చరిత్ర సృష్టించాడు. సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన భగత్‌ మిక్స్‌డ్‌లోనూ పతకం దిశగా దూసుకెళ్లాడు. ఎస్‌ఎల్‌-3 ఎస్‌యూ-5 మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పాలక్‌ కోహ్లీతో కలిసి కాంస్య పతకం కోసం అమీతుమీ తేల్చుకోనున్నాడు. జపాన్‌ ద్వయం ఫ్యుజీహారా/సుగీనోతో ఈ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. సెమీ్‌సలో భగత్‌/కోహ్లీ జంట 3-21, 15-21తో ఇండోనేసియా ద్వయం హ్యరీ సుశాంతో/లియాన్‌ రాట్రి చేతిలో ఓడి కాంస్యపోరులో నిలిచింది. 


మనీశ్‌.. రికార్డు పసిడి

షూటింగ్‌లో మనోళ్ల గురి అదురుతోంది. దాంతో మరో రెండు పతకాలు దక్కాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌కు చెందిన మనీశ్‌ నర్వాల్‌, సింగ్‌రాజ్‌ అదానా పీ-4 మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో స్వర్ణ, రజతాలతో సంచలన ప్రదర్శన చేశారు. 19 ఏళ్ల నర్వాల్‌ 218.2 పాయింట్లతో కొత్త పారాలింపిక్స్‌ రికార్డుతో పసిడి పతకం దక్కించుకున్నాడు. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు కూడా మనీశ్‌ పేరిటే ఉండడం విశేషం. 39 ఏళ్ల అదానా 216.7 పాయింట్లతో రజతం చేజిక్కించుకున్నాడు. రష్యా షూటర్‌ సెర్గీ మలిషేవ్‌ (196.8) కాంస్యం అందుకున్నాడు. ఇద్దరు భారత షూటర్ల మధ్య ఫైనల్‌ షూటాఫ్‌ హోరాహోరీగా సాగింది. దాంతో కోచ్‌.. ఒక్క షూట్‌, ఒక్క షూట్‌ అంటూ మనీశ్‌, అదానాను ప్రోత్సహించాడు. తొలిసారి పారాలింపిక్స్‌ బరిలో దిగిన అదానాకు ఈ క్రీడల్లో ఇది రెండో పతకం కావడం విశేషం. మంగళవారం..అతడు పీ-1 పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌-1లో కాంస్యం గెలుపొందిన సంగతి తెలిసిందే. రెండు మెడల్స్‌తో ఒకే పారాలింపిక్స్‌లో ఒకటికి మించి పతకాలు సాధించిన అరుదైన అథ్లెట్ల జాబితాలో అదానా చోటు సంపాదించాడు. ఈ విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్‌ ఆకాశ్‌ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయాడు. ఇక, అథ్లెటిక్స్‌ పురుషుల జావెలిన్‌ ఎఫ్‌-41 ఫైనల్లో నవ్‌దీప్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

కలెక్టర్‌కు పతకం ఖాయం

నోయిడా జిల్లా కలెక్టర్‌ సుహాస్‌ యతిరాజ్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-4లో, కృష్ణ నాగర్‌ ఎస్‌హెచ్‌-6లో ఫైనల్‌కు చేరడంతో మరో రెండు పతకాలు భారత్‌ ఖాతాలో చేరనున్నాయి. అలాగే తరుణ్‌ థిల్లాన్‌ కాంస్య రేసులో నిలవడంతో మరో మెడల్‌ కూడా లభించే చాన్సుంది. ఎస్‌ఎల్‌-4లో సుహాస్‌ 21-19, 21-15తో ఫ్రెడీ సెటియవాన్‌ (ఇండోనేసియా)ను చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించాడు. టోక్యో క్రీడలకు ఆఖరి రోజైన ఆదివారం జరిగే స్వర్ణ సమరంలో 38 ఏళ్ల యతిరాజ్‌.. టాప్‌సీడ్‌ లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌)ను ఢీకొంటాడు. ఇక ఎస్‌హెచ్‌-6 విభాగం సెమీ్‌సలో రెండోసీడ్‌ కృష్ణ నాగర్‌ 21-10, 21-11తో క్రిస్టెన్‌ కూంబ్స్‌ (బ్రిటన్‌)పై గెలుపొందాడు. అతడు టైటిల్‌ పోరులో చు మన్‌ కీ (హాంకాంగ్‌)తో తలపడతాడు. పురుషుల ఎస్‌ఎల్‌-4 సింగిల్స్‌ సెమీఫైనల్లో తరుణ్‌ 16-21, 21-16, 16-21తో లుకాస్‌ మజూర్‌ చేతిలో ఓడిపోయాడు. ఆదివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెటియవాన్‌ను ఎదుర్కొంటాడు. 

కాంస్య మనోజుడు

బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 కేటగిరి కాంస్య పతక మ్యాచ్‌లో 31ఏళ్ల మనోజ్‌ సర్కార్‌ 22-20, 21-13తో దైసుకె ఫ్యుజీహారా (జపాన్‌)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీస్‌లో సర్కార్‌ 8-21, 10-21తో బెతెల్‌ చేతిలో ఓడాడు. అయితే ఈ ఓటమినుంచి వెంటనే కోలుకున్న ఉత్తరాఖండ్‌ షట్లర్‌ సర్కార్‌ కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడి గెలుపొందాడు. 

నేడే ముగింపు వేడుక.. భారత పతాకధారిగా అవని

టోక్యో పారాలింపిక్స్‌కు నేటితో తెరపడనుంది. ఆదివారమే పోటీలకు ఆఖరిరోజు. రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల షూటర్‌ అవని లేఖార ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. గతనెల 24న జరిగిన ఈ క్రీడల ఆరంభ వేడుకల మార్చ్‌పా్‌స్టలో షాట్‌పుటర్‌ టెక్‌చంద్‌ భారత బృందాన్ని ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. 

టోక్యోలో భారత్‌ నేటి షెడ్యూల్‌ 

(దూరదర్శన్‌లో)

షూటింగ్‌ (ఉ. 6 నుంచి): ఆర్‌6 మిక్స్‌డ్‌ 50 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌-సిద్దార్థ్‌ బాబు, దీపక్‌, అవని లేఖార; బ్యాడ్మింటన్‌ (ఉ. 6.15 నుంచి): పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 ఫైనల్‌- సుహాస్‌ యతిరాజ్‌, పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 కాంస్య పోరు- తరుణ్‌ థిల్లాన్‌, పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6 ఫైనల్‌- కృష్ణ నాగర్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌3 కాంస్య పోరు- ప్రమోద్‌ /పాలక్‌ కోహ్లీ.