వైకల్యాన్ని సవాల్ చేస్తూ..

ABN , First Publish Date - 2021-08-24T09:00:55+05:30 IST

జపాన్‌ రాజధాని టోక్యోలో మరోసారి భారీ క్రీడా సందడి నెలకొనబోతోంది.

వైకల్యాన్ని సవాల్ చేస్తూ..

ప్రారంభ వేడుకలు సాయంత్రం 4.30 నుంచి దూరదర్శన్‌లో..

సత్తా నిరూపించుకునేందుకు అథ్లెట్లు సిద్ధం

భారత్‌ నుంచి 54 మంది బరిలోకి..

వారంతా విధి వంచితులే. ప్రమాదంలోనో..  పుట్టుకతోనో చేతులు, కాళ్లు కోల్పోయిన వారే. అయినా తగ్గేదేలే అంటూ పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు. అంతులేని ఆత్మవిశ్వాసంతో.. ఆకాశాన్నైనా అందుకోగలమనే మనోబలంతో.. అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు.. విశ్వ క్రీడా వేదికపై వెలుగులు విరజిమ్మేందుకు వస్తున్నారు. శరీరంలో ఓ అవయవాన్ని కోల్పోయినంత మాత్రాన.. అంతా ముగిసిపోయిందనే ఆలోచన రానీయకుండా.. క్రీడారంగంలో తమ దేశాలను గర్వపడేలా చేసేందుకు సిద్ధమయ్యారు. కఠోర శ్రమతో తమ వైకల్యాన్ని అధిగమిస్తూ, ఇతరులకన్నా తామేమీ తక్కువ కాదని నిరూపించేందుకు సై అంటున్నారు. నేటి నుంచి జరిగే పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న ఈ అసలైన హీరోలకు జై కొట్టాల్సిందే!


టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యోలో మరోసారి భారీ క్రీడా సందడి నెలకొనబోతోంది. ఇటీవలే ఒలింపిక్స్‌ ముగియగా.. ఈసారి పారాలింపిక్స్‌కు నగరం వేదిక కానుంది. కట్టుదిట్టమైన కరోనా నిబంధనల మధ్య.. పోటీల్లో తీవ్రత ఏమాత్రం తగ్గకుండా క్రీడా ప్రపంచాన్ని అబ్బురపరిచేందుకు దివ్యాంగ అథ్లెట్లు ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 5వ తేదీ వరకు జరిగే పారాలింపిక్స్‌లో 22 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు 163 దేశాల నుంచి 4,400 మంది అథ్లెట్లు టోక్యో తరలివచ్చారు. తైక్వాండో, బ్యాడ్మింటన్‌కు కొత్తగా చోటు కల్పించారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా ఏడు పతకాలు లభించగా... అదే ప్రేరణతో పారా అథ్లెట్లు కూడా ఈ గేమ్స్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఇదివరకెన్నడూ లేని రీతిలో భారత్‌ 54 మందితో బరిలోకి దిగబోతోంది. 2016 రియో గేమ్స్‌లో భారత్‌కు 2 స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం సహా నాలుగు పతకాలు వచ్చాయి. 1972 గేమ్స్‌ నుంచి ఇప్పటివరకు మొత్తంగా 12 పతకాలు సాధించింది. ఇందులో షాట్‌ పుటర్‌ దీపా మాలిక్‌ ఏకైక మహిళ కావడం విశేషం.


టాప్‌-25లో నిలవాలని..

భారత పారా అథ్లెట్లపై ఈసారి అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తం తొమ్మిది విభాగాల్లో పోటీపడుతుండగా.. వీటిలో 5 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలను ఆశిస్తున్నట్టు భారత చెఫ్‌ డి మిషన్‌ గుర్‌శరణ్‌ సింగ్‌ తెలిపాడు. ఒక్క అథ్లెటిక్స్‌లోనే పది మెడల్స్‌ రాగలవని ఆశిస్తున్నారు. తద్వారా  పతకాల పట్టికలో టాప్‌-25లో ఉండాలని చూస్తోంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ పోటీల్లో దేశ అథ్లెట్లు సత్తా నిరూపించుకున్నారు. అలాగే ఆయా సాయ్‌ కేంద్రాల్లో వీరంతా తమ కఠిన ప్రాక్టీస్‌ను కొనసాగించారు. 


పెరిగిన అంచనాలు.. 

టోక్యోలో తలపడుతున్న భారత పారా అథ్లెట్లలో నలుగురు వరల్డ్‌నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా.. ఆరుగురు నెంబర్‌ టు.. మరో పది మంది తమ విభాగాల్లో నెంబర్‌ త్రీగా ఉండడం విశేషం. అందుకే ఈసారి పతక అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా 40వ పడిలో ఉన్న జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర జఝారియా హ్యాట్రిక్‌ స్వర్ణం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎఫ్‌-46లో వరల్డ్‌ రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. ఎఫ్‌-64 జావెలిన్‌ త్రోలో వరల్డ్‌ నెంబర్‌వన్‌, వరల్డ్‌ రికార్డు కలిగిన  సందీప్‌ చౌధరి, సుమీత్‌ అంటిల్‌ కూడా స్వర్ణంపై ఆశలు రేకెత్తిస్తున్నారు. 


మన పతక ఆశలు వీరిపైనే..

పారాలింపిక్స్‌లో భారత్‌ ఈసారి భారీ బృందంతో బరిలో దిగుతోంది. దీంతో అత్యధిక పతకాలతో రికార్డు సృష్టించాలని మన క్రీడాకారులు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోక్యోలో మెడల్‌ అవకాశాలున్న అథ్లెట్లెవరో చూద్దాం..


అఫ్ఘాన్లకు సంఘీభావంగా...

అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు వశపరుచుకోవడంతో దురదృష్టవశాత్తు అక్కడి ఇద్దరు అథ్లెట్లు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారికి సంఘీభావంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని మంగళవారం జరిగే ప్రారంభ వేడుకల్లో ప్రదర్శించబోతున్నారు. ‘ఇతర దేశాల మాదిరే అఫ్ఘాన్‌ పతాకాన్ని కూడా స్టేడియంలోకి తీసుకురావాలని నిర్ణయించాం. శరణార్థుల ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి హైకమిషనర్‌ ఆ దేశ పతకాధారిగా వ్యవహరిస్తారు’ అని అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ చీఫ్‌ ఆండ్రూ పార్సన్స్‌ తెలిపాడు.


దేవేంద్ర జఝారియా (అథ్లెటిక్స్‌): ప్రపంచ ర్యాంక్‌ 9

సాధించిన పతకాలు: ఏథెన్స్‌ (2004), రియో (2016) పారాలింపిక్స్‌  జావెలిన్‌ త్రోలో వరల్డ్‌ రికార్డుతో స్వర్ణాలు. 

అవార్డులు: పద్మశ్రీ, ఖేల్‌రత్న, అర్జున.

మరియప్పన్‌ (అథ్లెటిక్స్‌): ప్రపంచ ర్యాంక్‌ 5

సాధించిన పతకాలు: రియో పారాలింపిక్స్‌ పురుషుల టీ42 హైజంప్‌లో స్వర్ణం. 2019 పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో టీ42లో కాంస్యం. అవార్డులు: పద్మశ్రీ, అర్జున, ఖేల్‌రత్న.

సుహాస్‌ (బ్యాడ్మింటన్‌): ప్రపంచ ర్యాంక్‌ 3

సాధించిన పతకాలు: ఐఏఎస్‌ అధికారి అయిన సుహాస్‌ నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. 2018 ఏషియన్‌ పారా గేమ్స్‌లో టీమ్‌ స్టాండింగ్‌ ఎస్‌ఎల్‌ 3-ఎస్‌యూఎస్‌లో కాంస్య పతకం నెగ్గారు. 2016 ఏషియన్‌ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నారు.

ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌): ప్రపంచ ర్యాంక్‌1

సాధించిన పతకాలు: బాసెల్‌లో 2019లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌లో రెండు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. 2018 పారా గేమ్స్‌ పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌లో పసిడి, కాంస్య పతకాలు సాధించాడు. 2017లో దక్షిణకొరియాలో జరిగిన వరల్డ్‌ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌, 2014 ఏషియన్‌ పారా గేమ్స్‌లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు.

అరుణా తన్వర్‌ (తైక్వాండో): ప్రపంచ ర్యాంక్‌ 4

సాధించిన పతకాలు: 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం. 2018 ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో రజతం.

పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి భారత తైక్వాండో ప్లేయర్‌ అరుణ. 21 ఏళ్ల ఈమె మహిళల 49 కిలోల విభాగంలో కే-43 కేటగిరిలో పోటీపడుతోంది.

రాహుల్‌ జఖర్‌ (షూటింగ్‌): ప్రపంచ ర్యాంక్‌ 2

సాధించిన పతకాలు: 2021 పెరూ వరల్డ్‌ కప్‌ పీ3-మిక్స్‌డ్‌ 25 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1లో స్వర్ణం. 2019 షూటింగ్‌ వరల్డ్‌ కప్‌ పీ1-10 ఎయిర్‌పిస్టల్‌ పురుషుల ఎస్‌హెచ్‌-1లో ప్రపంచ రికార్డుతో బంగారు పతకం.


రూబిన్‌ ఫ్రాన్సిస్‌ (షూటింగ్‌) ప్రపంచ ర్యాంక్‌ 5

సాధించిన పతకాలు: పారాలింపిక్స్‌లో ప్రాతిని ధ్యం వహిస్తున్న భారత తొలి మహిళా పిస్టల్‌ షూటర్‌ రూబిన్‌. 2021 వరల్డ్‌ కప్‌ పీ2 విభాగంలో ప్రపంచ రికార్డుతో స్వర్ణం. 2019 వరల్డ్‌ కప్‌లో పీ2లో కాంస్యం. వీరితో పాటు ఆర్చరీ, కనోయింగ్‌, స్విమ్మింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండోలాంటి అంశాల్లోనూ భారత అథ్లెట్లపై అంచనాలున్నాయి.

Updated Date - 2021-08-24T09:00:55+05:30 IST