శ్రీవారి ఆలయం నుంచి వెలుపలకు ‘పరకామణి’

ABN , First Publish Date - 2020-08-14T14:33:31+05:30 IST

ఎన్నో ఏళ్లుగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న పరకామణి (హుండీ లెక్కింపు) త్వరలో..

శ్రీవారి ఆలయం నుంచి వెలుపలకు ‘పరకామణి’

రూ.8.9 కోట్లతో నూతన భవనానికి నేడు శంకుస్థాపన


తిరుమల(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న పరకామణి (హుండీ లెక్కింపు) త్వరలో వెలుపలకు రానుంది. ఏ రోజు కానుకలను ఆరోజే పూర్తి చేయాలనే క్రమంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ముడుపులు, విదేశీ కరెన్సీ, వివిధ రకాల పత్రాలను ఆలయంలోని హుండీలో సమర్పిస్తారు. నిండిన హుండీలను మరోప్రదేశానికి తరలించి వేరు చేసి లెక్కించే స్థలాన్నే పరకామణి అంటారు.


ఇలా రోజుకు 10 నుంచి 12 గంగాళాల కానుకలు అందుతాయి. గ్రహణం రోజు మినహా మిగిలిన అన్నిరోజుల్లో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపులు జరుగుతాయి. వివిధ బ్యాంకుల ఉద్యోగులు, టీటీడీ సిబ్బందితో పాటు పరకామణి సేవ కింద ప్రభుత్వ రంగాలకు చెందిన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు. 200 నుంచి 250 మంది ఉదయం, మధ్యాహ్నం ఏ, బీ బ్యాచ్‌లుగా కానుకలు లెక్కిస్తారు. ప్రస్తుతం ఆలయంలోని పరకామణిలో స్థలం తక్కువ కావడంతో హుండీ లెక్కింపు వేగంగా సాగడంలేదు. వెలుతురు సమస్య, దుమ్ము దూళి అధికంగా ఉండటంతో సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు.


పరకామణి సేవకు సిబ్బంది బయోమెట్రిక్‌ నుంచి ఆలయంలోకి క్యూలైను నుంచే వెళ్లాల్సి రావడంతో దర్శనానికి వెళ్లే భక్తులకు సమస్యగా మారుతోందని టీటీడీ చెబుతోంది. మరోవైపు హుండీ ద్వారా చిల్లరనాణేలు, నోట్లతో పాటు కలకండ, బెల్లం, భక్తులు ముడుపడి సమర్పించే తలనీలాల ద్వారా కీటకాలు, ఎలుకలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పరకామణి సిబ్బంది దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు వంటివి లేవు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆలయం వెలుపలకు పరకామణిని తీసుకురావాలని నిర్ణయించారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనేభక్తుడు పరకామణి భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు.


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదుట ఖాళీ స్థలంలో రూ.8.9 కోట్లతో నిర్మించే ఈ భవనానికి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు టీటీడీ చైర్మన్‌, ఉన్నతాధికారులు శంకుస్థాపన చేయనున్నారు. హుండీ లెక్కింపును భక్తులు వీక్షించేలా బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌లతో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన గదులు అందుబాటులోకి వస్తే అవసరమైన సిబ్బందిని నియమించుకుని ఏరోజు కానుకలు ఆరోజే పూర్తిగా లెక్కించనున్నారు. 


Updated Date - 2020-08-14T14:33:31+05:30 IST