‘పురం’లో పరాయి పెత్తనం

ABN , First Publish Date - 2022-09-23T10:58:52+05:30 IST

‘పురం’లో పరాయి పెత్తనం

‘పురం’లో పరాయి పెత్తనం

మున్సిపల్‌ శాఖలోకి వలస అధికారులు.. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై రాక

40 మందికి పైగా కమిషనర్‌ కొలువులు

అవగాహన లేకపోవడంతో వ్యవస్థ అస్తవ్యస్తం 

అక్రమార్జన కోసమే వచ్చారని విమర్శలు

సర్వీస్‌ రూల్స్‌ పాటించకుండా నియామకాలు

ఆ శాఖ సీనియర్ల కంటే పై స్థాయిలోకి 

పదోన్నతులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మున్సిపల్‌ శాఖలోకి ‘వలసలు’ జోరు మీదున్నాయి. ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి కీలక పోస్టుల్లో బాధ్యతలు చేపడుతున్నారు.  40 మందికి పైగా అధికారులు మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టుల్లో నియమితులయ్యారు. వీరిలో ఎక్కువమంది పంచాయతీ రాజ్‌, సహకార, సంక్షేమ శాఖల అధికారులతో పాటు సచివాలయ సెక్షన్‌ ఆఫీసర్లు ఉన్నారు. రాజకీయ పైరవీలు చేసుకుని మరీ ఇంతమంది మున్సిపల్‌ శాఖలోకి రావడానికి కారణం ఏంటంటే... అక్రమార్జన కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడేందుకు శాఖలోకి వస్తున్నారని చెబుతున్నారు. వలస అధికారులతో మున్సిపల్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల నుంచి వచ్చిన చిన్న కేడర్‌ అధికారులు సైతం సీనియర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కేడర్‌ అధికారులపై పెత్తనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాయతీగా పనిచేయాలనుకుంటే తమ శాఖల్లోనే ఉండొచ్చని, అక్రమ సంపాదన కోసమే శాఖలోకి వస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేగాక మున్సిపల్‌ శాఖలో పదోన్నతులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 


అవగాహనాలేమితో సమస్యలు  

ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులకు మున్సిపల్‌ మాన్యువల్‌పై పూర్తిగా అవగాహన ఉండకపోవడంతో పలు సమస్యలు వస్తున్నాయి. పనులు/సరఫరా టెండర్ల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. పరిపాలనా మంజూరు లేకుండా, సంబంధిత అధికారుల ఆమోదం లేకుండా పనులను విభజిస్తున్నారు. దీంతో ఆడిట్‌ అభ్యంతరాలకు కారణమవుతున్నారు. ఆర్థిక నిర్వహణపై అవగాహన లేకపోవడంతో మున్సిపల్‌ నిధులు వృథా అవుతున్నాయి. పన్నులను సరిగా వసూలు చేయలేకపోతున్నారు. ఆదాయం గడించే విషయంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ఇతర  విదేశీ సంస్థల నుంచి వస్తున్న నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో తదుపరి గ్రాంట్లు పొందలేని దుస్థితి. టౌన్‌ ప్లానింగ్‌ కార్యక్రమాల్లో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో అనధికార లేఅవుట్లు, అనధికార నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్నారు. పలు మున్సిపల్‌ సేవలు సకాలంలో అందించడం లేదని, కౌన్సిల్‌ను నిర్వహించడంలో విఫలమవుతున్నారని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. 


అర్హత లేకున్నా అందలం 

ఇతర శాఖల అధికారులు డిప్యూటేషన్‌పై రావడం వల్ల మున్సిపల్‌ శాఖలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం లేదు. అలాగే ఖాళీలు లేకుండా పోతున్నాయి. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి శాఖ పదోన్నతి కమిటీ సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.  ఇటీవలి 74వ సవరణ ఆడిట్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 123 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టుల్లో.. 48 మంది నాన్‌ కేడర్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్‌ కమిషనర్లుగా ఉన్నారు. వారిలో డీఈఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రాజెక్టు డైరెక్టర్లు, మేనేజర్లు, రెవెన్యూ అధికారులు, సూపరింటెండెంట్‌ ఆఫీసర్లు వంటి వారు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఇతర శాఖల అధికారులే. మున్సిపల్‌ శాఖలో పనిచేసే అర్హత లేని జూనియర్‌ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. 


సర్వీస్‌ రూల్స్‌కు తిలోదకాలు 

మున్సిపల్‌ శాఖలో వివిధ కేటగిరి పోస్టులకు ఆయా సర్వీస్‌ రూల్స్‌ను నిర్దేశిస్తూ ఆ శాఖ 1990లో జీవో 109 విడుదల చేసింది. పదోన్నతుల ద్వారా కేటగిరి 2 అధికారులకు అడిషనల్‌ డైరెక్టర్‌గా, కేటగిరి 3కు అప్పీలేట్‌ కమిషనర్‌గా, కేటగిరి 4కు సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా, కేటగిరి 5 అధికారులకు స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్లుగా నియమించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేగాక కేటగిరి 6, 7 అధికారుల పదోన్నతి, నేరుగా గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్ల నియామకం గురించి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1959లోని మున్సిపల్‌ కమిషనర్ల సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌లో కూడా మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులన్నీ మున్సిపల్‌ శాఖలో పదోన్నతుల ద్వారానే చేపట్టాలని, ఇతర శాఖల అధికారులను నియమించరాదని స్పష్టం చేసింది. ఈ సర్వీస్‌ రూల్స్‌కు తిలోదకాలిచ్చి రాజకీయ అండదండలతో వివిధ శాఖల అధికారులు మున్సిపల్‌ కమిషనర్లుగా వస్తున్నారని ఆ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. డిప్యూటేషన్లను రద్దు చేసి, మున్సిపల్‌ శాఖలోని అధికారులకు పదోన్నతులు కల్పించి కమిషనర్లుగా నియమించాలని కోరుతున్నారు. 


మున్సిపల్‌ శాఖ.. ఓ ప్రత్యేకం

రెవెన్యూ, రవాణా, వాణిజ్య పన్నులు తదితర శాఖలు ఇతర శాఖల అధికారులను డిప్యూటేషన్‌పై అనుమతించడం లేదు. సాధారణంగా శాఖలను ఆదాయం గడించే శాఖలుగా, వ్యయం చేసే శాఖలుగా వర్గీకరించవచ్చు. మున్సిపల్‌ శాఖకు ఒక ప్రత్యేకత ఉంది. మున్సిపల్‌ శాఖ ఆదాయం గడించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. దీంతో ఈ శాఖలోకి డిప్యూటేషన్‌పై రావడానికి ఇతర శాఖల అధికారులు ఆసక్తి చూపుతున్నారు. రెవెన్యూ, సాంఘిక సంక్షేమ, పంచాయతీ రాజ్‌, వ్యవసాయ, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, పశుసంవర్థక, విద్య, సహకార, ఆడిట్‌, కార్మిక శాఖల అధికారులను మున్సిపల్‌ కమిషనర్లుగా నియమిస్తున్నారు. 

Updated Date - 2022-09-23T10:58:52+05:30 IST