రాకేశ్‌ పసిడి గురి

ABN , First Publish Date - 2021-03-01T09:44:46+05:30 IST

ఫజ్జా వరల్డ్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించిన పారా ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే కాకుండా ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ..

రాకేశ్‌ పసిడి గురి

ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్‌ టోర్నీ


న్యూఢిల్లీ: భారత పారా ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. దుబాయ్‌లో జరిగిన ఫజ్జా వరల్డ్‌ ర్యాంకింగ్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఫైనల్స్‌లో రాకేశ్‌ 143-135 స్కోరు తేడాతో భారత్‌కే చెందిన శ్యామ్‌ సుందర్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు సెమీ్‌సలో 143-138 తేడాతో టర్కీ ఆర్చర్‌ అగ్యాన్‌ను ఓడించి ఫైనల్‌ చేరాడు. కాగా వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం గెలిచిన శ్యామ్‌ సుందర్‌.. మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో పూజా బలియాన్‌తో కలిసి రజత పతకం అందుకున్నాడు. ఇక..రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో హర్విందర్‌ సింగ్‌, పూజా   జోడీ ఫైనల్లో టర్కీ జంటను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. కరోనా విరామం కారణంగా ఏడాది తర్వాత జరిగిన ఈ తొలి అంతర్జాతీయ పారా టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల నుంచి 70 మంది ఆర్చర్లు పోటీపడ్డారు. 



మూడుసార్లు ఆత్మహత్మకు యత్నించి.. 
ఫజ్జా వరల్డ్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించిన పారా ఆర్చర్‌ రాకేశ్‌ కుమార్‌ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే కాకుండా ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. 2017లో అతడు ఈ కెరీర్‌లోకి అడుగుపెట్టాడు. కానీ అంతకు ముందు రాకేశ్‌కు, క్రీడలకు ఎలాంటి సంబంధం లేదు. రోడ్డు పక్కన ఉండే ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.  2009లో జరిగిన ప్రమాదం అతడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కూడా చికిత్సకు భారీగా ఖర్చు కావడంతో కుటుంబానికి భారం కాకూడదనుకుని మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కాపాడగలిగారు.


ఇక భవిష్యత్‌పై దృష్టి సారిస్తుండగా 2017లో స్థానికంగా నిర్వహించిన ఆర్చరీ శిబిరం అతడికి ఓ దారి చూపించింది. అక్కడి కోచ్‌.. రాకేశ్‌ను ఒప్పించి ఆర్చర్‌గా మార్చాడు. పట్టుదలగా లక్ష్యం వైపు గురి పెట్టి పట్టు సాధించాడు. అక్కడి నుంచి అతడి జీవితమే మారిపోయింది. పారాలింపిక్స్‌కు అర్హత సాధించడంతో పాటు ఇప్పటికే అతడి ఖాతాలో మూడు స్వర్ణాలున్నాయి. కేంద్ర క్రీడా శాఖ టాప్‌ స్కీమ్‌లోనూ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలిగాయి. ఇక దేశ ప్రజలు గర్వించేలా ప్రదర్శన కనబర్చడమే తన ముందున్న లక్ష్యమని రాకేశ్‌ కుమార్‌ చెబుతున్నాడు.

Updated Date - 2021-03-01T09:44:46+05:30 IST