Abn logo
Jul 3 2020 @ 04:56AM

పత్రికా సంపాదకత్వం

దాదాపు ముప్పది సంవత్సరాలకు విస్తరించిన తమ పత్రికా సంపాదకత్వంలో శ్రీ ఖాసా సుబ్బారావు కలం నుంచి ఆయన సంపూర్ణంగా విశ్వసించని ఒక అభిప్రాయం కాని, ఒక అక్షరం కాని రాల లేదని చెప్పటం అత్యుక్తి కాదు. నిస్సందేహంగా ఆయన ఆలోచనాపరుడే! ఆయనది దీర్ఘాలోచన కాకపోవచ్చు; దూరాలోచన కాకపోవచ్చు; అయినా, అది నిశితమైన ఆలోచన. అయితే, మేధ కంటే హృదయమే ఆయన ఆలోచనను ఎక్కువ తీర్చి దిద్దుతుందనే అనుమానం అనేక సందర్భాలలో కలుగుతూ వుండేది. మేధను మించి హృదయమే ఆయన లేఖిని పై ప్రబలంగా రాజ్యం చేయబట్టే ఆయన ఏమి వ్రాసినా గుండె కొట్టు కొంటున్న సవ్వడి దానినుంచి వినవచ్చేది! అందు వల్లనే కావచ్చు, విధానాల కంటె కూడా వ్యక్తులకు ఆయన అధిక ప్రాధాన్య మివ్వడం జరిగింది కూడా.


ముఖ్యంగా ఇద్దరు ప్రపముఖ వ్యక్తులు-కొన్ని కొన్ని సమయాలలో శ్రీ ప్రకాశం, మరికొన్ని వేళలలో రాజాజీ-ఆయన జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేశారు. అయితే వారిద్దరిని సయితం అతి తీవ్రంగా, ఎంతో నిర్దాక్షిణ్యంగా ఆయన విమర్శించిన సందర్భాలనేకం. ఆయనతో సన్నిహిత పరిచయం లేనివారికి ఇది ఆయన చంచల ప్రవృత్తికి ఒక నిదర్శనంగా తోచివుండవచ్చు .కాని, సంపాదకీయాల రచనా సమయంలో ఆయనను ఒక్క సారైనా చూచివున్నవారు మాత్రం ఈ విధమైన ఆరోపణ చేయలేరు. అరఠావు కాగితాల పైన, మందపుకొయ్య పలకను ఒత్తుగా పెట్టుకుని, పార్కర్ కలంతో, చిన్ని ముత్యాలను పోలిన కుదురైన అక్షరాలతో, దగ్గరి దగ్గరి పంక్తులతో, ఒక శిల్పాన్ని చెక్కుతున్నట్టు సంపాదకీయాన్ని వ్రాస్తున్నప్పుడు ఆయన బాహ్య జగత్తునే పూర్తిగా మరచిపోతూ వుండేవారు. అప్పుడు సుబ్బారావుగారి ముఖం గంభీర ముద్రాంకితమై వుండేది. ఆయన కన్నుల లోని విశేషమైన ఏకాగ్రత కానవచ్చేది; తాను ఆ క్షణంలో వ్రాస్తున్న ఆ పలుకులపైనే తన జీవితమే కాక, ప్రపంచం భవిష్యత్తే ఆధారపడివున్నట్టుగా ఆయన భావిస్తున్నట్టు అనిపించేది! 


వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలలో ఆర్ద్రత, పత్రికా రచన సందర్భంలో అవసరమైనప్పుడు వజ్ర సన్నిత కఠోరత్వం, వ్యక్తిగత జీవితంలో నిరాడండరత్వం, రచనా విధానంలో శిల్ప వైభవం, ధనం పట్ల నిర్లక్ష్యం, పుస్తకాలంటే మమకారం, రాజకీయ పదవుల పట్ల వైముఖ్యం, రాజకీయాలను తీర్చి దిద్దడం పట్ల విశేషానురక్తి, బట్ట మాసినా, జుట్టు మాసినా పట్టించుకొనకపోవడం, పత్రికలో ఒక చిన్న తప్పు కనపడినా, ఆ రాత్రి కంటికి నిద్ర దూరం కావడం, పరస్పర విరుద్ధంగా తోచే ఇట్టి లక్షణాలతో పదును వారినట్టిది శ్రీ సుబ్బారావు ప్రవృత్తి.

1961 జూన్ 17 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘శ్రీఖాసా సుబ్బారావు’ నుంచి

Advertisement
Advertisement
Advertisement