పనులు చేయలేనప్పుడు...మాకీ పదవులెందుకు?

ABN , First Publish Date - 2022-05-29T06:14:46+05:30 IST

పనులు చేయలేనప్పుడు...మాకీ పదవులెందుకు?

పనులు చేయలేనప్పుడు...మాకీ పదవులెందుకు?
పప్పుశెట్టిపాలెం సచివాలయంలో కార్యదర్శికి రాజీనామా పత్రాలు అందిస్తున్న ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీ ఉప సర్పంచ్‌ సహా ముగ్గురు వార్డు సభ్యులు రాజీనామా

వైసీపీ ప్రభుత్వ తీరు, సర్పంచ్‌ పోకడలపై అసంతృప్తి


గొలుగొండ, మే 28: ‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం...ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం...అటువంటప్పుడు మాకు పదవులు ఉండి దండగ...’ అంటూ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్‌తో పాటు, ముగ్గురు వార్డు సభ్యులు తమ పదవులకు శనివారం రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలివి.

మండలంలోని పప్పుశెట్టిపాలెం పంచాయతీ పాలకవర్గం సుమారు ఏడాదిన్నర క్రితం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్‌గా వైసీపీ మద్దతుతో మాకిరెడ్డి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్‌గా అదే పార్టీ మద్దతుతో మాకిరెడ్డి వరహాలబాబు ఎన్నికయ్యారు. అలాగే, మిగిలిన తొమ్మిది వార్డు స్థానాల్లో టీడీపీ మద్దతుదారునికి ఒక వార్డు, బీజేపీ మద్దతుదారునికి ఒక వార్డు, మిగిలిన ఏడు స్థానాలను వైసీపీ మద్దతుదారులకు కేటాయించారు. అయితే, ఇందులో వైసీపీకి చెందిన కొందరు సభ్యులు ప్రభుత్వ తీరు, సర్పంచ్‌ ఏకపక్ష నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పప్పుశెట్టిపాలెం గ్రామ సచివాలయంలో శనివారం ఉప సర్పంచ్‌ మాకిరెడ్డి వరహాలబాబు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఎనిమిది మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగో వార్డు సభ్యుడు (బీజేపీ) పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే పాలకవర్గ సమావేశం జరిగిందన్నారు. దీంతో ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించే ఆస్కారం లేకపోయిందన్నారు. అంతేకాకుండా పంచాయతీకి విడుదలైన 14, 15 ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.10 లక్షలను పంచాయతీ ఖాతా నుంచి వైసీపీ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. దీనివల్ల వార్డుల్లో ఏ పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. కనీసం గ్రామంలో పేరుకుపోయిన డ్రైనేజీని కూడా తొలగించడం లేదని ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఉప సర్పంచ్‌ వరహాలబాబు మాట్లాడుతూ గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియకుండా సర్పంచ్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పారిశుధ్య కార్మికుల నియామకంపై కూడా తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని పదవులు తమకు అవసరం లేదంటూ ఉప సర్పంచ్‌ మాకిరెడ్డి వరహాలబాబు (వైసీపీ), రెండో వార్డు సభ్యురాలు కుంచా లక్ష్మి (వైసీపీ), ఒకటో వార్డు సభ్యుడు గొడ్డేటి రాజబాబు (టీడీపీ), నాలుగో వార్డు సభ్యుడు పసుపులేటి బాలాజీ (బీజేపీ)లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శి రమణకు సమర్పించారు. వీటిని ఎంపీడీవోకు పంపనున్నట్టు కార్యదర్శి తెలిపారు.


Updated Date - 2022-05-29T06:14:46+05:30 IST