Tea Break: కుదురుకున్న టీమిండియా.. పంత్ అర్ధ సెంచరీ

ABN , First Publish Date - 2022-07-02T02:23:33+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఐదు కీలక వికెట్లు పారేసుకున్న తర్వాత నిలకడ సాధించింది. టాస్

Tea Break: కుదురుకున్న టీమిండియా.. పంత్ అర్ధ సెంచరీ

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఐదు కీలక వికెట్లు పారేసుకున్న తర్వాత నిలకడ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ 46 పరుగులకే శుభమన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13) వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో  అంప్లైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఆ సమయానికి భారత్  రెండు వికెట్లు నష్టపోయి 53 పరుగులు చేసింది.


ఆ తర్వాత కూడా చాలా సేపటి వరకు వర్షం మ్యాచ్‌ను అడ్డుకుంది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే, మైదానం తడిగా ఉండడంతో పరుగులు రావడం కష్టమైంది. ఈ క్రమంలో 20 పరుగులు చేసిన హనుమ విహారి, ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీ (11) పెవిలియన్ పట్టడంతో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న శ్రేయాస్ అయ్యర్ (15) కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు.


దీంతో భారత్ పని అయిపోయిందని అభిమానులు భావించారు. అయితే, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ 49 పరుగుల వద్ద ఫోర్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న పంత్ 6 ఫోర్లు, సిక్సర్‌తో ఆఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు, జడేజా అతడికి అండగా ఉంటూ పరుగులు రాబడుతున్నాడు. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. పంత్ 53, జడేజా 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-07-02T02:23:33+05:30 IST