తమిళనాడు సీఎం అభ్యర్థి విషయంపై ముదురుతున్న వివాదం

ABN , First Publish Date - 2020-10-01T15:29:45+05:30 IST

స్థానిక గ్రీన్‌వేస్‌రోడ్డులోని అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం నివాసంలో

తమిళనాడు సీఎం అభ్యర్థి విషయంపై ముదురుతున్న వివాదం

  • రెండోరోజూ ఓపీఎస్‌ ఇంట నేతల చర్చలు

చెన్నై : స్థానిక గ్రీన్‌వేస్‌రోడ్డులోని అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం నివాసంలో బుధవారం ఆ పార్టీ డిప్యూటీ సమన్వయకర్తలు, మద్దతు దారుల సమావేశం జరిగింది. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధ మవుతున్నాయి. అయితే అధికార అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే విషయంపై తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి.


సీఎం పదవి కోసం ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఆ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరనే విషయంగా ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసింది. 


ఆ సమావేశంలో వీరిద్దరినీ సర్దిచెప్పేందుకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై అక్టోబర్‌ ఏడున ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ప్రకటిస్తారని అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో వివాదాలు సద్దుమణుగుతాయని అందరూ భావించారు. అయితే ఉన్నట్టుండి ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో రహస్య సమావేశాలు జరుపుతుండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మంగళవారం పన్నీర్‌సెల్వం తన నివాసంలో మద్దతుదారులతో సమావేశం జరిపారు. దానికి పార్టీ డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి, మాజీ ఎంపీ మనోజ్‌పాండ్యన్‌ కూడా పాల్గొన్నారు.


కాసేపయ్యాక మరో డిప్యూటీ సమన్వయకర్త వైద్యలింగం కూడా వెళ్ళి పన్నీర్‌సెల్వంను కలుసుకున్నారు. అదే సమయంలో గతేడాది మంత్రి పదవినుండి తొలగింపబడిన రామనాధపురం శాసనసభ్యుడు మణికంఠన్‌, మాజీ నాయకుడు జీసీడీ ప్రభాకరన్‌ తదితరులు కూడా ఓపీఎస్‌ను కలుసుకున్నారు. రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ ఆలస్యంగా వెళ్ళి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం  పార్టీలో ఐకమత్యాన్ని పెంపొందించే సమావేశం జరిగిందని డిప్యూటీ సమన్వయకర్త వైద్యలింగం మీడియాకు చెప్పి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం మళ్ళీ ఓపీఎస్‌ నివాసంలో పార్టీ నేతల సమావేశం ఏర్పాటైంది. మంగళవారం ఓపీఎస్‌ తేనికి బయల్దేరి వెళ్ళారని సమాచారం కూడా వచ్చినా చివరకు ఆయన తేని వెళ్ళకుండా తన నివాసంలో ఉండిపోయారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం మళ్ళీ పన్నీర్‌సెల్వం నివాసంలో మద్దతుదారుల సమావేశం జరిగింది. 


పార్టీ డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి, మాజీ ఎంపీ మనోజ్‌పాండ్యన్‌, మాజీ మంత్రి నత్తం విశ్వనాధన్‌ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. అదే సమయంలో పన్నీర్‌సెల్వం నివాసం వద్ద వేలాదిమంది పార్టీ కార్యకర్తలు గుమికూడి ఓపీఎస్‌కు మద్దతుగా వారు నినాదాలు చేశారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా అక్కడ పహరా కాసారు. ఏదీ ఏమైనప్పటికీ సీఎం అభ్యర్థి విషయంలో పన్నీర్‌సెల్వానికి ముఖ్యమంత్రి ఎడప్పాడికి మధ్య తీవ్ర మనస్పర్థలు ఏర్పడినట్లు ప్రస్తుత పరిస్థితులు రుజువుచేస్తున్నాయి.

Updated Date - 2020-10-01T15:29:45+05:30 IST