ఊహించిన ఫలితాలే..!

ABN , First Publish Date - 2022-02-23T13:49:36+05:30 IST

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఊహించినవేనని, అధికార పార్టీ కృత్రిమమైన గెలుపు పొందిందని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. ఈ ఎన్నికలు నూటికి నూరు శాతం

ఊహించిన ఫలితాలే..!

                       - అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వం


చెన్నై: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఊహించినవేనని, అధికార పార్టీ కృత్రిమమైన గెలుపు పొందిందని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. ఈ ఎన్నికలు నూటికి నూరు శాతం స్వేచ్ఛగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా నిర్వహించి వుంటే అన్నాడీఎంకే ఘన విజయం సాధించి ఉండేదన్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ పార్టీ తరఫున మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజలిచ్చిన సంపూర్ణ విజయంగా భావించకూడ దన్నారు. అన్నాదురై చెప్పినట్లు ‘ప్రజల తీర్పు పరమేశ్వరుడి తీర్పుగా’ తమ పార్టీ భావించి ఈ ఎన్నికల ఫలితాలకు పార్టీ శిరసువంచి అంగీకరిస్తోందని తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు, మిత్రపక్షాల అభ్యర్థులకు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, గతంలో తమ పార్టీ పలుమార్లు ఓటములను చవిచూసిందని, మరలా పుంజుకుని మళ్ళీ మహత్తరమైన విజయాలను సాధించిందన్నారు. కపటంతో ధర్మం తాత్కాలికంగా ఓటమిపాలైనా, మళ్ళీ గెలిచితీరుతందని, ప్రజలవాస్తవిక భావాలను ప్రతిబింబించే విధంగా ప్రజాస్వామ్యబద్ధమైన అవకాశం రాకపోదన్నారు. ప్రజల అభీష్టం మేరకు అన్నాడీఎంకే మళ్ళీ గెలుస్తుంందని, అది తప్పకుండా జరిగితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఈ ఓటమితో క్రుంగి పోకుండా గెలుపోటమలు సమాన మేనని భావించి ఎప్పటిలాగే పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని పన్నీర్‌సెల్వం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-02-23T13:49:36+05:30 IST