రఫ్ఫాడిన రాహుల్.. బెంగళూరు ఓటమి!

ABN , First Publish Date - 2020-09-25T04:55:00+05:30 IST

ప్రేక్షకులు లేకపోయినా ఏమాత్రం టెన్షన్ తగ్గకుండా సాగుతున్న ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

రఫ్ఫాడిన రాహుల్.. బెంగళూరు ఓటమి!

దుబాయ్: ప్రేక్షకులు లేకపోయినా ఏమాత్రం టెన్షన్ తగ్గకుండా సాగుతున్న ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు అడుగడుగునా తడబడింది. చివరకు 109 పరుగులకే చాపచుట్టేసింది. తొలుత పంజాబ్ కెప్టెన్ రాహుల్ స్టేడియంలో బౌండరీల సునామీ సృష్టించాడు. ఏకంగా 14ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగుల భారీ స్కోరుతో అజేయంగా నిలిచాడు.


రాహుల్ బాదుడుతో పంజాబ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాహుల్‌కు మయాంక్ అగర్వాల్(20 బంతుల్లో 26) కూడా కొద్ది సేపు సహకారం అందించాడు. అయితే భారీ లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్.. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో మరో ఓపెనర్ ఫించ్ బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. 21 బంతులు ఎదుర్కొని కేవలం 20 పరుగులే చేయగలిగాడు. ఈ క్రమంలోనే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కీపర్ జోష్ ఫిలిప్పీ(0), విరాట్ కోహ్లీ(1) వెంటవెంటనే అవుటైపోయారు. డివిల్లీర్స్(18 బంతుల్లో 28) కొంతసేపు ఆశలు రేపాడు. కానీ మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఆపై వాషింగ్టన్ సుందర్(27 బంతుల్లో 30) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా చివరకు బిష్ణోయ్ బౌలింగ్‌లోనే మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఉమేష్ యాదవ్‌ను కూడా అవుట్ చేసిన బిష్ణోయ్.. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బిష్ణోయ్‌తో మురుగన్ అశ్విన్ కూడా బౌలింగ్‌లో సత్తా చూపించాడు. వీళ్లిద్దరూ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. మిగతా బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు, షమీ, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Updated Date - 2020-09-25T04:55:00+05:30 IST