ఒకటి కాదు ఆరు!

ABN , First Publish Date - 2022-06-26T05:36:44+05:30 IST

భల్లూకం పేరు వింటే చాలు.. కురుపాం పంచాయతీవాసులు వణికిపోతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఒక ఎలుగుబంటే సంచరిస్తుందని వారు అనుకున్నారు.

ఒకటి కాదు ఆరు!
గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఫారెస్టు రేంజర్‌

   ఎలుగుబంట్ల సంచారంతో ప్రజల భయాందోళన

  అప్రమత్తం చేస్తున్న అధికారులు 

కురుపాం, జూన్‌25: భల్లూకం పేరు వింటే చాలు.. కురుపాం పంచాయతీవాసులు  వణికిపోతున్నారు.  నిన్నమొన్నటి వరకూ ఒక ఎలుగుబంటే సంచరిస్తుందని వారు అనుకున్నారు. అయితే తాజాగా వాటి అడుగుజాడలను బట్టీ ఒకటి కన్నా ఎక్కువే తిరుగుతున్నట్లు తెలియడంతో హడలెత్తిపోతున్నారు. కురుపాం పంచాయతీ టేకరిఖండి గ్రామం సమీపంలో శనివారం ఎలుగుబంట్ల అడుగు జాడలు గ్రామస్థులకు కనిపించాయి. దీంతో వారు భయాందోళన చెందారు.  కొద్దిరోజులుగా ఒక ఎలుగుబంటి భల్లుకోట, టేకరిఖండి,పెళ్లివలస, సూర్యనగర్‌, కొత్త భల్లుకోట ప్రాంతంలో తురుగుతుందని భావించారు. తాజాగా ఈ ప్రాంతంలో మూడు ఎలుగుబంట్లు తిరుగుతున్నట్లు టేకరిఖండి గ్రామస్థులు  గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో  కురుపాం ఫారెస్టు రేంజ్‌ అధికారి బి.మురళీకృష్ణ, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలుగుబంట్ల అడుగులు గుర్తించారు.  గత ఏడాదే పెళ్లివలస గ్రామ పరిసర ప్రాంతంలో రెండు పిల్లలతో ఉన్న ఎలుగుబంటి అడుగు జాడలు గుర్తించామని రేంజ్‌ అధికారి తెలిపారు. ప్రస్తుత ఈ ప్రాంతంలో సుమారు ఆరు ఎలుగుబంట్లు ఉన్నాయని స్పష్టం చేశారు.  టేకరిఖండి ప్రాంతంలో మూడు సంచారిస్తుండగా, ఏగులువాడ, గుమ్మ, గదబవలస, రజ్జిలి ప్రాంతంలో మరో మూడు ఉన్నాయని చెప్పారు.  పనస పండ్ల సీజన్‌ కారణంగా ఎక్కవగా సంచరిస్తున్నాయని,  వర్షాల కారణంగా వాటి కాలి జాడలు ఇప్పడు బాగా కనిపిస్తున్నయని తెలిపారు.  ఇదిలా ఉండగా  ఎలుగుబంట్లు సంచరించే  భల్లుకోట, టేకరిఖండి, పెళ్లివలస, సూర్యనగర్‌, కొత్త భల్లుకోట, రావాడ గ్రామాల్లో ప్రజలను ఫారెస్టు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. 

   


Updated Date - 2022-06-26T05:36:44+05:30 IST