ఒమైక్రాన్‌తో ప్రపంచం హై అలర్ట్!

ABN , First Publish Date - 2021-11-28T09:00:09+05:30 IST

గంట గంటకు ఆంక్షలు పెరుగుతున్నాయి.. ఒక్కొక్క దేశం కట్టడి చర్యలకు దిగుతోంది. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే పరీక్షలకు పంపుతున్నాయి. ఇప్పటికే తమ దగ్గర ఏమైనా వ్యాప్తి జరిగిందా? అని ఆందోళన చెందుతున్నాయి. ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ సృష్టిస్తోన్న కలకలం...

ఒమైక్రాన్‌తో ప్రపంచం హై అలర్ట్!

  • దక్షిణాఫ్రికా మొత్తం ఒమైక్రాన్‌!
  • మరికొన్ని దేశాల్లోనూ కొత్త వేరియంట్‌ కేసుల జాడ
  • ఆగ్నేయాసియాకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు
  • నెదర్లాండ్స్‌లో 61మందికి.. 
  • దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారే
  • యూకేలో 2 కేసులు.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ
  • దక్షిణాఫ్రికా అన్ని ప్రావిన్సుల్లోనూ వేరియంట్‌!


వాషింగ్టన్‌, నవంబరు 27: గంట గంటకు ఆంక్షలు పెరుగుతున్నాయి.. ఒక్కొక్క దేశం కట్టడి చర్యలకు దిగుతోంది. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే పరీక్షలకు పంపుతున్నాయి. ఇప్పటికే తమ దగ్గర ఏమైనా వ్యాప్తి జరిగిందా? అని ఆందోళన చెందుతున్నాయి. ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ సృష్టిస్తోన్న కలకలం. దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రావిన్సుల్లోనూ ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రంఫోసా అత్యవసర సమావేశం నిర్వహించారు. తమ దేశానికి విమానాలను రద్దు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. పర్యాటక కేంద్రాలైన ఆగ్నేయాసియా దేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది. టీకా పంపిణీ వేగిరం చేయాలని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ సూచించారు. శనివారం.. అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియా తదితర అగ్ర దేశాలు సహా శ్రీలంక వంటి చిన్న దేశాలూ ఆఫ్రికా దక్షిణ దేశాలకు విమాన రాకపోకలను రద్దు చేశాయి. మరోవైపు యూకేలో రెండు ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు వచ్చాయి. జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌లోనూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన రెండు విమానాల్లో 600 మంది ప్రయాణికులకు గాను 61 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు.  


వ్యాప్తి వేగంగా ఉంది: జో బైడెన్‌

కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. 8 ఆఫ్రికా దక్షిణ దేశాలపై ప్రయాణ ఆంక్షలను విధిస్తున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ముందుజాగ్రత్తగా గవర్నర్‌ క్యాథీ హోచుల్‌ ఎమర్జెన్సీ విధించారు.


దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్‌

ఒమైక్రాన్‌ కలకలంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలకు దిగుతున్నాయి. ఏ దేశం నుంచి వచ్చినా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రకటించింది. దేశీయ ప్రయాణికులు టీకా పూర్తిగా పొంది ఉండాలని, లేదంటే ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి అని  పేర్కొంది. ఇక దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిని క్వారంటైన్‌లో ఉంచాలని ముంబై కార్పొరేషన్‌ నిర్ణయించింది. మరోవైపు తాము అన్ని చర్యలు తీసుకున్నామని కేరళ  ప్రకటించింది. కేంద్రం పేర్కొన్న మేరకు.. ముప్పు జాబితాలోని 9 దేశాల నుంచి వచ్చినవారికి టెస్టులు చేయాలని గుజరాత్‌ నిర్ణయించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఢిల్లీ ఎల్జీ అనిల్‌ బైజాల్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. కర్ణాటక సైతం 9 దేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు తప్పనిసరి చేసింది. బెంగళూరు వచ్చిన ఇద్దరు దక్షిణాఫ్రికన్లకు పాజిటివ్‌ రావడంతో శాంపిళ్లను జన్యు విశ్లేషణకు పంపారు. కాగా, విద్యాసంస్థల్లో క్లస్టర్‌ కేసులు బయటపడుతుండడంతో సీఎం బస్వరాజ్‌ బొమ్మై అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షలను వాయిదా వేశారు. కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి నెగెటివ్‌ ధ్రువపత్రం తప్పనిసరి చేశారు. 


ధార్వాడలో మరో 99 మంది మెడికోలకు..

కర్ణాటక ధార్వాడలోని శ్రీధర్మస్థల మంజునాథ వైద్య కళాశాలలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారి సంఖ్య 281కు చేరింది. శుక్రవారం వరకు ఈ సంఖ్య 182గా ఉంది. మైసూరులో రెండు కళాశాలలకు చెందిన 48 మంది నర్సింగ్‌ విద్యార్థినులకు కొవిడ్‌ సోకింది. ఒడిసాలోని మయూర్‌భంజ్‌లో ఉన్న చమక్‌పూర్‌ గిరిజన బాలికల పాఠశాలలో 26 మందికి వైరస్‌ సోకింది.


వేగంగా వ్యాప్తి, సులువుగా ఉత్పరివర్తనాలు : ఫౌచీ 

‘ఒమైక్రాన్‌’ వేగంగా వ్యాపించడంతో పాటు సులువుగా జన్యు ఉత్పరివర్తనాలకు లోనయ్యేలా ఉందని అమెరికా ప్రభుత్వ ప్రధాన వైద్యరంగ సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. దక్షిణాఫ్రికా వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్నారు. ‘ఒమైక్రాన్‌’ ప్రపంచ దేశాలకు ఓ మేల్కొలుపు సంకేతమని డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. 


శబరిమలకు వచ్చే.. చిన్నారులకు ఆర్టీపీసీఆర్‌ అక్కర్లేదు

శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిబంధన వర్తించబోదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. దర్శనానికి సంబంధించిన పెద్దల కోసం ప్రభుత్వం ఇంతకు ముందు పలు మార్గదర్శకాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ నిబంధనలు చిన్నారులకు వర్తించవని, వారికి ఎలాంటి పరీక్ష అక్కర్లేదని ప్రభుత్వం వివరించింది. కొవిడ్‌-19 నిబంధనలను మాత్రం తు.చ. తప్పక పాటించాలని సూచించింది.




చైనా అధ్యక్షుడికి ఇబ్బంది కలగకుండా.. డబ్ల్యూహెచ్‌వో కృ‘షి’

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌కు ‘ఒమైక్రాన్‌’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పెట్టిన పేరుపై సరికొత్త చర్చకు తెరలేచింది. తెలుగు వర్ణమాలలో ‘అ’ నుంచి ‘ఱ’ వరకు అక్షరాలు ఉన్నట్టే.. గ్రీకు వర్ణమాలలో ‘ఆల్ఫా’ నుంచి ‘ఒమేగా’ వరకు వరుసగా 24 అక్షరాలు ఉంటాయి. ఇప్పటిదాకా కరోనా వైర్‌సకు సంబంధించిన వెలుగుచూసిన 12 కొత్త వేరియంట్లకు వరుసగా 12 గ్రీకు అక్షరాల పేర్లు పెట్టిన డబ్ల్యూహెచ్‌వో.. 13వ కొత్త వేరియంట్‌ ‘బి.1.1.529’కు మాత్రం మధ్యలో 2 అక్షరాలను (13, 14) వదిలేసి.. నేరుగా 15వ గ్రీకు అక్షరం ‘ఒమైక్రాన్‌’ పేరును కొత్త వేరియంట్‌కు పెట్టింది. ఆ రెండు అక్షరాలు ‘ను’, ‘షి’లను వేరియెంట్‌కు పెట్టకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సాంక్రమిక వ్యాధి నిపుణుడు మార్టిన్‌ కుల్డార్ఫ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఒకవేళ తాజా వేరియెంటట్‌ఉ ‘ను’ అని పేరుపెడితే.. తర్వాత వచ్చే కొత్త వేరియంట్‌కు ‘షి’ అని పేరు పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే చైనా అధ్యక్షుడు ‘షి జిన్‌పింగ్‌’కు ఇబ్బంది కలగొచ్చు. ఆయనకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే ‘ను’, ‘షి’ అక్షరాలను వదిలేసి.. వాటి తర్వాత అక్షరాన్నే డబ్ల్యూహెచ్‌వో పరిగణనలోకి తీసుకొని ఉండొచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-11-28T09:00:09+05:30 IST