Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇటువంటి పెళ్లి ఇంతకుముందెన్నడూ చూసి ఉండరు..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం ప్రపంచానికి కొత్త జీవన విధానాన్ని పరిచయం చేసింది. ఆన్‌లైన్‌లోనే అనేక పనులు చక్కబెట్టుకోవడం సాధారణమైపోయింది. ఇంట్లో కంప్యూటరో, ల్యాప్‌టాపో ఉంటే చాలు.. ఉద్యోగాలు కూడా ఇంట్లోనే చేసుకోగలిగే పరిస్థితులు వచ్చిపడ్డాయి. అయితే.. కరోనా సంక్షోభం కారణంగా పరిచయమైన ఈ కొత్త విధానాన్ని ఓ కుటంబం వివాహానికి కూడా వర్తింప చేసింది. ఫలితంగా.. పెద్ద ఫంక్షన్‌ హాల్లో భాజాభజంత్రీల నడుమ కోలాహలంగా జరగాల్సిన ఓ పెళ్లి వేడుక సింపుల్‌గా ఆన్‌లైన్‌లో జరిగిపోయింది.  రాజస్థాన్‌లో జరిగిన ఈ వివాహం గురించి స్థానికులు మునుపెన్నడూ విని ఉండకపోవడంతో ఇది పెద్ద చర్చకే దారి తీసింది. 

రాజస్థాన్ రాష్ట్రం చూరూ జిల్లాకు చెందిన ప్రొ. గజేంద్ర సింగ్ రాథోడ్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు ప్రియాంగినీ, రెండో కూతురి పేరు నీహారిక. అయితే.. రెండు సంవత్సరాల క్రితం వారు టూరిస్ట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లారు. వారు అక్కడ ఉండగానే కరోనా సంక్షోభం ప్రపంచాన్ని కమ్మేసింది. దీంతో.. వారు సిడ్నీ నగరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం వారి వీసా గడువును పొడిగిస్తూ వచ్చింది. అయితే.. అస్ట్రేలియాకు వెళ్లకమునుపే నీహారిక వివాహం ఆర్ఎస్ షెఖావత్‌తో నిశ్చయమైంది. షెఖావత్ ఉండేది ఆస్ట్రేలియాలోనే. అతడికి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. అయితే.. కరోనా కారణంగా అతడు కూడా స్వదేశానికి రాలేకపోయాడు. ఈ పరిస్థితుల కారణంగా వారి వివాహం ఆలస్యం కాసాగింది. అక్కడే వారికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిద్దామని పెద్దలు భావించినప్పటికీ అర్చకులు దొరకకపోవంతో వాళ్లు క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నారు. 

చివరికి ఆ జంట వివాహాన్ని ఆన్‌లైన్‌లో జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో వధూవరుల కుటుంబసభ్యులందరూ భారత్‌లో వివాహానికి ఏర్పాట్లు చేశారు. వారందరూ స్వగ్రామంలో పెళ్లి తంతు ప్రారంభించారు. పూజారి ఇక్కడ మంత్రాలు చదువుతుండగా... అక్కడ ఆస్ట్రేలియాలో వధూవరులు ఇదంతా ఆన్‌లైన్‌లో చూస్తూ అర్చకుడు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. వరుడు వధువుకు మూడు ముళ్లు వేశాడు. ఎటువంటి అడ్డంకులూ లేకుండా వివాహం జరిగినందుకు వధూవరుల తరపు వారు సంతోషించారు. ఈ హైటెక్ వివాహానికి సంబంధించి వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement