ప్రపంచవ్యాప్తంగా కరోనా క‌రాళ నృత్యం !

ABN , First Publish Date - 2020-07-02T12:52:24+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 1,06,89,623 మందికి సోకిన వైరస్‌ 5 లక్షల మందికిపైనే ప్రాణాలను కబళించింది. అమెరికాతోపాటు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. ఆఫ్రికా ఖండంలో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా క‌రాళ నృత్యం !

ఆఫ్రికాలో కరోనా ఉధృతి

బ్రెజిల్‌లో ఒక్కరోజే 37వేల మందికి వైరస్‌

వాషింగ్టన్‌, జూలై 1: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయం కొనసాగుతూనే  ఉంది. ఇప్పటి వరకు 1,06,89,623 మందికి సోకిన వైరస్‌ 5 లక్షల మందికిపైనే ప్రాణాలను కబళించింది. అమెరికాతోపాటు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. ఆఫ్రికా ఖండంలో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకుంది. ఇక్కడ 4 లక్షల మందికిపైగా వైరస్‌ సోకగా 10 వేల మంది చనిపోయారు. ఒక్క దక్షిణాఫ్రికాలోనే కొత్తగా 6,945 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఆ దేశంలో కేసుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో 43 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14 లక్షల మార్కుని దాటేసింది. మృతుల సంఖ్య 60 వేలు దాటింది. రష్యాలో కొత్తగా 6,556 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మెక్సికోలో మరో 5,432 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 2,26,089కి చేరుకుంది. పాకిస్థాన్‌లో 4,133 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,13,470కి పెరిగింది.


మరోవైపు వైరస్‌ పుట్టినిల్లు చైనాలో కొత్తగా 3 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఆస్ర్టేలియాలోని ప్రధాన నగరం మెల్‌బోర్న్‌లో పాజిటివ్‌ కేసులు బయపడుతుండడంతో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించారు. న్యూజిలాండ్‌లో వరుసగా రెండో రోజు రెండు కేసులు వెలుగుచూశాయి. ఆ దేశంలో 24 రోజుల తర్వాత మళ్లీ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ దేశంలో 21 యాక్టివ్‌ కేసులున్నాయి. దక్షిణ కొరియాలో కొత్తగా 40 మందికి వైరస్‌ సోకింది. వైరస్‌ దెబ్బకు అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారం ఇక్కడ 51,802 మంది పాజిటివ్‌గా తేలారు. ఒక్క రోజులో ఇక్కడ ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దక్షిణాది రాష్ట్రాలైన కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఆరిజోనాలో వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 27 లక్షల మందికిపైనే వైరస్‌ బారిన పడగా.. వారిలో 1.3 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-07-02T12:52:24+05:30 IST