మళ్లీ మహమ్మారి

ABN , First Publish Date - 2022-06-09T06:11:23+05:30 IST

దేశంలో కరోనా కేసులు మళ్ళీ హెచ్చుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల వేగం ఊహకు అందనంత వేగంగా ఉన్నది. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కేసులు...

మళ్లీ మహమ్మారి

దేశంలో కరోనా కేసులు మళ్ళీ హెచ్చుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల వేగం ఊహకు అందనంత వేగంగా ఉన్నది. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కేసులు అత్యధికంగా ఉన్నప్పటికీ, చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదవుతూండటం క్రమంగా మొదలైంది. ఒక్కరోజులో కేసుల సంఖ్య నలభైశాతం వరకూ పెరగడం ప్రమాదం ముంచుకొస్తున్నదన్న సంకేతమే. కేసులు ఎక్కువే ఉన్నప్పటికీ, ఆక్సిజన్ బాధలు, ఆస్పత్రుల్లో చేరికల వంటివి లేవు కనుక ఆ మేరకు సంతోషించాల్సిందే.


అప్రమత్తంగా ఉండండి, కేసులు పెరుగుతున్నాయి, పరీక్షలు పెంచండి అని తెలంగాణ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ కేసు విచారణ సందర్భంలో ఆదేశించింది. ఫలానా వేరియంట్ వల్ల ప్రాణానికి ప్రమాదం లేదనీ, అనారోగ్యలక్షణాలు కూడా తక్కువేనని తేలిపోయిన తరువాత, పరీక్షలు చేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది కనుక, ఆరోగ్యకేంద్రాలకు టెస్టు కిట్ల సరఫరా తగ్గించేసిన రాష్ట్రాలను మనం గతంలో చూశాం. అంతాబాగున్నదనీ, ఏ భయమూ అక్కరలేదని పాలకులు, అధికారులు ఒకపక్క చెబుతూ, ప్రజలు మాత్రం బాధ్యతగా నడుచుకోవాలని కోరుకోవడం సరికాదు. ఇప్పుడు కూడా కొత్త కేసుల్లో తీవ్ర అనారోగ్యలక్షణాలేమీ లేకపోవడం మంచివార్తే కానీ, ఆ కారణంగా ప్రభుత్వాల పక్షాన, ప్రజల్లో కూడా నిర్లక్ష్యం కూడదు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించడం, ఆరోగ్యవ్యవస్థలను సిద్ధంగా ఉంచడం, వరుస జీనోమ్ పరీక్షలతో కొత్త మ్యుటేషన్లు, వేరియంట్లు ఏమైనా కొంపముంచబోతున్నాయేమో  తేల్చుకోవడం అవసరం. ప్రజలు సైతం ఏ మాత్రం అనుమానించే లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం వారికీ, చుట్టుపక్కలవారికీ మేలుచేస్తుంది. 


ఆర్థికానికి ఇబ్బంది రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు కరోనా హానిని తగ్గించి చెప్పడంతో పాటు, జాగ్రత్తల విషయంలోనూ ప్రజలను స్వేచ్ఛగా వదిలేశాయి. మాస్కులు ధరించడం తప్పనిసరికాదనీ, ఎవరికి నచ్చినట్టు వారు ఉండవచ్చునని ప్రకటించాయి. ఇటీవల కరోనా సుదీర్ఘ విరామం ఇవ్వడంతో ప్రజలు ఒక్కసారిగా పార్టీల్లోనూ, యాత్రల్లోనూ మునిగితేలారు. అన్నీ తెరుచుకొని ఉన్న తరుణంలో దేనినీ వదిలిపెట్టకూడదన్నట్టుగా మాస్కులు, దూరాలూ లేకుండా వ్యవహరించారు. కరోనాను, జాగ్రత్తలను జనం దాదాపుగా మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తున్న స్థితిలో ఇప్పుడు మళ్ళీ మాస్కులూ, దూరాల వంటి నిబంధనలను కఠినంగా అమలులోకి తేవలసి వస్తున్నది. విమాన ప్రయాణీకులకు మాస్క్ తప్పనిసరిచేస్తూ, ప్రయాణం అంతా దానిని ధరించాల్సిందేనని డిజిసీఎ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యకూడా ఢిల్లీ హైకోర్టు కఠిన ఆదేశాల నేపథ్యంలో తీసుకున్నదే. 


ఇక, రెండేళ్ళ తరువాత చాలా రాష్ట్రాలు స్కూళ్ళను కాస్తంత ధైర్యంగా తెరుస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసులు పెరగడం పెద్ద సవాలే. కరోనా కారణంగా విద్యార్థులు ఎంతోకాలంగా తరగతి గదుల్లో ప్రత్యక్షంగా కూచొని చదువుకొనే, మిత్రులతో కలసి ఆడుతూపాడుతూ గడపగలిగే అవకాశాన్ని కోల్పోవలసివచ్చింది. ఆన్ లైన్ చదువులన్నవి ఎక్కువమందికి ఎక్కలేదనీ, అందరికీ అందలేదని కూడా తేలిపోయింది. మాస్కులు, దూరాలు, పరిశుభ్రతలకు కట్టుబడుతూ బడులను ధైర్యంగా నడపగలిగే అవకాశం ఈ మారు ఏ మేరకు ఉన్నదీ కొద్దిరోజుల్లోనే బహుశా తేలిపోవచ్చును. పాఠశాలలను కనీసం కొంతకాలంపాటు తెరవలేని పరిస్థితులున్నప్పుడు, గతానుభవాల రీత్యా ఆ లోటు భర్తీచేయడం ఎలాగో ముందుగానే ఆలోచించాలి. న్యాయస్థానాల్లో దబాయించడం ద్వారానో, అంతర్జాతీయ సంస్థలను హెచ్చరించడం ద్వారానో కరోనా లెక్కలను కప్పిపెట్టవచ్చునేమో కానీ, పరిస్థితి తీవ్రత ప్రజలకు అర్థంకాకుండా పోదు. అసత్యాలు, అర్థసత్యాలతో ఎప్పటికప్పుడు నెట్టుకురావడం కాక, ప్రజల మనసుల్లో రక్షకులుగా చిరస్థాయిగా నిలిచిపోయేందుకు పాలకులు కృషిచేయాలి.

Updated Date - 2022-06-09T06:11:23+05:30 IST