పంచాయతీ పాట్లు

ABN , First Publish Date - 2021-10-26T05:18:52+05:30 IST

గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా చెల్లించే సొంత నిధులు ఖర్చు పెట్టుకోలేని దుస్థితిలో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీ సర్పంచ్‌లే సొంత సొమ్ములు పెట్టుబడుతున్నారు.

పంచాయతీ పాట్లు

గ్రామాల్లో పాలన తలకిందులు.. నిస్పృహలో సర్పంచ్‌లు

బిల్లులు మంజూరు కాకపోవడంతో సొంత పెట్టుబడులు

నిధులున్నా ఫలితం సున్నా.. ఖర్చు పెట్టలేని దుస్థితి

పరపతి పోయిందంటూ వాపోతున్న పాలకవర్గాలు 


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

పంచాయతీల్లో పాలక వర్గాలు ఏర్పాటైతే తమ కష్టాలు తొలగిపోతాయని సిబ్బంది ఆశించారు.  పంచాయతీ నిర్వహణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంటాయని భావించారు.సర్పంచ్‌లుగా ఎన్నికైతే పల్లెల్లో తమ పట్టు ఉంటుంది. ఐదేళ్లలో గ్రామానికి సేవ చేసే అవకాశం లభించి గ్రామ ప్రథమ పౌరునిగా చిరస్థాయి పేరు ఉండిపోతుదంటూ సర్పంచ్‌లు సంతోషపడ్డారు. తీరా పదవులు చేపట్టాక తత్వం బోధపడింది. ఆనందం కాస్త ఆవిరైంది. నిధులు కళ్లకు కనిపిస్తున్నా ఖర్చు పెట్టుకోలేని దురవస్థ ఎదురైంది. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందో లేదోనన్న మీమాంస వేధిస్తోంది. గతంలో పనుల కోసం సర్పంచ్‌ల చుట్టూ కాంట్రాక్టర్లు తిరిగేవారు. రహదారుల నుంచి వీధి లైట్లు నిర్వహణ తామే చూస్తామంటూ పోటీపడేవారు. ఇప్పుడు ఒక్క కాంట్రాక్టర్‌ పంచాయతీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వం పది నెలల నుంచి బిల్లులు మంజూరు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. 


గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా చెల్లించే సొంత నిధులు ఖర్చు పెట్టుకోలేని దుస్థితిలో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీ సర్పంచ్‌లే సొంత సొమ్ములు పెట్టుబడుతున్నారు. మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు నిధులు వెచ్చిస్తున్నారు. పంచాయతీ సాధారణ నిధులకు ఒక్కోసారి ప్రభుత్వం బ్రేకులు వేస్తోంది. ఇక ఆర్థిక సంఘం నిధుల కోసం చెప్పాల్సిన పనిలేదు. పొరపాటున ఈ నిధుల నుంచి పనులు నిర్వహిస్తే ప్రభుత్వ స్థాయిలో బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు 14వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి రహదారులు వేశారు. డ్రెయిన్లు నిర్మించారు. మేజర్‌ పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు జిల్లాలో బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. దీంతో కొత్త పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదు. సర్పంచ్‌లే సొంత సొమ్ములు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ బిల్లులు మంజూరు కాకపోవడంతో లబిదిబోమంటున్నారు. గడచిన జనవరి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పాత బిల్లులు మంజూరు కాలేదు. వాటినే కొత్తగా మళ్లీ పెట్టాలని  ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు మళ్లీ బిల్లులు పెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోంది. బిల్లులు విడుదల చేయడం లేదు. మంచినీటి సరఫరా కోసం అప్పులు  చేయాల్సి వస్తోంది. పంచాయతీల్లో కేవలం సిబ్బంది వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఆ మేరకే ప్రతినెలా బిల్లులు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో సూపర్‌ శానిటేషన్‌ నిర్వహించాలన్నా.... జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నెరవేర్చాలన్నా సరే సొంత నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పనులు పూర్తి చేసి బిల్లులు పెట్టుకున్నా సరే ప్రభుత్వం విడుదల చేయడం లేదు. 


పొడిగించినా ఫలితం సున్నా 

గడచిన మార్చి నుంచి 14వ ఆర్థిక సంఘం నిధుల గడువు ముగిసిపోతోందని పంచాయతీ సిబ్బంది కంగారుపడ్డారు. ప్రభుత్వం మరో ఏడాది గడువు పెంచుతూ కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుంది. ఫలితంగా పంచాయతీ సిబ్బంది సంబరపడ్డారు. నిదానంగా పనులు చేసుకోవచ్పని తలపోశారు. కానీ ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. జిల్లాలోని పంచాయతీలు 14వ ఆర్థిక సంఘం నిధులతో తాజాగా చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు. మరోవైపు ఖర్చు పెట్టని పంచాయతీ నిధులను విద్యుత్‌ బిల్లులకు జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలా గడువు పొడిగించినా సరే ఆర్థిక సంఘం నిధులతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఇప్పుడు పాలకవర్గాలు, పంచాయతీ సిబ్బంది లబోదిబోమంటున్నారు. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు తొలి విడతగా జిల్లాలోని పంచాయతీలకు రూ.34.85 కోట్లు విడుదల చేశారు. వాటి నుంచైనా పనులు నిర్వహిద్దామంటే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందన్న గ్యారంటీ లేదు. మరోవైపు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్ని నెలలుగా బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో వున్న బిల్లులు వివరాలను పంపాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఆ పనిలో పంచాయతీ సిబ్బంది నిమగ్నమయ్యారు. అయినా బిల్లులు మంజూరవుతాయన్న భరోసా లేకపోయింది. 


ఇటువంటి ఇబ్బంది చూడలేదు

పోతుల అన్నవరం, సర్పంచ్‌, పెదతాడేపల్లి 

ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏదో ఒక పదవిలో ఉన్నాను. ఏ రోజు పంచాయతీలు ఇటువంటి ఇబ్బందులు చూడలేదు. నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడం తొలిసారి చూస్తున్నాం. సొంతంగా పెట్టుబడి చేసి పనులు పూర్తిచేశాం. వాటికి బిల్లులు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ల వద్ద మా పరపతి పోయింది. పనులు అప్పగిస్తుంటే ముఖం చాటేస్తున్నారు. కొద్దిపాటి ఖర్చులకు సొంత సొమ్ములు వెచ్చిస్తున్నాం. ప్రభుత్వం పంచాయతీల విషయంలో ఆలోచన చేయాలి. తన గుప్పిట్లో పాలన పెట్టుకునే దురాలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. 


Updated Date - 2021-10-26T05:18:52+05:30 IST