పంచలోహ విగ్రహాల విక్రయానికి యత్నం

ABN , First Publish Date - 2021-10-19T05:50:16+05:30 IST

పొలాన్ని చదును చేస్తుండగా బయటపడిన పంచలోహ విగ్రహాలను ప్రభుత్వానికి అప్పగించకుండా విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు సభ్యులముఠాను అరండల్‌పేట పోలీసులు అరెస్టుచేశారు.

పంచలోహ విగ్రహాల విక్రయానికి యత్నం
పంచలోహ విగ్రహాలను పరిశీలిస్తున్న అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీ సుప్రజ

ఆరుగురు నిందితుల అరెస్టు, విగ్రహాలు స్వాధీనం

గుంటూరు, అక్టోబరు18: పొలాన్ని చదును చేస్తుండగా బయటపడిన పంచలోహ విగ్రహాలను ప్రభుత్వానికి అప్పగించకుండా విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు సభ్యులముఠాను అరండల్‌పేట పోలీసులు అరెస్టుచేశారు. ఈ మేరకు సోమవారం పోలీసు కార్యాలయంలో అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపల్లెకు చెందిన వంగిపురం సుందరరావు తన పొలాన్ని గత నవంబరులో జేసీబీతో చదును చేయించి ట్రాక్టర్‌తో గొర్రు తోలుతుండగా ఓ తెల్లటిగోతం మూట బయట పడింది. అందులో శివపార్వతుల దేవతామూర్తుల విగ్రహాలు ఉండడంతో అవిబంగారపు విగ్రహాలనుకొని ఎవరికీ చెప్పకుండా అమ్ముకుందామని ఇంట్లో దాచిపెట్టాడు. ఆ తర్వాత అతను రోడ్డుప్రమాదంలో గాయపడడంతో అవసరమైన డబ్బుల కోసం తన అన్న కుమారుడు రవిని ఇంటికి పిలిపించి తనకు దొరికిన విగ్రహాలను విక్రయించేందుకు సహకరించాలని కోరాడు. దీంతో రవి తనకు గుంటూరులో తెలిసినవారు ఉన్నారని, వారి ద్వారా విక్రయిద్దామని చెప్పాడు. 15 రోజుల క్రితం పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన జనరాజుపల్లి చిట్టిబాబు, రొంపిచర్ల మండలం అన్నవరానికి చెందిన రాపూరి నవీన, రాపూరి వెంకటరావులు ఆయా విగ్రహాలను తీసుకుని నగరంలోని గౌతమినగర్‌ 2వ లైనుకు చెందిన కొండముది శ్యామ్‌ వద్దకు వచ్చారు. వీరంతా కలిసి హనుమయ్యనగర్‌ 1వ లైనుకు చెందిన బెజవాడ శ్రీనివాసరెడ్డిని సంప్రదించారు. దీంతో వీరు తమకు తెలిసిన కొరిటెపాడుకు చెందిన తాకట్టు వ్యాపారి రవిని సంప్రదించగా ఆయన కొనుగోలు చేసేందుకు నిరాకరించాడు.  వేరెవరికైనా విక్రయిద్దామని ఈనెల 17న కొరిటెపాడు పార్కు సెంటరు వద్ద వీరంతా ఉండగా వెస్టు డీఎస్పీ సుప్రజకు అందిన సమాచారం మేరకు అరండల్‌పేట సీఐ నరేష్‌కుమార్‌, ఎస్‌ఐలు రవీందర్‌, సత్యనారాయణ, సిబ్బంది దాడిచేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు పది లక్షల విలువైన నాలుగుకిలోల బరువు ఉన్న శివపార్వతుల పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన సుందరరావు అన్న కుమారుడైన రవిని అరెస్టు చేయాల్సివుంది. ఆయా విగ్రహాలను పురావస్తు శాఖకు అప్పగిస్తామని, అలాగే, ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహాలు చోరీకి గురయ్యాయా అనేది కూడా తెలుసుకుంటామన్నారు.  

Updated Date - 2021-10-19T05:50:16+05:30 IST