ముదురుతున్న ‘పంచాయితీ’

ABN , First Publish Date - 2020-11-29T05:56:57+05:30 IST

గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్లను కల్పించింది.

ముదురుతున్న ‘పంచాయితీ’
డీపీవో కార్యాలయం ముందు బరంపూర్‌ సర్పంచ్‌, వార్డుసభ్యుల నిరసన

సర్పంచ్‌లకు చుక్కలు చూపిస్తున్న ఉప సర్పంచ్‌లు

 మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ‘జాయింట్‌’ వివాదాలు

 తాజాగా బరంపూర్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల మధ్య విభేదాలు

 అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న ఆధిపత్య పోరు

 పంచాయతీ చట్టాలు, బాధ్యతలపై అవగాహన కరువు

ఆదిలాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):  ఇదంతా భాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల మధ్య జాయింట్‌ చెక్‌పవర్‌  విభేదాలకు కారణమవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం 2018 అమలు, నేరుగా పంచాయతీలకు నిధుల మంజూరు, ప్రతీ పంచాయతీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో నిధుల ఖర్చు కూడా వేగంగానే జరుగుతుంది. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ కావడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకుంటుండగా.. మెజార్టీ గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేకపోవడంతో అధికారుల వద్దకు పంచాయతీలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగి రెండేళ్లు దగ్గర పడుతున్న గ్రామ స్థాయి రాజకీయాలు చల్లారడం లేదు. మాట వినని సర్పంచ్‌లను తమదారికి తెచ్చుకునేందుకు కొందరు ఉప సర్పంచ్‌లు చెక్‌లపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇలాంటి వివాదాలతోనే ఇప్పటి వరకు ఒకరిద్దరు ఉప సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలకు గాను సగానికి పైగా గ్రామాలలో వివాదాలే కనిపిస్తున్నాయి. అయితే వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే చెక్‌పవర్‌ సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు నిరక్షరాస్యులు కావడంతోనే నూతన పంచాయతీరాజ్‌ చట్టం, విధులు, బాధ్యతలపై అవగాహన కరువైనట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామ పంచాయతీల వారీగా చట్టాలపై విధుల పట్ల అవగాహన కల్పిస్తే కొంతమేరకైనా వివాదాలు సద్దుమనిగే అవకాశం ఉంటుంది. 

పోటాపోటీగా ఫిర్యాదులు

గ్రామాల్లో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటికే బోథ్‌ మండలం గుర్రాలతండా సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల మధ్య వివాదాలు తలెత్తడంతో ఉప సర్పంచ్‌ చెక్‌పవర్‌ను రద్దు చేసి మండల ఎంపీడీవోకు అధికారాలను బదిలీ చేశారు. అలాగే జైనథ్‌ మండలం బోరజ్‌ సర్పంచ్‌ విధులు సక్రమంగా నిర్వహించం లేదన్న ఫిర్యాదులతో సర్పంచ్‌ పై సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా తలమడుగు మండలం బరంపూర్‌ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల మధ్య చెక్‌పవర్‌ విభేదాలు తలెత్తడంతో నిధుల డ్రాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శనివారం సర్పంచ్‌తో కలిసి పలువురు వార్డు సభ్యులు జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారని, గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన డబ్బులను సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులను నాసిరకంగా చేస్తూ, గిరిజన మహిళ సర్పంచ్‌పై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని బరంపూర్‌ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఎవరి దారి వారిదే..

గ్రామస్థాయి నేతలకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో పార్టీల వారీగా విడిపోతున్న సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు ఎవరిదారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రూపులుగా విడిపోయి పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వస్తుండగా.. మరికొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల ఒంటెద్దు పోకడలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులంతా ఓ వర్గంగా ఏర్పడి సర్పంచ్‌లపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీనికి తోడు గ్రామ వీడీసీల తీర్మానాలు వివాదాలకు దారితీస్తున్నాయి. బోథ్‌ మండలం ఘన్‌పూర్‌, సిరికొండ మండలం రాంపూర్‌(బి), ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌(బి), తలమడుగు మండల కేంద్రం, జైనథ్‌ మండలం దీపాయిగూడ గ్రామ పంచాయతీలపై పలు రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇరువర్గాల వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. చిన్నచిన్న సమస్యలు పంచాయతీల్లోనే పరిష్కరించుకొనే అవకాశం ఉన్న పంతం నెగ్గించుకునేందుకు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అలాగే నేతల అండదండలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కక్షపూరిత వాతావరణానికి దారి తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో పచ్చగా, ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు పగలు, పంతాలతో రగిలి పోతున్నాయి. 

గాడితప్పుతున్న ‘పల్లె ప్రగతి’

మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో హరతహారం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల సమ్మత్తితోనే నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయతే, వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో గ్రామ ప్రగతి గాడితప్పే ప్రమాదం ఏర్పడుతుంది. సకాలంలో నిధులు ఖర్చు చేయక పోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి గెలుపొందిన సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఉప సర్పంచ్‌ వేధింపులకు గురి చేస్తున్నారు

: సిడాం భగీర్తబాయి, సర్పంచ్‌, బరంపూర్‌, తలమడుగు మండలం

గిరిజన మహిళా సర్పంచ్‌నైనా తనను, మా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. పంచాయతీ నిధులను డ్రా చేయకుండా చెక్కులపై సంతకాలు చేయడం లేదు. మరుగుదొడ్ల నిర్మాణాలకు మంజూరైన నిధులను సొంత ఖర్చులకు వాడుకున్నారు. అలాగే గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండానే ఇష్టారాజ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను చేపడుతు న్నారు. గ్రామాభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదు. గ్రామ పంచాయతీ అధికారులను, వార్డు సభ్యులను అసభ్యకరంగా దూషిస్తున్నారు. 

అభివృద్ధికి సహకరించాలి

: శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్‌

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధికి సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు ఇద్దరు పూర్తిగా సహకరించాలి. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపట్టాలి. చెక్కులపై సంతకాలు చేయని ఉప సర్పంచ్‌లపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో పనులు వేగవంతమయ్యేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2020-11-29T05:56:57+05:30 IST